మూడు వారాల గరిష్టం..

మూడు వారాల గరిష్టం..


జీఎస్‌టీ జోష్‌తో లాభాల  మార్కెట్...

* చైనా పతనాన్ని పట్టించుకోని ఇన్వెస్టర్లు

* 170 పాయింట్ల లాభంతో 26,128కు సెన్సెక్స్


* 59 పాయింట్ల లాభంతో 7,943కు నిఫ్టీ

డిసెంబర్ సిరీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ తొలిరోజైన శుక్రవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు అంతంతమాత్రంగానే ఉన్నా  ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందగలదన్న అంచనాలతో స్టాక్ సూచీలు లాభపడ్డాయి.



ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  7900 పాయంట్ల మార్క్‌ను దాటింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 170 పాయింట్లు లాభపడి 26,128 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 7,943 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలకు  ఇది మూడు వారాల గరిష్ట స్థాయి. బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, లోహ, పీఎస్‌యూ, ఐటీ, రియల్టీ షేర్లు లాభపడ్డాయి. వరుసగా స్టాక్ మార్కెట్ రెండో వారమూ లాభాల్లోనే ముగిసింది. ఈ వారంలో సెన్సెక్స్ 260 పాయింట్లు, నిఫ్టీ 86 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి.



ఈ రెండు సూచీలు 1 శాతం చొప్పున ఎగిశాయి.ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లను శుక్రవారం సాయంత్రం టీకి ఆహ్వానించడం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందుతుందన్న అంచనాలతో  డిసెంబర్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ సిరీస్ తొలి రోజు శుక్రవారమే తాజా పొజిషన్లు బిల్డ్ కావడం కూడా మార్కెట్‌కు కలసివచ్చింది.



చైనా మార్కెట్ భారీగా నష్టపోయినప్పటికీ, జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందుతాయనే అంచనాలు మెరుగుపడడంతో స్టాక్ మార్కెట్ లాభపడిందని నిపుణులంటున్నారు.  ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించాయంటూ కొన్ని బ్రోకరేజ్ సంస్థలపై చైనా ప్రభుత్వం నిషేధం విధించడంతో చైనా మార్కెట్ భారీగా నష్టపోయింది. ఇతర ఆసియా మార్కెట్లు కూడా క్షీణించాయి.

 

హిందాల్కో 3.2 శాతం అప్.

అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో రాగి ధరలు కోలుకోవడంతో లోహ షేర్లు లాభపడ్డాయి. హిస్రి మైనింగ్‌ను జార్ఖండ్ ప్రభుత్వం అనుమతించనున్నదన్న వార్తలు కూడా హిందాల్కో జోరుకు కారణమయ్యాయి. ఈ షేర్ 3.4 శాతం లాభంతో రూ.78 వద్ద ముగిసింది.  టాటా స్టీల్, వేదాంత, 1-3 శాతం రేంజ్‌లో పెరిగాయి.  పశ్చిమ ఆఫ్రికా దేశం కోట్ డి ఐఓర్(ఐవరీ కోస్ట్) నుంచి 3600 వాహనాలను కొనుగోలుకు సంబంధించి 20 కోట్ల డాలర్ల ఆర్డర్ లభించడంతో ఆశోక్ లేలాండ్ షేర్ 4 శాతం లాభపడి రూ. 98 వద్దముగిసింది.



30 సెన్సెక్స్ షేర్లలో 22 షేర్లు లాభాల్లో ముగిశాయి.  ఎస్‌బీఐ, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభపడగా, టాటా మోటార్స్, లుపిన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, బజాజ్ ఆటో. గెయిల్ షేర్లు 1-2 శాతం రేంజ్‌లో నష్టపోయాయి. 1,391 షేర్లు లాభాల్లో, 1,251 షేర్లు నష్టాల్లో ముగిశాయి.

 

లాజిస్టిక్స్ జోరు...

జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందుతుందన్న అంచనాలతో లాజిస్టిక్స్ కంపెనీలు శుక్రవారం కూడా తమ లాభాల జోరును కొనసాగించాయి. ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గతి, గేట్‌వే డిస్ట్రిపార్క్స్, స్నోమన్ లాజిస్టిక్స్, సికాల్ లాజిస్టిక్స్, టీసీఐ ఇండస్ట్రీస్, పటేల్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ 1-5 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి.

 

ఎస్‌బీహెచ్‌కి అవార్డు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన సిద్ధిపేట శాఖ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం అమల్లో దేశంలోనే అత్యుత్తమ పని తీరును కనపర్చింది. దీనికి సంబంధించి న్యూ ఢిల్లీలో  కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా చేతులు మీదుగా అవార్డు అం దుకుంటున్న ఎస్‌బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ.

 

వీకో సంస్థకు బ్రాండ్ ఎక్స్‌లెన్సీ అవార్డ్

వీకో సంస్థకు ఏబీపీ బ్రాండ్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ లభించింది. మార్కెటింగ్ క్యాంపెయిన్ కేట గిరిలో ఈ అవార్డు గెల్చుకున్నామని వీకో ఒక ప్రకటనలో తెలిపింది. పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, తట్టుకొని నిలబడగలిగామని వీకో ల్యాబొరేటరీస్ డెరైక్టర్ సంజీవ్ పెంధార్కర్ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top