ఉద్యోగుల ఆశలపై నీళ్లు

ఉద్యోగుల ఆశలపై నీళ్లు - Sakshi


ఆదాయ పన్ను బేసిక్ లిమిట్ జోలికెళ్లని ఆర్థిక మంత్రి

ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపు పెంపు

వృద్ధులు, వికలాంగులకు మరిన్ని పన్ను రాయితీలు

అనాదిగా వస్తున్న సంపద పన్ను రద్దు

సాక్షి, బిజినెస్ విభాగం:
కోట్ల మంది నెల జీతంపైనే ఆధారపడ్డ మన దేశంలో ప్రతి ఏటా బడ్జెట్‌కు ముందు ప్రధానంగా చర్చకు వచ్చేది ఆదాయపు పన్ను గురించే. ‘‘ఈ సారి బేసిక్ లిమిట్ పెంచుతారా?’’ ప్రతి వ్యక్తీ బడ్జెట్‌కు ముందు అడిగే ప్రశ్న ఇదొక్కటే.



ఎందుకంటే బేసిక్ లిమిట్ పెంచితే జీతం డబ్బుల్లో కొంత జేబులో మిగిలే అవకాశముంటుంది. అలా కాకుండా పన్ను మినహాయింపులు పొందేందుకు వీలుగా పొదుపు పరిమితులను పెంచినా, పన్ను లేని బాండ్లు ప్రవేశపెట్టినా... ఇలాంటివెన్ని చేసినా సామాన్యుడి నుంచి ప్రతిస్పందన ఉండదు. ఎందుకంటే అవన్నీ జేబులో డబ్బులుండి అదనంగా ఖర్చు చేయగలిగిన వారికే కనక. కాకుంటే ఈ సారి బడ్జెట్లో బేసిక్ లిమిట్‌ను ప్రస్తుతం ఉన్న 2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచవచ్చని ఎందరు అంచనా వేసినా... ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం ఆ జోలికెళ్లలేదు. అయితే నెలకు కోటి రూపాయల ఆదాయం దాటిన వారికి మాత్రం 2 శాతం సర్‌చార్జి వడ్డించారు.



ఇప్పటిదాకా 10 శాతంగా ఉన్న సర్‌చార్జీని 12 శాతానికి పెంచారు. మధ్య తరగతి వేతన జీవులకు జైట్లీ ఇచ్చిన ఉపశమనాలు ఒకటిరెండే. వాటిలో మొదటిది జీతంలో ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌గా చెల్లించే మొత్తంలో పన్ను మినహాయింపు లభించే మొత్తం ఇప్పటిదాకా నెలకు రూ.800గా ఉంది. దీన్ని రెట్టింపు చేశారు. ఇకపై రవాణా భత్యంగా కంపెనీ ఎంత చెల్లించినా గరిష్టం గా నెలకు రూ.1600 వరకు పన్ను మినహాయింపు లభిస్తుందన్న మాట. రెండోది... హెల్త్ ఇన్సూరెన్స్‌లపై కట్టే ప్రీమియానికిచ్చే మినహాయింపు పరిమితిని పెంచారు. దీనివల్ల అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారని,



దేశంలో అందరికీ ఆరోగ్య భద్రత లభిస్తుందని చెప్పారు. ఆ పెంపు ఏ మేరకు చేశారంటే...

 ష    ఆరోగ్య బీమా కోసం ఎంత మొత్తాన్ని ప్రీమియంగా చెల్లించినా ఇప్పటిదాకా రూ.15,000కు మాత్రమే పన్ను మినహాయింపు వర్తించేది. దీన్నిపుడు రూ.25,000కు పెంచారు.

 ష    60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్ల విషయంలో ఈ మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న రూ.20,000 నుంచి రూ.30,000కు పెంచారు.

 ష    80 ఏళ్లు దాటిన వృద్ధులు గనక హెల్త్ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయని పక్షంలో వారికి రూ.30,000 వరకు వివిధ చికిత్సలకయ్యే వ్యయానికి మినహాయింపు వర్తింపజేస్తారు.

 ష    80 ఏళ్లు దాటిన వారు కొన్ని ప్రత్యేక వ్యాధులకు చేసే చికిత్స వ్యయాన్ని ప్రస్తుతం రూ.60,000 వరకు మినహాయింపునకు అనుమతిస్తున్నారు. దీన్నిపుడు రూ.80,000కు పెంచారు.

 ష    వికలాంగులకు ప్రస్తుతమనున్న మినహాయింపు పరిమితిని మరో రూ. 25,000 పెంచారు.

 

పెన్షన్ ఫండ్ మినహాయింపు పెంపు..

ఆరోగ్య బీమాతో పాటు పెన్షన్ ఫండ్‌లో గానీ, కొత్త పింఛను పథకంలో గానీ ఇన్వెస్ట్ చేస్తే ఇచ్చే మిన హాయింపు మొత్తాన్ని రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు. ఇది కాక అదనంగా కొత్త పింఛను పథకంలో గనక ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ 80సీసీడీ కింద మరో రూ.50,000 మినహాయింపు ఇస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. అదే వృద్ధులకైతే వరిష్ట బీమా యోజన కింద సేవా పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఇక ఇటీవలే బాలికల కోసం ప్రవేశపెట్టిన సుకన్య-సమృద్ధి పథకానికి ఇప్పటికే పన్ను మినహాయింపు ఉంది. అయితే ఇకపై లబ్ధిదారులకు చేసే చెల్లింపులు, సదరు డిపాజిట్లపై వడ్డీకి కూడా మినహాయింపు  లభిస్తుంది. మొత్తంగా వివిధ సెక్షన్ల కింద తాను రూ.4,44,200 మినహాయిస్తున్నట్లు తెలియజేశారు.

 

సంపద పన్ను రద్దు... సర్‌చార్జీ వడ్డన

సంపద పన్నును (వెల్త్ ట్యాక్స్) జైట్లీ రద్దు చేశారు. నిజానికి ఇదో చిత్రమైన పన్ను. ఏళ్ల తరబడి సవరించకుండా కొనసాగుతున్న అర్థం లేని పన్ను. దీనిప్రకారం ఏ వ్యక్తయినా రూ.30 లక్షలకన్నా ఎక్కువ విలువైన ఆస్తిని కలిగి ఉంటే దానిపై ఒక శాతం సంపద పన్ను చెల్లించాలి. నిజానికిది ఎప్పుడో భూముల విలువలు పాతాళంలో ఉన్నపుడు తెచ్చిన పన్ను. కానీ ఇపుడు పల్లెటూళ్లలో సైతం ఎకరా రూ.30 లక్షలపైనే పలుకుతోంది. మరి రైతులు తమ భూముల విలువలపైనా పన్నులు చెల్లించాలా? చట్ట ప్రకారం నిజానికి చెల్లించాల్సి ఉన్నా... ఇది అర్థం లేని పన్ను కనకనే అధికారులు కూడా మామూలు వ్యక్తుల విషయంలో దీన్ని విధించే సాహసమేదీ చెయ్యలేదు.



అందుకే ఈ పన్నును తొలగిస్తున్నట్లు జైట్లీ స్పష్టం చేశారు. దీని బదులు నెలకు రూ.కోటికన్నా ఎక్కువ ఆదాయం ఉండే వ్యక్తులు, హిందూ కుటుంబాలు, సంస్థలు, కో-ఆపరేటివ్ సొసైటీలు, స్థానిక సంస్థల ఆదాయంపై 2 శాతం సర్‌ఛార్జీ విధించారు. ప్రస్తుతం ఈ సర్‌ఛార్జీ 10 శాతంగా ఉంది. నిజానికి రూ.కోటి దాటి ఆదాయం ఉంటోంది కనక వీరు అత్యధిక శాతం... అంటే 30 శాతం శ్లాబ్‌లో ఉంటారు. ఆ 30పై 10 శాతం సర్‌ఛార్జీ చెల్లిస్తున్నారు. ఇపుడది 12 శాతం అయినట్లన్న మాట.

 

బాబోయ్..  ఎంత పన్ను!

రూ.10 వేల పన్ను కట్టాలంటేనే మనం బాబోయ్ అంటాం..! ఆ మొత్తాన్ని మిగిల్చుకోవడానికి నానా తంటాలు పడుతుంటాం. మరి కోట్లు కోట్లు ట్యాక్స్ కట్టాల్సి వస్తే..? అవును మన దేశంలో కొన్ని కంపెనీలు వేల కోట్లలోనే పన్నులు చెల్లిస్తుంటాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్నులు కట్టిన టాప్-10 కంపెనీలను ఓసారి చూస్తే...

 

డీటీసీ అటకెక్కినట్లే...

డెరైక్ట్ ట్యాక్స్ కోడ్. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం ముద్దుబిడ్డ. ఏడేళ్ల కిందట ఆయన ప్రతిపాదించిన ఈ చట్టం ఇప్పటిదాకా చర్చల్లోనే ఉంది. యూపీఏ ప్రభుత్వం దీన్ని గతేడాది సవరించి... సరికొత్త ముసాయిదాను తెచ్చింది కూడా. ఇది గనక అమల్లోకి వస్తే ఆదాయపు పన్ను బేసిక్ లిమిట్ రూ.2 లక్షలుగా ఉండాలి. పెపైచ్చు ఇపుడున్న మూడు శ్లాబులతో పాటు రూ.10 కోట్ల ఆదాయం దాటిన శ్రీమంతుల కోసం 35 శాతంతో మరో శ్లాబు కూడా దీన్లో ఉంది. నిజానికి ప్రస్తుతం ఆదాయపు పన్ను బేసిక్ లిమిట్ రూ.2.5 లక్షలుగా ఉంది. అరుణ్ జైట్లీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. డీటీసీ తీసుకురావాల్సిన అవసరం ఇక లేదన్నారు.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top