సెన్సెక్స్‌ 206 పాయింట్లు డౌన్‌

సెన్సెక్స్‌ 206 పాయింట్లు డౌన్‌


9,400 పాయింట్ల దిగువన నిఫ్టీ

ఇండో–పాక్‌ సరిహద్దు ఉద్రిక్తతల ప్రభావం




ముంబై: ఇండో–పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తడం, బ్రిటన్‌లో టెర్రరిస్టు దాడులు జరగడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడటంతో మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 206 పాయింట్లు నష్టపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే స్వల్ప తగ్గుదలతో 30,553 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ 30,316 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయి, చివరకు 30,365 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 52 పాయింట్లు నష్టపోయి 9,400 పాయింట్ల స్థాయి దిగువన 9,386 పాయింట్ల వద్ద ముగిసింది. మే నెల డెరివేటివ్‌ కాంట్రాక్టులు వచ్చే గురువారం ముగియనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో ఫార్మా, బ్యాంకింగ్‌ షేర్లు బాగా నష్టపోయాయి. ఇండో–పాక్‌ల మధ్య హఠాత్తుగా ఉద్రిక్తతలు తలెత్తడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌  నాయర్‌ చెప్పారు.



22 సెన్సెక్స్‌ షేర్లకు నష్టాలు..

సెన్సెక్స్‌–30 షేర్లలో 22 షేర్లు నష్టాలతో ముగిసాయి. అన్నింటికంటే ఎక్కువగా ఆదాని పోర్ట్స్‌ 6 శాతం క్షీణించి రూ. 332 వద్ద ముగిసింది. ప్రధాన ఫార్మా షేర్లతో పాటు బజాజ్‌ ఆటో, గెయిల్, కోల్‌ ఇండియా షేర్లు 2–3 శాతం మధ్య క్షీణించాయి. ఎస్‌బీఐ 1.8 శాతంపైగా తగ్గింది.  పెరిగిన షేర్లలో మారుతి, మహింద్రా, టాటా స్టీల్, హీరోమోటో కార్ప్‌లు వున్నాయి.



ఎఫ్‌అండ్‌ఓ విభాగం చిన్న కౌంటర్లలో భారీ ఆఫ్‌లోడింగ్‌...

మరో రెండు రోజుల్లో డెరివేటివ్‌ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ విభాగంలో ట్రేడయ్యే తక్కువ ధర గల షేర్లలో పెద్ద ఎత్తున ఆఫ్‌లోడింగ్‌ జరగడంతో ఆ షేర్లు బాగా తగ్గాయి. వీటిలో జేపీ అసోసియేట్స్‌ అన్నింటికంటే అధికంగా 13% పతనమై రూ. 9.90 వద్ద ముగిసింది. కాగా సన్‌ఫార్మా విదేశీ సబ్సిడరీ టారో ఫార్మాస్యూటికల్స్‌ త్రైమాసిక ఫలితాలు బలహీనంగా వుండటంతో అమెరికాలో భారత్‌ కంపెనీ జెనరిక్‌ మందుల వ్యాపారం సమస్యాత్మకంగా వుందన్న అంచనాలతో ఫార్మా షేర్లు భారీగా పడ్డాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top