బుల్‌ ధనాధన్‌

బుల్‌ ధనాధన్‌


సెన్సెక్స్‌ టాప్‌ గేర్‌... 448 పాయింట్లు జూమ్‌

30,750 వద్ద క్లోజింగ్‌; కొత్త రికార్డు

గత రెండు నెలల్లో ఒకరోజు అత్యధిక లాభమిదే

రేట్ల పెంపుపై ఫెడ్‌ ఊరట వ్యాఖ్యలతో బుల్స్‌ జోరు

9,500 పైన క్లోజయిన నిఫ్టీ; 149 పాయింట్లు జంప్‌




ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో టాప్‌ గేర్‌లో దూసుకెళ్లాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు విషయంలో నిర్ణయం తీసుకునే ముందు మరింత సమాచారం కోసం వేచి చూడనున్నట్టు చేసిన ప్రకటనతో తిరిగి బుల్స్‌ జోరు కొనసాగించారు. ఫలితం... భారత మార్కెట్లు ఆసియా మార్కెట్లతో కలసి ర్యాలీ చేశాయి. దీంతో గత రెండు రోజుల నష్టాలకు తెరపడింది. సెన్సెక్స్‌ 448 పాయింట్లు పెరిగి గత రెండు నెలల కాలంలో ఒకే రోజు అత్యధిక లాభాలను మూటగట్టుకుంది. 30,750 పాయింట్ల వద్ద ముగియడం ద్వారా కొత్త రికార్డు సృష్టించింది కూడా. ఈ ఏడాది మే 17న క్లోజింగ్‌ 30,658 కన్నా ఇది దాదాపు 92 పాయింట్లు ఎక్కువ కావటం గమనార్హం. ఇంట్రాడేలో 30,793.43 పాయింట్లకు దూసుకెళ్లడం ద్వారా సెన్సెక్స్‌ కొత్త జీవితకాల గరిష్ట స్థాయిలను కూడా నమోదు చేసింది.



గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో 269 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ గురువారం ఒకే సెషన్లో వాటన్నిటినీ కవర్‌ చేసేసుకుంది. అటు నిఫ్టీ సైతం 149.20 పాయింట్లు లాభపడి 9,509.75 వద్ద ముగిసింది. రూపాయి సైతం డాలర్‌ మారకంతో స్వల్పంగా లాభపడి 64.62కు చేరుకుంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ట్రేడర్లు తమ డెరివేటివ్‌ పొజిషన్లను జూన్‌ నెలకు రోలోవర్‌ చేసుకోవడం, కొన్ని కంపెనీల నుంచి ఆశాజనక ఫలితాలు రావడం సెంటిమెంట్‌ను సానుకూల పరిచాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశ వివరాలు ఆసియా మార్కెట్లలోనూ ఉత్సాహాన్ని నింపడంతో... మన మార్కెట్లూ పాజిటివ్‌గా ప్రారంభమై రోజంతా లాభాలను కొనసాగించాయి. అటు యూరోప్‌ మార్కెట్లు కూడా లాభాలతో ప్రారంభం కావడం మరింత జోష్‌నిచ్చింది.



మిడ్‌ సెషన్‌ నుంచి కొనుగోళ్లు  

వడ్డీ రేట్ల పెంపు విషయంలో మరికొంత కాలం వేచి ఉండనున్నట్టు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చేసిన ప్రకటన మార్కెట్లో ఉత్సాహాన్ని నింపిందని ట్రేడర్లు చెప్పారు. మే నెల ఫ్యూచర్, ఆప్షన్ల కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనుండడంతో ఇన్వెస్టర్లు తమ షార్ట్‌ పొజిషన్లను కవర్‌ చేసుకున్నారని పేర్కొన్నారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ సమీప భవిష్యత్తులో రేట్ల పెంపుపై ఆందోళన వ్యక్తం చేయడంతో మార్కెట్‌ క్రితం రోజు నష్టాల నుంచి బయటపడినట్టు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సేవల పరిశోధన విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు.



బ్యాంకు నిఫ్టీ కొత్త శిఖరాలకు

వరుస పతనం తర్వాత బ్యాంకింగ్‌ స్టాక్స్‌ కోలుకున్నాయి. కొనుగోళ్ల మద్దతుతో బ్యాంకు నిఫ్టీ ఇంట్రాడేలో 23,268 పాయింట్లకు ఎగసి  కొత్త ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిని తాకింది.  చివరికి 23,190.80 వద్ద ముగిసింది. ఈ సూచీ 2.90% లాభపడింది. సూచీలోని ఐసీఐసీఐ బ్యాంకు 3.31%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 2.97% లాభపడ్డాయి. ఈ రెండు స్టాక్స్‌ ఇంట్రాడేలో నూతన 52 వారాల గరిష్ఠ స్థాయిలకు చేరడం విశేషం. ఎస్‌బీఐ 2.42%, పీఎన్‌బీ 2.54%, యస్, కోటక్, బీఓబీ సైతం 2% పైగా లాభాల్లో ముగిశాయి.



ఫార్మా బేజారు...

ఫార్మా సూచీ మరో 2.62 శాతం నష్టపోయింది. యూఎస్‌ఎఫ్‌డీఏ అభ్యంతరాల నేపథ్యంలో లుపిన్‌ స్టాక్‌ 7.31 శాతం క్షీణించి నూతన 5 వారాల కనిష్టానికి పడిపోయింది. డాక్టర్‌ రెడ్డీస్‌ 3.73 శాతం, సిప్లా 2.88 శాతం, సన్‌ ఫార్మా 1.41 శాతం చొప్పున నష్టాల్ని ఎదుర్కొన్నాయి. ఐటీ సూచీ 2.18 శాతం, ఇన్‌ఫ్రా 2 శాతం లాభపడ్డాయి. ఇండెక్స్‌ షేర్లలో ఎల్‌ అండ్‌ టీ అత్యధికంగా 5 శాతం లాభపడింది. ఇన్ఫోసిస్‌ (3.09 శాతం), గెయిల్‌ (3.05 శాతం), టీసీఎస్‌ (2.44 శాతం), ఏసియన్‌ పెయింట్స్‌ (2.23 శాతం), విప్రో (2.10 శాతం), బజాజ్‌ ఆటో (1.89 శాతం), మారుతి సుజుకి (1.80 శాతం) చొప్పున లాభపడ్డాయి.


వోల్టాస్‌ 6.25 శాతం పెరిగి ఏడాది గరిష్ట స్థాయిలకు చేరింది. క్యాపిటిల్‌ గూడ్స్, బ్యాంకింగ్, ఐటీ, రియల్టీ రంగాల సూచీలు 2%కి పైగా లాభపడ్డాయి. స్మాల్‌ క్యాప్‌ సూచీ 2%, మిడ్‌ క్యాప్‌ సూచీ 1.35 లాభాన్ని ఆర్జించాయి. గత ఐదు వరుస ట్రేడింగ్‌ సెషన్లలో నికర విక్రయదారులుగా ఉన్న ఎఫ్‌ఐఐలు తిరిగి నికర కొనుగోలు దారులుగా మారారు. బుధవారం రూ.81.88 కోట్లు, గురువారం రూ.589 కోట్లు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టారు. బీఎస్‌ఈలో 1,237 షేర్లు లాభాల్లో కొనసాగగా, 424 నష్టపోయిన వాటిలో ఉన్నాయి. 149 షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకడం గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top