352 పాయింట్ల హైజంప్

352 పాయింట్ల హైజంప్


 వరుస నష్టాలకు చెక్ పెడుతూ సెన్సెక్స్ నేలక్కొట్టిన బంతిలా ఎగసింది. వెరసి మూడు రోజుల్లో కోల్పోయిన 438 పాయింట్లలో 352 పాయింట్లను(80%) కేవలం ఒక్క రోజులో తిరిగి సంపాదించింది. 22,629 వద్ద నిలిచింది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు పెరగడంతో ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో కొనుగోళ్లు చేపట్టారు. దీంతో అన్ని రంగాలూ 1-3% మధ్య ఎగశాయి. సెన్సెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మినహా అన్ని షేర్లూ లాభపడటం విశేషం.



 సాఫ్ట్‌వేర్ దిగ్గజాల ప్రోత్సాహకర ఫలితాలు, ప్రస్తుత ఎన్నికల తరువాత కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చాయి. వీటికితోడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఇండియా క్రెడిట్ రేటింగ్‌ను పెంచే అవకాశముందన్న ఎస్‌అండ్‌పీ వ్యాఖ్యలు సెంటిమెంట్‌కు ఊపునిచ్చాయి. దీంతో రోజు గడిచేకొద్దీ కొనుగోళ్లు పుంజుకున్నాయ్. ఫలితంగా సెన్సెక్స్ 352 పాయింట్లు ఎగసి 22,629 వద్ద ముగియగా, 104 పాయింట్ల హైజంప్‌తో నిఫ్టీ 6,779 వద్ద స్థిరపడింది. ఇది వారం రోజుల గరిష్టంకాగా, అన్ని రంగాలూ 1-3% మధ్య లాభపడ్డాయి. ఏప్రిల్ ఎఫ్‌అండ్‌వో సిరీస్ కాంట్రాక్ట్‌ల గడువు వచ్చే వారం ముగియనున్న నేపథ్యంలో జరిగిన షార్ట్ కవరింగ్ కూడా మార్కెట్లకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.



 మరిన్ని విశేషాలు...

     మూడు రోజుల అమ్మకాల తరువాత ఎఫ్‌ఐఐలు రూ. 433 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 123 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.

     {పధానంగా రియల్టీ, ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, పవర్, ఆయిల్, మెటల్ రంగాలు 3-2% మధ్య పుంజుకున్నాయి.

     సెన్సెక్స్ దిగ్గజాలలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాత్రమే(1%) నష్టపోయిందంటే కొనుగోళ్ల వెల్లువను అర్థం చేసుకోవచ్చు.

     వివిధ రంగాల బ్లూచిప్స్‌లో హిందాల్కో, టాటా మోటార్స్, ఐసీఐసీఐ, భెల్, ఎస్‌బీఐ, విప్రో, యాక్సిస్, హీరో మోటో, ఎంఅండ్‌ఎం, ఐటీసీ, ఆర్‌ఐఎల్, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ 4-1% మధ్య లాభపడ్డాయి.

     మళ్లీ రియల్టీ షేర్లు కళకళలాడాయి. డీబీ, ఫీనిక్స్ మిల్స్, యూనిటెక్, గోద్రెజ్ ప్రాపర్టీస్, హెచ్‌డీఐఎల్, ఇండియా బుల్స్, అనంత్‌రాజ్ 12-3% మధ్య జంప్ చేశాయి.

     మార్కెట్ల బాటలోనే మిడ్, స్మాల్ క్యాప్స్ ఇండెక్స్‌లు సైతం 1.5% చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,724 లాభపడితే, కేవలం 1,050 నష్టపోయాయి.

     బీఎస్‌ఈ-500 సూచీలో సద్భావ్, సియట్, అపోలో టైర్స్, క్రాంప్టన్, అరవింద్, సింఫనీ, వోల్టాస్, ఐఆర్‌బీ, హాథ్‌వే, ఎస్‌కేఎస్, ట్రీహౌస్, ఇండియా సిమెంట్స్, హెచ్‌సీఎల్ ఇన్ఫో, గల్ఫ్ ఆయిల్, బిర్లా కార్పొరేషన్, డీసీఎం శ్రీరాం తదితరాలు 16-6% మధ్య దూసుకెళ్లాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top