మార్కెట్.. అక్కడక్కడే అడుగులు

మార్కెట్.. అక్కడక్కడే అడుగులు


ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 5.5% చొప్పున నమోదుకాగలదని రిజర్వ్ బ్యాంక్ వేసిన అంచనా సెంటిమెంట్‌కు బూస్ట్‌నిచ్చింది. దీంతో మిడ్ సెషన్‌లో సెన్సెక్స్ 254 పాయింట్లవరకూ ఎగసి 26,851 వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయించడంతో చివరి గంటన్నరలో అమ్మకాలు పెరిగి లాభాలు కరిగిపోయాయి. వెరసి సెన్సెక్స్ 33 పాయింట్ల లాభాన్ని మిగుల్చుకుని 26,630 వద్ద ముగిసింది.



 ఇక నిఫ్టీ కూడా 9 పాయింట్లు బలపడి 7,965 వద్ద నిలిచింది. గురువారం నుంచి మొదలుకానున్న వరుస సెలవుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు. చైనా తయారీ రంగం అంచనాలు అందుకోకపోవడం, హాంకాంగ్ అనిశ్చితులు వంటి అంశాలు కూడా సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపాయని చెప్పారు.  ప్రధానంగా రియల్టీ, పవర్, మెటల్ రంగాలు 3-1% మధ్య నీరసించగా, హెల్త్‌కేర్ 1%పైగా లాభపడింది.



సెన్సెక్స్ దిగ్గజాలలో భెల్, యాక్సిస్, హిందాల్కో, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ, టీసీఎస్ 3-1% మధ్య క్షీణించాయి. అయితే మరోవైపు సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఆటో, మారుతీ, సిప్లా, రిలయన్స్, ఐటీసీ 3-1% మధ్య పుంజుకుని మార్కెట్లను ఆదుకున్నాయి. ఇక రియల్టీ షేర్లు ఇండియాబుల్స్, యూనిటెక్, డీఎల్‌ఎఫ్, అనంత్‌రాజ్, మహీంద్రా లైఫ్ 5-2% మధ్య పతనమయ్యాయి. కాగా, ఎఫ్‌ఐఐలు రూ. 486 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top