సెన్సెక్స్‌ 322 పాయింట్లు జంప్‌

సెన్సెక్స్‌ 322 పాయింట్లు జంప్‌ - Sakshi


నిఫ్టీ 103 పాయింట్లు అప్‌

నెలరోజుల్లో అత్యధిక లాభం

అమెరికా – ఉత్తర కొరియా

ఉద్రిక్తతలు సడలిన నేపథ్యం




ముంబై: అమెరికా– ఉత్తరకొరియాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో ఇన్వెస్టర్లు వరుసగా రెండో ట్రేడింగ్‌ సెషన్లో జోరుగా కొనుగోళ్లు జరిపారు. దాంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మరో 322 పాయింట్లు పెరిగి 31,771 పాయింట్ల వద్ద ముగిసింది. ఆగస్టు 9 తర్వాత ఇదే గరిష్ట ముగింపు. అలాగే నెలరోజుల్లో ఈ స్థాయిలో సెన్సెక్స్‌ పెరగడం ఇదే ప్రథమం. క్రితం రోజు స్వాతంత్య్ర దినోత్సవం కారణంగా మార్కెట్లకు సెలవుకాగా, సోమవారం సెన్సెక్స్‌ 226 పాయింట్లు పెరిగిన సంగతి తెలిసిందే.



 ఈ రెండు ట్రేడింగ్‌ సెషన్లలో కలిపి దాదాపు 550 పాయింట్లు లాభపడినట్లయ్యింది. ఇదేరీతిలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 103 పాయింట్లు జంప్‌చేసి 9,897 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ద్రవ్యోల్బణం పెరిగినట్లు డేటా వెలువడిన నేపథ్యంలో ట్రేడింగ్‌ తొలిదశలో సూచీలు ఒడిదుడుకులకు లోనై, కొద్ది నిమిషాలపాటు నష్టాల్లోకి జారుకున్నప్పటికీ, మధ్యాహ్న సెషన్‌ సమయంలో యూరప్‌ సూచీలు పరుగులు తీస్తున్న నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీలు కూడా ఒక్కసారిగా ర్యాలీ ప్రారంభించాయని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.



 జీఎస్‌టీ రేటు సవరించే అవకాశాలున్నాయన్న అంచనాలతో ఎఫ్‌ఎంసీజీ షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టినిలిపారని, అమెరికా– ఉత్తరకొరియాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలోపేతం చేసిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ ఆనంద్‌ జేమ్స్‌ వివరించారు.  



ఎఫ్‌ఎంసీజీ, ఫార్మాల జోరు...

కొద్ది వారాలపాటు అదేపనిగా క్షీణించిన ఫార్మా షేర్లు వరుసగా రెండో రోజు ఎగిశాయి.సిప్లా 3.7 శాతం ర్యాలీ జరిపి రూ. 590 వద్ద క్లోజ్‌కాగా, సన్‌ఫార్మా 2.9 శాతం ఎగిసి రూ. 485 వద్ద ముగిసింది. ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఐటీసీ, హిందుస్తాన్‌ యూనీలీవర్‌లు 2.8 శాతం చొప్పున పెరిగాయి.



టాటా మోటార్స్‌ 3.57 శాతం ఎగిసి సెన్సెక్స్‌–30 షేర్లలో టాప్‌గెయినర్‌గా నిలిచింది. 4.4 శాతం ర్యాలీ జరిపిన టెక్‌ మహింద్రా నిఫ్టీ–50లో అత్యధికంగా లాభపడిన షేరుగా నమోదయ్యింది. ఉక్కు దిగ్గజం టాటా స్టీల్‌ 1 శాతంపైగా పెరిగి ఆరేళ్ల గరిష్టస్థాయి రూ. 631 వద్ద క్లోజయ్యింది. బ్యాంకింగ్‌ షేర్లలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 1–2 శాతం మధ్య ర్యాలీ జరిపాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top