7న బ్యాంకు ఉద్యోగుల సమ్మె సైరన్‌!

7న బ్యాంకు ఉద్యోగుల సమ్మె సైరన్‌!


న్యూఢిల్లీ: కొన్ని బ్యాంక్‌ ట్రేడ్‌ యూనియన్లు ఫిబ్రవరి 7న ఒకరోజు దేశవ్యాప్త సమ్మె చేస్తామని హెచ్చరించాయి. డీమోనిటైజేషన్‌ సమయంలో విధించిన అన్ని నియంత్రణలను ఎత్తివేసి, రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలని యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయి. ‘నోట్ల రద్దు వల్ల బ్యాంకులు, ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారానికి కేంద్రం, రిజర్వు బ్యాంక్‌ తగిన చర్యలు తీసుకుంటాయని భావించాం. కానీ ఇప్పటికీ బ్యాంకులకు సరిపడా నగదు సరఫరా జరగడం లేదు.



దీంతో అవి కస్టమర్లకు నిర్దేశించిన విత్‌డ్రాయల్స్‌ను సక్రమంగా ఇవ్వలేకపోతున్నాయి’ అని ఏఐబీఈఏ జనరల్‌ సెక్రటరీ సి.హెచ్‌.వెంకటాచలం తెలిపారు. ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ)తోపాటు ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (ఏఐబీఓఏ), బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వంటి యూనియన్లు కూడా సమ్మెలో పాల్గొంటాయని పేర్కొన్నారు. రూ.కోటి, ఆపై తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించని వారి పేర్లను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. రుణాల రికవరీకి కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు.



ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ అంశంలో ఎవరి జోక్యం ఉండకూడదని చెప్పారు. డీమోనిటైజేషన్‌ వల్ల ప్రాణాలు కోల్పోయిన ప్రజలు/బ్యాంకు ఉద్యోగులు/కస్టమర్లకు పరిహారమివ్వాలని, 50 రోజుల డీమోనిటైజేషన్‌ సమయంలో అదనపు పని చేసినందుకు బ్యాంకు ఉద్యోగులకు పేమెంట్‌ చెల్లించాలని కోరారు. కాగా కొత్త గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తికి బీటలు వారుతున్నాయనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమౌతుండటం గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top