ఆ షెల్‌ కంపెనీల్లో ట్రేడింగ్‌ కష్టమే!

ఆ షెల్‌ కంపెనీల్లో ట్రేడింగ్‌ కష్టమే!


అనుమానిత 331 కంపెనీల ట్రేడింగ్‌పై ఆంక్షలు

నెలలో మొదటి సోమవారం మాత్రమే అవకాశం

సెబీ తాజా ఆదేశాలు... నేటి నుంచే అమల్లోకి

ఆడిట్‌ వివరాల ఆధారంగా అవసరమైతే డీలిస్టింగ్‌   




న్యూఢిల్లీ: షెల్‌ కంపెనీలుగా (నల్లధనం ప్రవాహం, పన్నుల ఎగవేతకు వీలుగా ఏర్పాటు చేసేవి) అనుమానిస్తున్న 331 లిస్టెడ్‌ కంపెనీలపై తాజా చర్యలకు సెబీ ఆదేశించింది. కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఆయా లిస్టెడ్‌ కంపెనీల వివరాలు అందజేయడంతో... వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ, మెట్రోపాలిటన్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లను సెబీ ఆదేశించింది. ఈ కంపెనీలను నాల్గవ గ్రేడ్‌ నిఘా నియంత్రణలోకి తీసుకురావాలని కోరింది. ఈ గ్రేడ్‌లోకి తీసుకొస్తే ఆయా స్టాక్స్‌లో నెలలో ఒక్కసారే ట్రేడింగ్‌కు వీలుంటుంది. సెబీ ఆదేశాల నేపథ్యంలో 331 లిస్టెడ్‌ కంపెనీలను మంగళవారం నుంచే నాల్గవ గ్రేడ్‌లోకి మార్చనున్నారు. దీంతో ఇక ఈ నెలలో ఈ స్టాక్స్‌లో లావాదేవీలకు అవకాశం ఉండదు. నెలలో ఒక్కసారే అది కూడా మొదటి సోమవారమే వీటిలో ట్రేడింగ్‌కు అనుమతించనున్నట్టు సంబం ధిత ప్రకటనలో సెబీ పేర్కొంది.



అలాగే, చివరిగా క్లోజ్‌ అయిన ధరకు మించి పెరిగేందుకు కూడా అవకాశం ఇవ్వరు. ఈ స్టాక్స్‌ను కొనుగోలు చేస్తున్న వారి నుంచి లావాదేవీ విలువ మొత్తానికి అదనంగా 200 శాతాన్ని నిఘా డిపాజిట్‌ కింద వసూలు చేస్తారు. ఈ మొత్తాన్ని ఎక్సేంజ్‌లు ఐదు నెలల పాటు తమ వద్దే ఉంచుకుంటాయి. ఇక ఈ కంపెనీల ఆర్థిక వివరాలు, ఇతర అంశాలను ఎక్సేంజ్‌లు తనిఖీ చేయాల్సి ఉంటుంది. అలాగే, స్వతంత్ర ఆడిటర్‌తో ఆడిటింగ్‌ జరపాలని, అవసరమైతే ఫోరెన్సిక్‌ ఆడిట్‌ను నిర్వహించాలని సెబీ కోరింది.



ఈ ఆడిటింగ్‌లో ఆయా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించడానికి వీలుగా ఎటువంటి ఆర్థిక వ్యవహారాలు, ఫండమెంటల్స్‌ ఏవీ లేవని తేలితే వాటిని తప్పనిసరిగా డీలిస్ట్‌ కూడా చేస్తారు. ఈ కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్ల వాటా లను డిపాజిటరీలు ఎక్సేంజ్‌ల ధ్రువీకరణ తర్వాతే బదిలీకి అనుమతిస్తారు. ఈ కంపెనీలు మరే ఇతర లిస్టెడ్‌ కంపెనీల్లో లావాదేవీలు నిర్వహించేందుకు వీలుండదు. ఒకవేళ ఈ 331 కంపెనీల్లో ఏవైనా ఇప్పటికే ట్రేడింగ్‌ సస్పెన్షన్‌కు గురై ఉంటే, సస్పెన్షన్‌ ఎత్తివేసిన మరుక్షణమే వాటిని నాల్గవ గ్రేడ్‌ నిఘాలోకి తీసుకొస్తారు. నల్లధనంపై పోరులో భాగంగా కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఎటువంటి వ్యాపారాలు నిర్వహించని 1.62 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్‌ను ఇటీవలే రద్దు చేసిన విషయం తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top