గ్యారంటీ లేకుండానే కారు లోన్

గ్యారంటీ లేకుండానే కారు లోన్


ఎస్‌బీఐతో ఓలా క్యాబ్స్ ఒప్పందం

 లక్ష మందిని సొంత కారు

  ఓనర్లుగా మార్చడమే లక్ష్యం

  సంస్థ డెరైక్టర్ ఆనంద్ సుబ్రమణియన్


 

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ డ్రైవర్లను సొంత కార్లు కలిగిన వారిగా తీర్చిదిద్దాలని ఓలా క్యాబ్స్ నిర్ణయించింది. ఇందుకోసం ఎస్‌బీఐతో ‘ఓలా ప్రగతి’ పేరుతో కార్‌లోన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద వచ్చే రెండేళ్లలో లక్ష మంది డ్రైవర్లను సొంత కార్లు కలిగిన యజమానులుగా తీర్చిదిద్దనున్నట్లు ఓలా క్యాబ్స్  డెరైక్టర్ (మార్కెటింగ్) ఆనంద్ సుబ్రమణియన్ తెలిపారు. ఈ పథకం వివరాలను తెలియచేయడానికి మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనంద్ మాట్లాడుతూ డ్రైవర్లను అనేక సొంత కార్లు కలిగిన యజమాన్లుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం అన్నారు. ఇందుకోసం ఎస్‌బీఐతో ఒప్పందం చేసుకున్నామని, ఈ ఒప్పందం ప్రకారం తాము ఎంపిక చేసిన డ్రైవర్లకు ఎటువంటి గ్యారంటీ అవసరం లేకుండా ఎస్‌బీఐ కార్‌లోన్ అందిస్తుందన్నారు. కేవలం 10 శాతం డౌన్‌పేమెంట్ చెల్లించి 3 నుంచి 5 ఏళ్ళలో ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రోజువారీ వాయిదాల్లో లేదా 15 రోజులకు ఒకసారి చెల్లించవచ్చు.

 

వడ్డీరేటు కాలపరిమితిని బట్టి 13-13.5 శాతంగా ఉంటుంది.3 లక్షల క్యాబ్స్ లక్ష్యం: ద్వితీయ శ్రేణి నగరాలకు క్యాబ్ సేవలను విస్తరించడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ఆనంద్ తెలిపారు. వచ్చే ఏడాది కాలంలో మరో 120 పట్టణాలకు విస్తరించడమే కాకుండా అదనంగా మరో 2 లక్షల కార్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఓలా క్యాబ్స్ 85 పట్టణాల్లో లక్ష కార్లను నిర్వహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అయిదు పట్టణాల్లో తాము సేవలను అందిస్తున్నామని, ఈ సంఖ్యను మరింత పెంచనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓలా క్యాబ్ నెట్‌వర్క్‌లో 7,000 కార్లు ఉన్నాయని, ఏడాదిలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందన్న ఆశాభావాన్ని ఆనంద్ వ్యక్తం చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top