26 శాతం తగ్గిన సెయిల్ లాభం

26 శాతం తగ్గిన సెయిల్ లాభం


ఒక్కో షేర్‌కు 25 పైసలు డివిడెండ్

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు కంపెనీ సెయిల్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి కాలానికి 26 శాతం తగ్గింది. 2013-14 క్యూ4లో రూ.453 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 క్యూ4లో రూ.334 కోట్లకు తగ్గిందని సెయిల్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.13,684 కోట్ల నుంచి  రూ.11,684 కోట్లకు తగ్గిందని  సెయిల్ సీఎండీ సి. ఎస్. వర్మ వివరించారు. వాణిజ్య వివాదం కారణంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.1,056 కోట్లు వచ్చాయని, అందుకే 2013-14 క్యూ4లో నికర లాభంలో క్షీణత నమోదైందని పేర్కొన్నారు.



మార్కెట్లో గడ్డు పరిస్థితులున్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇతర కంపెనీల కన్నా మంచి పనితీరునే కనబరిచామని పేర్కొన్నారు. ఒక్కో షేర్‌కు రూ.0.25 డివిడెండ్‌ను డెరైక్టర్ల బోర్డ్ రికమెండ్ చేసిందని తెలిపారు. ఇప్పటికే గత ఆర్థిక సంవత్సరానికి రూ.1.75 మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించామని, మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు  డివిడెండ్ రూ.2కు చేరిందని వివరించారు.



ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి వస్తే, 2013-14 క్యూ4లో రూ.2,616 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరంలో 20 శాతం క్షీణించి రూ.2,093 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.47,513 కోట్ల నుంచి రూ.46,695 కోట్లకు తగ్గిందని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో సెయిల్ షేర్ ఎన్‌ఎస్‌ఈలో రూ.66 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top