కోర్టు మెట్లక్కబోతున్న ఐటీ ఉద్యోగులు

కోర్టు మెట్లక్కబోతున్న ఐటీ ఉద్యోగులు - Sakshi

ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న ఉద్యోగాల కోతపై కంపెనీల ఉద్యోగులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కావాలనే ఉద్వాసన వేటు వేస్తుండటంతో ఇప్పటికే కంపెనీలకు వ్యతిరేకంగా లేబర్ కమిషన్, లేబర్ సెక్రటరీ, రాష్ట్రప్రభుత్వాలను ఆశ్రయించిన ఐటీ ఉద్యోగులు, ఇక కోర్టు మెట్లెక్కేందుకు సిద్ధమవుతున్నారు.  కంపెనీలు చేస్తున్న అన్యాయ పూర్వకమైన తొలగింపును హైకోర్టు ముందు విలపించుకోవాలని భావిస్తున్నారు. నేషనల్ డెమొక్రాటిక్ లేబర్ ఫ్రంట్(ఎన్డీఎల్ఎఫ్) ఐటీ ఉద్యోగుల వింగ్ తమ గోడును విలపించుకోవడానికి మద్రాస్ కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. టెక్ దిగ్గజాలు కాగ్నిజెంట్, విప్రోలు ఏకపక్షంగా తమను తొలగిస్తున్నాయని ఐటీ ఉద్యోగుల వింగ్ కోర్టుకు తెలిపేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఈ రెండు కంపెనీలు దాదాపు 30వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నాయని  ఉద్యోగుల వింగ్ చెబుతోంది.

 

తమ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఈ రెండు కంపెనీలకు వ్యతిరేకంగా లేబర్ కమిషన్, లేబర్ సెక్రటరీలను కలిసినట్టు తమిళనాడుకు చెందిన ఈ ఎన్డీఎల్ఎఫ్ చెప్పింది. పూర్ ఫర్ ఫార్మెన్స్(తక్కువ పనితీరు కారణంతో) కారణంతో ఉద్యోగులను బలవంతంగా రాజీనామా చేయాలని ఆదేశిస్తున్నట్టు  ఉద్యోగుల వింగ్ పేర్కొంది. ఏకపక్షంగా రేటింగ్ కూడా ఇస్తున్నట్టు చెప్పింది.  ఈ పూర్ ఫర్ ఫార్మెన్స్ రేటింగ్ నిజాయితీగా ఇస్తున్నది కాదని ఆరోపించింది. వివిధ రాష్ట్రాల్లో తమ సమస్యల పరిష్కారం కోసం ఐటీ ఉద్యోగులు యూనియన్లను ఏర్పాటుచేసుకోవాలని ఎన్డీఎల్ఎఫ్ సూచించింది. ప్రస్తుతం ఎన్డీఎల్ఎఫ్ తమిళనాడు, తెలంగాణలో మాత్రానికే పరిమితమై ఉండగా.... పుణే, బెంగళూరు, గుర్గావ్, కోల్ కత్తాలోని ఐటీ ఉద్యోగులతో కూడా ఈ ఎన్డీఎల్ఎఫ్ చర్చలు జరుపుతోంది. దేశవ్యాప్తంగా తమ నిరసనలు తెలుపాలని ఐటీ  ఉద్యోగుల వింగ్ యోచిస్తోంది. 

 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top