అరగంటలో ఎల్‌ఐసీకి రూ.7,000కోట్లు మటాష్‌

అరగంటలో ఎల్‌ఐసీకి రూ.7,000కోట్లు మటాష్‌

న్యూఢిల్లీ : సిగరెట్‌ ఉత్పత్తుల తయారీలో అగ్రగామిగా ఉన్న ఐటీసీ దెబ్బకు ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఢమాల్‌మన్నాయి.  దాదాపు 26 ఏళ్ల కనిష్టస్థాయిల వద్ద ఐటీసీ స్టాక్‌ అతిపెద్ద పతనాన్ని నమోదుచేస్తుండటంతో, ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో అగ్రగామిగా ఉన్న ఎల్‌ఐసీ అరగంటలో రూ.7000 కోట్లను కోల్పోయింది. ఈ సిగరెట్‌ కంపెనీలో 2017 జూన్‌30 నాటికి ఎల్‌ఐసీ 16.29 శాతం స్టేక్‌ను కలిగి ఉంది. దీని ప్రభావంతో ఎల్‌ఐసీ భారీ మొత్తంలో నష్టాలను ఎదుర్కొంటోంది. అంతేకాక అరగంట వ్యవధిలోనే 7వేల కోట్ల నష్టాలను నమోదుచేయడం ఇదే మొదటిసారి.



ఈ నష్టాలంతటికీ ప్రధాన కారణం సోమవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో సిగరెట్‌ ఉత్పత్తులపై సెస్‌ను పెంచుతున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించడమే. 28 శాతం జీఎస్టీతో పాటు, అదనంగా 5 శాతం సెస్‌ను విధిస్తున్నట్టు అరుణ్‌జైట్లీ తెలిపారు. దీంతో ఐటీసీ కంపెనీ షేర్లు మంగళవారం మార్నింగ్‌ ట్రేడింగ్‌లో 15 శాతం మేర నష్టాలను ఎదుర్కొన్నాయి. ఈ నష్టాలు ఎల్‌ఐసీకి దెబ్బకొట్టాయి. ఒక్క ఎల్‌ఐసీ మాత్రమే కాక, ఐటీసీలో పెట్టుబడులు పెట్టిన ఇతర ఇన్సూరర్స్‌కు కూడా నష్టాలు వాటిల్లాయి. మొత్తంగా ఇన్సూరెన్స్‌ కంపెనీలు రూ.10వేల కోట్లను కోల్పోయాయి.   

 

గత నాలుగేళ్ల క్రితం నుంచి ఎల్‌ఐసీ, ఐటీసీలో తన వాటాను పెంచుకుంటూ వస్తోంది. దీంతో ఎల్‌ఐసీకి ఈ దెబ్బ అధికంగా కొట్టింది. నాలుగేళ్ల క్రితం ఐటీసీలో ఎల్‌ఐసీ వాటా 12.63 శాతంగా ఉండగా.. 2016 జూన్‌ నాటికి 14.34 శాతానికి ఎగిసింది.  ఇటీవలే ఎల్‌ఐసీ చైర్మన్‌ వీకే శర్మ కూడా ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్‌ కంపెనీలు టుబాకో మేజర్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని సపోర్టుచేశారు.  కంపెనీలో షేర్లను కలిగి ఉండటం, కలిగి ఉండకపోవడం అనేది స్మోకింగ్‌ సమస్యపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొన్నారు.



సిగరెట్ ఉత్పత్తుల కంపెనీల్లో ఎల్‌ఐసీ, ఇతర నాలుగు ప్రభుత్వ రంగ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ బొంబై హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం నమోదైంది. ఈ పిల్‌ విచారణ సందర్భంగా ఎల్‌ఐసీ ఈ విధంగా వాదించింది. కాగ, జీఎస్టీ కౌన్సిల్‌ పెంచిన సెస్‌తో సిగరెట్‌ ఉత్పత్తుల తయారీదారులు, ఎల్‌ఐసీ, ఇతర ఇన్సూరెన్స్‌ కంపెనీలు భారీగా నష్టాలను ఎదుర్కోనున్నాయి. సిగరెట్‌ ఉత్పత్తుల తయారీదారులైతే వార్షికంగా రూ.5000 కోట్లను కోల్పోనున్నారు.  
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top