రుణాలపై వడ్డీ భారం తగ్గించుకున్న ఆర్‌ఐఎల్‌

రుణాలపై వడ్డీ భారం తగ్గించుకున్న ఆర్‌ఐఎల్‌ - Sakshi


2016–17లో రూ.1,14,742 కోట్ల పెట్టుబడులు

కార్పొరేట్‌ చరిత్రలోనే ఇది రికార్డు

వాటాదారులకు వివరించిన ముకేశ్‌




న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) 2.3 బిలియన్‌ డాలర్ల (రూ.15,000 కోట్లు) రుణాలను తక్కువ వడ్డీ రేటుకు రీఫైనాన్స్‌ చేసుకుంది. దీనివల్ల వడ్డీ రూపేణా గణనీయంగా ఆదా అవుతుందని వాటాదారులకు కంపెనీ తెలిపింది. కంపెనీ స్థూల రుణ భారం మార్చి నాటికి రూ.1,96,601 కోట్లు కాగా, ఇందులో అధిక భాగం జియో కార్యకలాపాల కోసం తీసుకున్నది కావడం గమనార్హం. ‘‘1.75 బిలియన్‌ డాలర్ల దీర్ఘకాలిక సిండికేటెడ్‌ రుణం, 550 మిలియన్‌ డాలర్ల మేర క్లబ్‌లోన్‌ రెండూ కలిపి 2.3 బిలయన్‌ డాలర్ల మేర రుణాలను రీఫైనాన్స్‌ చేసుకోవడం జరిగింది. దీనివల్ల మిగిలి ఉన్న కాలంలో వడ్డీ రూపేణా గణనీయంగా ఆదా అవుతుంది’’ అని 2016 – 17 వార్షిక నివేదికలో వాటాదారులకు కంపెనీ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వివరించారు.



అయితే, వడ్డీ రూపంలో ఎంత ఆదా అవుతుందన్న అంచనాలను వెల్లడించలేదు. ఇక గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.1,14,742 కోట్లను పెట్టుబడులుగా పెట్టామని, దేశ చరిత్రలో ఓ కార్పొరేట్‌ కంపెనీ ఒకే ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం ఇదేనని పేర్కొన్నారు. మూలధన విస్తరణ అన్నది పెట్టుబడుల రేటింగ్‌ను కొనసాగించేందుకేనని వివరించింది. భారత సార్వభౌమ రేటింగ్‌ కంటే రెండు స్థాయిలు ఎక్కువలోనే కంపెనీ రేటింగ్‌ ఉందని, ఎస్‌అండ్‌పీ సంస్థ ఆర్‌ఐఎల్‌కు అంతర్జాతీయ రుణ రేటింగ్‌ బీబీబీప్లస్‌ ఇచ్చినట్టు తెలిపింది. మూలధన పెట్టుబడుల వల్ల కంపెనీకి నగదు ప్రవాహాలు మెరుగవుతాయని, రానున్న సంవత్సరాల్లో ఆదాయాల్లో అస్థిరతలు తగ్గుతాయని తెలిపింది. హైడ్రోకార్బన్‌ వ్యాపారంపై మూలధన వ్యయాలు పూర్తయినందున నగదు ప్రవాహాలు మెరుగుపడతాయని పేర్కొంది.



పెట్రోల్‌ బంక్‌ల విస్తరణ

ఇంధన రిటైల్‌ విస్తరణపై దృష్టి పెట్టినట్టు ఆర్‌ఐఎల్‌ తన వాటాదారులకు వివరించింది. కంపెనీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,221 పెట్రోల్‌ పంపులు ఉండగా, 2017–18 సంవత్సరంలో వీటిని విస్తరించనున్నట్టు తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top