హైడ్రో పవర్‌లో హైఓల్టేజీ డీల్స్!

హైడ్రో పవర్‌లో హైఓల్టేజీ డీల్స్!


(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్:  జేపీ గ్రూప్‌నకు చెందిన హైడ్రో పవర్ ప్రాజెక్టులను రూ. 12,300 కోట్లకు అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ పవర్ కొనుగోలు చేయడంతో స్థానిక పారిశ్రామిక వేత్తల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రూ. లక్ష కోట్ల రుణ భారంతో తల్లడిల్లుతున్న జీఎంఆర్, ల్యాంకో, జీవీకే లాంటి సంస్థలకు ఈ పరిణామాలు ఎంతో ఆసక్తిని రేకిత్తిస్తున్నాయి.  ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించ తలపెట్టిన పలు విద్యుదుత్పాదన  సంస్థలు తమ వాటాల విక్రయానికి సుముఖుత చూపుతున్నాయని పవర్ ప్రాజెక్టుల కన్సల్టెంట్ పీపీ రావు తెలిపారు.

 

తెలంగాణా, ఏపీ రాష్ట్రాలకు చెందిన కేఎస్‌కే ఎనర్జీ, సాయి కృష్ణోదయా , కోస్టల్ ప్రాజెక్ట్స్, జీఎంఆర్, ఎథీనా ఎనర్జీ వెంచర్స్, నవయుగ ఇంజీనీరింగ్, సోమ ఎంటర్‌ప్రెజైస్ లాంటి సంస్థలు బ్రహ్మపుత్ర నదిపై జలవిద్యుత్కేంద్రాలను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించుకున్నాయి. ప్రాజెక్టు ప్రారంభించేందుకు కావాల్సిన అన్ని అనుమతులు పొందాయి. అయితే అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రాజెక్టులు నిర్వహించేందుక అవసరమైన వనరులు సకాలంలో సమీకరించలేకపోవడంతో   పలు కంపెనీలు మధ్యలో నే ఆపేశాయి. హైదరాబాద్‌కు చెందిన  సర్వోమ్యాక్స్ సంస్థ అరుణాచల్ ప్రదేశ్‌లో   చేపట్టిన మినీ హైడల్ పవర్‌ప్రాజెక్టు నిర్మాణంలో బాలారిష్టాలు దాటి పురోగతి సాధించిన స్థానిక సమస్యల కారణంగా ఇటీవలే ప్రాజెక్టు కార్యాలయాన్ని మూసేసింది.

 

జీవీకే పవర్ సంస్థకు జమ్ము కాశ్మీర్‌లో రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు (850 మెగావాట్ల), ఉత్తరాఖండ్‌లో శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (330 మెగావాట్లు), బోగుడియార్ శ్రీకార్ భోల్ (146 మెగావాట్లు), మాపాంగ్ బోగుడియార్ (200 మెగావాట్ల) హౌడ్రో పవర్ ప్రాజెక్టులున్నాయి. జీఎంఆర్ సంస్థకు నేపాల్‌లో అప్పర్ కునాలి (900 మెగావాట్ల) ప్రాజెక్టు, హిమతాల్ (600 మెగావాట్ల) ప్రాజెక్టు, అరుణాచల్ ప్రదేశ్‌లో తెలాంగ్‌లో జీఎంఆర్ ఎనర్జీ (225 మెగావాట్లు) జలవిద్యుత్‌కు సంబంధించిన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి.  జీఎంఆర్ ఎనర్జీకి ఉత్తరాఖండ్‌లోనిఅలకనందాలో 300 మెగావాట్ల ప్రాజెక్టు కూడా ఉంది. ల్యాంకో గ్రూప్‌నకు ఉత్తరాఖండ్‌లో ఫటా బీయుంగ్ (76 మెగావాట్లు), రంబారా (76 మెగాయూనిట్లు), ల్యాంకో మందాకినీ హైడ్రో పవర్ ( 76 మెగావాట్లు),  సిక్కిం రాష్ట్రంలో ల్యాంకో తీస్తా హైడ్రో పవర్ (500 మెగావాట్లు), హిమాచల్ ప్రదేశ్‌లోని బుడిల్ ప్రాజెక్టు (70 మెగావాట్లు)లు ఉన్నాయి.

 

అరుణాచల్ ప్రాజెక్టుల ఆకర్షణ ఇదీ...

జమ్ము కాశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో జలవిద్యుత్ వనరులను అభివృద్ధి చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం 2008లో హైడ్రో పవర్ అభివృద్ధి విధానాన్ని ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థలతో దీటుగా ప్రైవేట్ సంస్థలకూ పలు రాయితీలను ప్రకటించారు. అందులో ప్రధానంగా కాస్ట్ ప్లస్ టారిఫ్ విధానం. దీని ప్రకారం విద్యుత్కేంద్రంపై వెచ్చించిన వ్యయాలను డెవలపర్ రాబట్టుకునేందకు వీలుగా సేలబుల్ ఎన ర్జీలో 40 శాతం మర్చంట్ విక్రయాల రాయితీని ప్రకటించారు. మరో ఆకర్షణ మెగా పవర్ ప్రాజెక్టు పాలసీ. సాధారణంగా మెగా పవర్ ప్రాజెక్టు స్థాయి పొందాలంటే కనీసం వెయ్యి మెగావాట్ల సామర్థ్యం ఉండాలి.

 

అయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సామర్థ్యాన్ని 350 మెగా వాట్లకే కుదించారు. మెగాపవర్ ప్రాజెక్టులకు క్యారేజీ టారిఫ్‌లో పది శాతం పన్ను రాయితీ ఉంటుంది. జీఎంఆర్ జల విద్యుత్కేంద్రాలను గుజరాత్‌కు చెందిన అదానీ పవర్ కొనుగోలు చేయనుందన్న మార్కెట్ వర్గాల సమాచారంపై జీఎంఆర్ అధికార ప్రతినిధి స్పందిస్తూ ప్రస్తుతం తాము ఆ దిశగా ఆలోచించడం లేదన్నారు. మార్కెట్ వర్గాల అంచనాలకు అధికార వివరణ ఇవ్వలేమని సాక్షి ప్రతినిధికి తెలిపారు.

 

అలాగే ల్యాంకో పవర్‌కు చెందిన సంస్థలను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు వస్తున్న వార్తలపై ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నరశింహన్ స్పందిస్తూ ఇది పూర్తిగా నిరాధారమూ, ఊహా జనితమైన మార్కెట్ కల్పన అని అన్నారు. అయితే జేపీ-రిలయన్స్ పవర్ డీల్ నేపథ్యంలో స్థానిక కంపెనీలు కూడా వాటి విద్యుత్ ప్రాజెక్టులను విక్రయించవచ్చనే మార్కెట్ వర్గాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి. జేపీ డీల్‌ను మిస్సయిన ఆదాని గ్రూప్ వీటిలో కొన్ని హైడ్రో ప్రాజెక్టుల కొనుగోలుకు ముందుకు రావచ్చన్నది ఆ వర్గాల సమాచారం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top