రిలయన్స్ లాభం 7,206 కోట్లు

రిలయన్స్ లాభం 7,206 కోట్లు - Sakshi


క్యూ2లో 23% తగ్గుదల...

ఆదాయం రూ.81,651 కోట్లు; 9.6 శాతం అప్

పెట్రోకెమికల్, రిఫైనరీ ఆదాయాల జోరు...

స్థూల రిఫైనింగ్ మార్జిన్ 10.1 డాలర్లు...


న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) మెరుగైన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2016-17, క్యూ2)లో కంపెనీ రూ.7,206 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.9,345 కోట్లతో పోలిస్తే 23 శాతం తగ్గింది.  కాగా, క్రితం ఏడాది క్యూ2లో నికర లాభం అధికంగా నమోదుకావడానికి అమెరికా షేల్ గ్యాస్ ఆస్తుల విక్రయం రూపంలో వచ్చిన రాబడులు కూడా కలిసి ఉండటం ప్రధాన కారణంగా నిలిచింది.


దీన్ని మినహాయించిచూస్తే... నికర లాభం 43.1 శాతం ఎగబాకినట్లు లెక్క. ఇక కన్సాలిడేటెడ్ ఆదాయం క్యూ2లో రూ.74,490 కోట్ల నుంచి రూ. 81,651 కోట్లకు ఎగబాకింది. 9.6 శాతం వృద్ధి చెందింది. కంపెనీ కీలక వ్యాపారాలైన పెట్రోకెమికల్స్, రిఫైనింగ్ విభాగాల్లో మంచి పనితీరు నమోదుకావడం ఆకర్షణీయమైన ఫలితాలకు దోహదం చేసింది.


రిఫైనింగ్ మార్జిన్ తగ్గింది...

సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్‌ఐఎల్ స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్‌ఎం) 10.1 డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో జీఆర్‌ఎం 10.6 డాలర్లు కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 11.5 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడిచమురు(క్రూడ్)ను పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా లభించే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు.


ఇతర ముఖ్యాంశాలివీ...

చమురు-గ్యాస్ ఉత్పత్తి వ్యాపారానికి సంబంధించి క్యూ2లో కంపెనీ రూ.491 కోట్ల స్థూల నష్టాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో స్థూల లాభం రూ.3,326 కోట్లుగా నమోదైంది. ముఖ్యంగా చమురు-గ్యాస్ ధరలు తగ్గడం, కేజీ-డీ6 బేసిన్‌లో ఉత్పిత్తి పడిపోవడం వంటివి దీనికి కారణంగా నిలిచాయి.


పెట్రోకెమికల్స్ విభాగం స్థూల లాభం 35.5 శాతం ఎగబాకి రూ.3,417 కోట్లకు చేరింది. పాలియెస్టర్, ఇతర ఫైబర్ ఉత్పత్తులకు సంబంధించి అమ్మకాలు జోరందుకోవడం దీనికి దోహదం చేసింది.


రిఫైనింగ్ విభాగం స్థూల లాభం రూ.5,445 కోట్ల నుంచి రూ.5,975 కోట్లకు పెరిగింది. 10 శాతం మేర వృద్ధి చెందింది.


రిటైల్ వ్యాపారం మార్జిన్లు కూడా భారీగా దూసుకెళ్లాయి. క్యూ2లో ఈ విభాగం స్థూల లాభం 42.1 శాతం వృద్ధితో రూ.114 కోట్ల నంచి రూ.162 కోట్లకు పెరిగింది.


సెప్టెంబర్ చివరినాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.1,89,132 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలానికి రుణ భారం రూ.1,80,388 కోట్లుగా ఉంది.


ఇక నగదు నిల్వలు కూడా రూ.89,966 కోట్ల నుంచి రూ.82,330 కోట్లకు తగ్గాయి.


రిలయన్స్ షేరు ధర గురువారం బీఎస్‌ఈలో 0.15 శాతం స్వల్ప లాభంతో రూ.1,089 వద్ద ముగిసింది. కాగా, మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి.


రిఫైనింగ్ వ్యాపారంలో పటిష్టమైన పనితీరుతో పాటు పెట్రోకెమికల్స్ విభాగంలో రికార్డుస్థాయి లాభాల కారణంగా క్యూ2లో అద్భుతమైన ఫలితాలను ప్రకటించగలిగాం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా రిఫైనింగ్ వ్యాపారం అధిక లాభదాయకతను నమోదు చేసింది. దీనికి ప్రధానంగా రిఫైనింగ్ అసెట్స్ సామర్థ్యంతో పాటు మార్కెట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా కంపెనీ సత్వర చర్యలు, కార్యకలాపాల నిర్వహణ పనితీరు దోహదం చేశాయి.


నిర్మాణంలో ఉన్న హైడ్రోకార్బన్ ప్రాజెక్టులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే... ఇంధన, పెట్రోకెమికల్స్ రంగంలో దిగ్గజ స్థానంలో ఉన్న కంపెనీ స్థాయి మరింత బలోపేతం అవుతుంది. రిలయన్స్ జియో 4జీ  సేవలకు కస్టమర్లనుంచి లభించిన అద్వితీయమైన స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మొబైల్ ఇంటర్నెట్(డేటా) పవర్‌తో దేశ ప్రజలందరి సామర్థ్యాలను మరింతగా పెంచడమే లక్ష్యంగా జియో టెలికం వెంచర్‌ను ఏర్పాటుచేశాం. 

- ముకేశ్ అంబానీ,  రిలయన్స్ సీఎండీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top