మరోవిడత రేట్ల కోతకు చాన్స్!

మరోవిడత రేట్ల కోతకు చాన్స్!


పావు శాతం తగ్గే అవకాశం...

ఆర్థికవేత్తలు, బ్యాంకర్ల అంచనా...

రేపు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష


న్యూఢిల్లీ/ముంబై: రుణ గ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ మరింత ఊరటనివ్వనున్నారా? వడ్డీరేట్లు ఇంకా దిగిరానున్నాయా? అవుననే అంటున్నారు బ్యాంకింగ్ వర్గాలు, ఆర్థికవేత్తలు.రేపు(మంగళవారం) చేపట్టబోయే పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ కీలక పాలసీ వడ్డీరేటును మరో పావు శాతం తగ్గించే అవకాశం ఉందనేది వారి అంచనా.



ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటం.. కోల్ ఇండియాలో వాటా విక్రయం విజయవంతం కావడంతో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వంటి కారణాల నేపథ్యంలో వృద్దికి చేయూతనిచ్చేందుకు ఆర్‌బీఐ మరోవిడత రేట్ల కోతకు ఓకే చెప్పొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

 

గత నెలలో అనూహ్యంగా ఆర్‌బీఐ పాలసీ రేటు(రెపో)ను పావు శాతం తగ్గించి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. దీంతో గడిచిన 20 నెలలుగా కొనసాగుతున్న కఠిన పాలసీకి బ్రేక్ పడినట్లయింది. రెపో రేటు ప్రస్తుతం 7.75%, రివర్స్ రెపో 6.75%, సీఆర్‌ఆర్ 4% వద్ద ఉన్నాయి. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 5%కి తగ్గగా.. టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం సున్నా స్థాయిలోనే(0.1%) ఉంది. కోల్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వానికి రూ.22,557 కోట్లు లభించాయి. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ.43,425 కోట్లలో ఇప్పటికే సగానికిపైగా ఖజానాకు చేరాయి.



ఇంకా ఓఎన్‌జీసీ, ఐఓఎల్, భెల్, ఎన్‌ఎండీసీ, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ వంటి పీఎస్‌యూలు వాటా విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో మార్చిలోగా ఈ లక్ష్యం సులువుగానే సాకారమయ్యే అవకాశాలు సుస్పష్టం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, అటు పారిశ్రామిక వర్గాలు ఆర్‌బీఐ మరింత రేట్లు తగ్గించాలని కోరుతున్నాయి. గతనెలలో పావు శాతం తగ్గింపు చాలా తక్కువేనని కార్పొరేట్లు పేర్కొంటున్నారు.  ద్రవ్యోల్బణం కట్టడిలో ఆర్‌బీఐ విజయం సాధించిందని.. రానున్నరోజుల్లో వడ్డీరేట్లు ఇంకాస్త దిగొచ్చే అవకాశాలున్నాయంటూ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం.

 

ఎవరేమన్నారంటే...




* రానున్న నెలల్లో వడ్డీరేట్లు ఒక శాతం వరకూ తగ్గే అవకాశాలున్నాయి. మెరుగైన దేశీ స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా రేపు ఆర్‌బీఐ చేపట్టే సమీక్షలో పావు శాతం రెపో రేటు కోతకు ఆస్కారం ఉంది.

 - అనిమేష్ చౌహాన్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ చీఫ్



* తాజా ద్రవ్యోల్బణం, ఇతరత్రా గణాంకాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్‌బీఐ కచ్చితంగా మళ్లీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలు సర్వత్రా నెలకొన్నాయి.

 - మలయ్ ముఖర్జీ, ఐఎఫ్‌సీఐ ఎండీ



* బడ్జెట్ తర్వాత ఎప్పుడైనా రేట్ల కోత ఉంటుందనే అంచనాలు గతంలోనే వున్నాయి. అయితే, ఈ నెల 3న తగ్గింపునకు అవకాశాలు పెరిగాయి. మొత్తంమీద ఈ ఏడాది(2015)లో ముప్పావు శాతం వడ్డీరేట్లు తగ్గే చాన్స్ ఉంది.

 - సౌమ్య కాంతి ఘోష్, ఎస్‌బీఐ చీఫ్ ఎకనమిస్ట్



* ద్రవ్యోల్బణం తగ్గుముఖం, ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణల ప్రభావంతో త్వరలోనే డిపాజిట్, రుణ రేట్లు మరింత దిగొస్తాయి. అయితే, రేపు సమీక్షపై అంచనా వేయలేను. తాము, ప్రభుత్వం చేపడుతున్న విధాన, సంస్కరణ చర్యలను ఆర్‌బీఐ నిశితంగా పరిశీలిస్తోంది. కొంత వేచిచూసే ధోరణిని అవలంభించవచ్చు. రానున్న రోజుల్లో కచ్చితంగా రేట్లు దిగొస్తాయి.

 - రాజన్ ధావన్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీ



* 3న రేట్ల కోతకు ఆస్కారం ఉంది. అయితే, గత నెలలో ఆనూహ్య తగ్గింపు నేపథ్యంలో మళ్లీ మార్చిలోనే ఆర్‌బీఐ రేట్లు తగ్గిస్తుందనేది మా ప్రాథమిక అంచనా

 - ప్రాంజుల్ భండారి, హెచ్‌ఎస్‌బీసీ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top