పీవీ హయాంలోనే పిలిచారు

పీవీ హయాంలోనే పిలిచారు


- ఎయిర్‌లైన్స్ ఏర్పాటు చేయాలని అడిగారు

- జేఆర్‌డీ టాటా చాలా ఆనందపడ్డారు

- మంచి భాగస్వామిని వెదకమని నాకు చెప్పారు

- అప్పట్లో అది కుదరలేదు: రతన్‌టాటా వెల్ల
డి

న్యూఢిల్లీ: ‘‘అవి పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న రోజులు. కేంద్ర కేబినెట్ కార్యదర్శిని జేఆర్‌డీ టాటా కలిశారు.



ప్రైవేటు విమానయాన కంపెనీలకు అనుమతివ్వాలని పీవీ ప్రభుత్వం అనుకుంటోందనే సంగతి ఆయనకు చెప్పారు. జేఆర్‌డీ ఉద్వేగానికి లోనై నాతో ఈ సంగతి చెప్పారు. అయితే ఎయిర్ ఇండియాను ఆరంభించినప్పటి రోజులు కావని, విమానయాన రంగంలో తీవ్ర పోటీ ఉందని, ఏవియేషన్ కంపెనీకి మంచి భాగస్వామి కావాలని, అప్పుడే దేశానికి అంతర్జాతీయ స్థాయి కంపెనీని అందించగలమని సూచించారు. కానీ అది జరగలేదు.’’ ఈ మాటలన్నది ఎవరో కాదు.



టాటా సన్స్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలసి విస్తారాను ఆరంభించిన సందర్భంగా బుధవారం రాత్రి ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయం చెప్పారు. ‘‘తరవాత విమానయాన సంస్థను ఏర్పాటు చేయాలంటూ అదే ప్రభుత్వం మమ్మల్ని నేరుగా కోరింది. కానీ కుదరలేదు’’ అని తెలియజేశారు.



పీవీ నరసింహారావు 1991-96 మధ్య ప్రధానిగా ఉండగా... ఈ సంఘటన ఏ సంవత్సరంలో జరిగిందన్నది మాత్రం టాటా వెల్లడించలేదు. 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ను జేఆర్‌డీ టాటా ఏర్పాటు చేయగా... దాన్ని జాతీయం చేసి ఎయిర్ ఇండియాగా పేరు మార్చారు. ఆయన 1993 నవంబర్‌లో మరణించారు. అప్పటిదాకా ఉన్న లెసైన్స్-పర్మిట్-కోటా పద్ధతిని తొలగిం చి ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడులకు ద్వారాలు తెరచిన పీవీ హయాంలోనే జెట్ ఎయిర్‌వేస్, దమానియా ఎయిర్‌వేస్ లెసైన్సులు పొందాయి.

 

గతంలోనే మనసు విప్పిన టాటా...


నిజానికి ఎయిర్‌లైన్స్ సంస్థను ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నా కుదరలేదని గతంలో కూడా చెప్పారు. అధికారులకు లంచాలివ్వటం ఇష్టంలేకే విమానయాన సంస్థను ఏర్పాటు చేయలేదని... ఓ మంత్రికి 15 కోట్లిస్తే లెసైన్సు వస్తుందని సహ పారిశ్రామికవేత్త చెప్పినా తానా పని చేయలేదని  2010లో కూడా చెప్పారు.



నిజానికి ఎయిర్‌ఇండియాలో 40 శాతం వాటా కొనటానికి టాటా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ కలసి చేసిన ప్రయత్నాలు గతంలో ఫలించలేదు. రెండోసారి ఇవి రెండూ కలసి విమాన సంస్థను ఏర్పాటు చేయబోయినా కుదరలేదు. మూడో ప్రయత్నంలో ఇవి విజయవంతమై... ‘విస్తారా’ విమానం ఇటీవలే తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది.

 

సేవలతోనే నిలబడాలి...

‘‘మిగతా ఎయిర్‌లైన్స్‌తో పోలిస్తే మనం ప్రత్యేకమైన సేవలందించాలి. భద్రతతో పాటు ప్రయాణికులకు  ప్రత్యేక అనుభూతినివ్వాలి. అప్పుడే ప్రయాణికులు మనని ఎంచుకుంటారు. అది చేయలేకపోతే చాలా కోల్పోతాం’’ అని టాటా చెప్పారు. ప్రత్యర్థులు ఇబ్బందులు పెడతారని కూడా ఆయన హెచ్చరించారు. అయితే సేవలు ఆరంభించడానికి తమ సంస్థ ఎంత ఓపిగ్గా వేచి చూసిందో చెబుతూ... ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామనడానికి ఇదే నిదర్శనమన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top