జూన్ నుంచి రామ్‌చరణ్ విమానాలు..

జూన్ నుంచి రామ్‌చరణ్ విమానాలు.. - Sakshi


‘ట్రూ జెట్’ పేరుతో విమాన సర్వీసులు

ఈ వారంలో రానున్న రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లు

దక్షిణాది నగరాలపై ప్రధానంగా దృష్టి

తొలుత పది పట్టణాలకు సేవలు

టర్బో మేఘ ఎయిర్‌వేస్ ఫౌండర్

మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్ తేజ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న టర్బో మేఘ విమాన సేవలు జూన్ నెల నుంచి ప్రారంభం కానున్నాయి.



‘ట్రూ జెట్’ పేరుతో రీజనల్ షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్స్ సేవలను ప్రారంభించడానికి టర్బో మెఘా ఎయిర్‌వేస్ చకచకా ఏర్పాటు చేసుకుంటోంది. జూన్ నెలాఖరులోగా తొలి విమానం ఎగురుతుందన్న ధీమాను టర్బో మేఘ ఎయిర్‌వేస్ ఫౌండర్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి వ్యక్తం చేశారు. ఈ వారంలో రెండు ఏటీఆర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు రానున్నాయని, డీజీసీఏ అనుమతులు కూడా తుది దశలో ఉన్నాయన్నారు. ప్రారంభంలో దక్షిణాది రాష్ట్రాల్లోని పది పట్టణాలకు సర్వీసులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఎయిర్‌పోర్టు పట్టణాలతో పాటు అహ్మదాబాద్, పుణే, గోవాలకు సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఉమేష్ ‘సాక్షి’కి తెలిపారు.

 

గ్రౌండ్ హ్యాండలింగ్ సేవల్లో ఉన్న టర్బో మేఘ ఎయిర్‌వేస్ ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా రీజనల్ షెడ్యూల్ ఎయిర్‌లైన్స్ సర్వీసులను ప్రారంభించనుంది. ఈ కంపెనీ బోర్డులో రామ్‌చరణ్ తేజ డెరైక్టర్‌గా ఉండటమే కాకుండా బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో చిన్న పట్టణాలకు విమాన సర్వీసులు డిమాండ్ అధికంగా ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ద్వితీయశ్రేణి నగరాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ఉమేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమాన ఇంధనంపై పన్నులను తగ్గించిందని, అదే విధంగా తెలంగాణలో కూడా తగ్గించమని ఇక్కడి ప్రభుత్వాన్ని కోరినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top