రుణాలు.. ఇక చౌక

రుణాలు.. ఇక చౌక


ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తన రూటే సెప‘రేటు’ అని మరోసారి నిరూపించారు. అకస్మాత్తుగా రెండోసారి పాలసీ వడ్డీరేట్లను తగ్గించి మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో గృహ, వాహన, రిటైల్ రుణాలపై నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం దిగిరానుంది. పారిశ్రామిక వర్గాల్లోనూ ఈ అనూహ్య నిర్ణయం ఆనందం నింపింది. అయితే, బ్యాంకర్లు తక్షణం రుణ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించనప్పటికీ..



త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని సానుకూల సంకేతాలిచ్చారు. మొత్తంమీద తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కార్పొరేట్లకు కాస్త సానుకూలంగా వ్యవహరించగా... ఇప్పుడు రాజన్ కూడా రేట్ల కోతతో తనవంతు చేయూతనివ్వడం విశేషం.


 

రేట్ల కోతతో ఆశ్చర్యపరిచిన ఆర్‌బీఐ గవర్నర్ రాజన్

పావు శాతం తగ్గింపుతో 7.5 శాతానికి రెపో రేటు

రెండు నెలల్లో రెండోసారి కట్..

రివర్స్ రెపో 6.5 శాతానికి తగ్గుదల..   

సీఆర్‌ఆర్ యథాతథంగా 4 శాతం

గృహ, వాహన, రిటైల్ రుణాలపై దిగిరానున్న ఈఎంఐలు

వడ్డీరేట్లపై బ్యాంకర్ల సానుకూల సంకేతాలు...   

పారిశ్రామిక రంగానికి బూస్ట్...


ముంబై: పాలసీ సమీక్షతో సంబంధం లేకుండా ఆర్‌బీఐ మళ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. దీంతో ఈ రేటు 7.5 శాతానికి దిగొచ్చింది. రెపోతో ముడిపడి ఉన్న రివర్స్ రెపో రేటు కూడా పావు శాతం తగ్గి.. 6.5 శాతానికి చేరింది. అయితే, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్)ను మాత్రం యథాతథంగా 4 శాతంగా కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.



జనవరి 15న ఆర్‌బీఐ అనూహ్యంగా పావు శాతం రెపో రేటును తగ్గించడం తెలిసిందే. తాజా కోతతో రెండు నెలల వ్యవధిలో రెండోసారి తగ్గించినట్లయింది. ద్రవ్యోల్బణం దిగిరావడంతోపాటు కనిష్ట స్థాయిలోనే కొనసాగుతుండటంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ(ద్రవ్యలోటు కట్టడి)కు కట్టుబడి ఉంటామని తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేసిన కొద్ది రోజులకే ఆర్‌బీఐ రేట్ల కోత నిర్ణయం వెలువడింది.

 

గత నెలలో(ఫిబ్రవరి 3న) జరిగిన ద్వైమాసిక పాలసీ సమీక్షలో పాలసీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించడం.. కేవలం చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్)ని మాత్రం అర శాతం తగ్గించడం విదితమే. దీనిద్వారా వ్యవస్థలోకి రూ.42,000 కోట్ల మేర నగదు లభ్యతను పెంచింది. కాగా, గతసారి పాలసీ రేట్ల తగ్గింపు సందర్భంగా ఆ ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు అందించేందుకు వెనుకంజవేసిన బ్యాంకులు..



ఈసారి మాత్రం రుణాలపై వడ్డీరేట్లను తగ్గించే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సానుకూల సంకేతాలిస్తున్నాయి. రాజన్ ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాక ప్రకటించిన రెండు రేట్ల తగ్గింపు నిర్ణయాలూ పాలసీ సమీక్షకు వెలుపలే తీసుకోవడం గమనార్హం. అలాగే ఈ రెండు దఫాలు తెల్లవారగానే రాజన్ రేటు తగ్గింపును ప్రకటించడం విశేషం. కాగా, వచ్చే నెలలో(ఏప్రిల్ 7న) ఆర్‌బీఐ తదుపరి పరపతి విధాన సమీక్షను నిర్వహించనుంది.

 

బ్యాంకులు కూడా అనుసరించాలి...: కార్పొరేట్లు

‘వృద్ధిని ప్రోత్సహించే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కొద్దిరోజుల్లోనే ఆర్‌బీఐ అకస్మాత్తుగా పాలసీ రేట్లను తగ్గించడం చూస్తే.. ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు ఇరు పక్షాలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది’ అని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ఆర్‌బీఐ చర్యల నేపథ్యంలో వినియోగ, కార్పొరేట్ రుణాలపై ఇక బ్యాం కులు కూడా వడ్డీరేట్ల తగ్గింపును ప్రకటిస్తాయన్న విశ్వాసం ఉం దని ఫిక్కీ ప్రెసిడెంట్ జ్యోత్స్న సూరి పేర్కొన్నారు. నిధుల లభ్య తలో  సమస్యలు ఎదుర్కొంటున్న రియల్టీ రంగానికి ఆర్‌బీఐ రేట్ల కోత చేదోడుగా నిలుస్తుందని రియల్ ఎస్టేట్ డెవలపర్ల సం ఘం(క్రెడాయ్) చైర్మన్ లలిత్ కుమార్ జైన్ వ్యాఖ్యానించారు.

 

బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గుతాయ్

తక్కువ రుణ రేటు వ్యవస్థ ప్రయోజనాన్ని త్వరలో బ్యాంకులు కస్టమర్లకు బదలాయిస్తాయని విశ్వసిస్తున్నా. బహుశా ఏప్రిల్ నుంచీ బ్యాంకింగ్ రుణ రేట్ల తగ్గింపు ఉంటుందని భావిస్తున్నా. మనం కొద్ది వారాల్లో కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. తక్కువ వడ్డీరేటు బదలాయింపును మనం చూడబోతున్నాం. రెండు దఫాలుగా రేట్ల కోత నిర్ణయం వినియోగదారులకు మళ్లించాల్సిన ఒత్తిడి బ్యాంకింగ్ వ్యవస్థలో తప్పనిసరిగా ఉంటుందని నేను అంచనావేస్తున్నా. ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడంలో వ్యవస్థాగత ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆయా అంశాలను సెంట్రల్ బ్యాంక్ పరిశీలిస్తుంది.  

 - రఘురామ్ రాజన్, ఆర్‌బీఐ గవర్నర్

 

నా మాటల అర్థం అది కాదు..

వడ్డీరేట్ల విషయంలో తన తాజా వ్యాఖ్యలపై రాజన్ వివరణ ఇచ్చారు. ‘దేశంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో వడ్డీరేట్ల కోత సాధ్యం కాదు’ అని రాజన్ ఇటీవల ఒక కార్యక్రమంలో   పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హఠాత్తుగా మీ వైఖరి మారిపోడానికి కారణమేమిటి? అని విశ్లేషకులు మంగళవారం ప్రశ్నించారు. దీనికి రాజన్ సమాధానం ఇస్తూ... తాను చేసిన వ్యాఖ్యల అర్థం తప్పుగా మీడియాలో వచ్చిందన్నారు. పలు దేశాలు ‘జీరో’ స్థాయికి వడ్డీరేట్లు తగ్గించినా, మనం ఆ స్థాయికి తగ్గించలేమని మాత్రమే తాను పేర్కొన్నానన్నారు. దేశంలో ఉన్న ద్రవ్యోల్బణం, డిమాండ్ పరిస్థితులే దీనికి కారణమని సైతం వివరించానని తెలిపారు. మార్కెట్‌ను ఈ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించాయన్న విమర్శలకు ఆయన స్పందిస్తూ, ‘ఇలా జరగదు. జరిగితే ఇందుకు క్షమాపణలు’ అన్నారు.

 

వడ్డీరేట్లు దిగొచ్చే సంకేతం



ఆర్‌బీఐ రేట్ల కోత తక్కువ రుణ రేటు వ్యవస్థకు సంకేతమేనని బ్యాంకర్లు అభిప్రాయపడ్డారు. అయితే అమలుకు కొంత సమయం పడుతుందని వారు  సూచించారు.



నెల రోజుల్లో ఆర్‌బీఐ రుణ రేటు అరశాతం తగ్గింది. అయితే డిపాజిట్ రేటు- రుణ రేటు ఆయా అంశాలను పరిగణను లోకి తీసుకోవడం, బేస్ రేట్ సమీక్ష వంటి అంశాలపై బ్యాంకింగ్‌కు కొంత సమయం పడుతుంది. వెరసి ఖాతాదారులు రుణ రేటు తగ్గింపునకు కొంత కాలం వేచిచూడాలి.

- టీఎం భాసిన్, ఐబీఏ చైర్మన్, ఇండియన్ బ్యాంక్ చీఫ్

 

అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని బేస్ రేటు కోతపై మా బ్యాంక్ తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఆయా అంశాలు బ్యాంకింగ్ నిర్ణయ రూపకల్పనకు దోహదం చేస్తాయి.

- అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చైర్‌పర్సన్

 

ఇది హర్షణీయం. వృద్ధి ఊతం లక్ష్యంగా బడ్జెట్‌లో పేర్కొన్న  సంస్కరణలు, పాలసీ చర్యల సానుకూలతలను ఆర్‌బీఐ నిర్ణయం ప్రతిబింబిస్తోంది.

- చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్

 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.5% రేట్ల కోతను నేను అంచనావేస్తున్నా. అదే జరిగితే వ్యాపారాభివృద్ధికి, పెట్టుబడులకు పునరుత్తేజం లభిస్తుంది.

- రాణా కపూర్, యస్ బ్యాంక్  సీఈఓ

 

స్వాగతిస్తున్నాం...

ఆర్‌బీఐ పాలసీ వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దీనివల్ల రుణ ఈఎంఐలు గణనీయంగా తగ్గేందుకు దోహదం చేస్తుంది. రానున్నకాలంలో వడ్డీరేట్లు మరింత తగ్గేందుకు ఆస్కారం ఉంది. దేశీయంగా ద్రవ్యోల్బణం అంచనాలు భారీగా దిగొచ్చాయి.  ప్రపంచవ్యాప్తంగా ప్రతి ద్రవ్యోల్బణం(డిఫ్లేషన్) ధోరణులు కనబడుతున్నాయి.

 - జయంత్ సిన్హా,ఆర్థిక శాఖ సహాయ మంత్రి

 

ఈ ఏడాది మరో 1% వరకూ తగ్గే చాన్స్: నిపుణులు

ఈ ఏడాది మరో అర శాతం నుంచి ఒక శాతం వరకూ ఆర్‌బీఐ పాలసీ రేట్లను తగ్గించే ఆస్కారం ఉందని మెజారిటీ బ్యాంకర్లు, ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. కొందరు బ్యాంకర్లయితే రానున్న పాలసీ సమీక్ష(ఏప్రిల్ 7న) మరోసారి రేట్ల తగ్గింపు ఉండొచ్చని కూడా పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిల్లో కొనసాగుతుండటమే దీనికి కారణమనేది వారి అభిప్రాయం. కాగా,  ఆర్‌బీఐ తాజా రెపో రేటు తగ్గింపుతో బ్యాంకులు తమ బేస్ రేటు(రుణాలపై వసూలు చేసే కనీస వడ్డీరేటు)ను కచ్చితంగా సమీక్షించాల్సిన పరిస్థితి నెల కొందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) చైర్మన్ టీఎం భాసిన్ వ్యాఖ్యానించారు. ఏవరేమన్నారంటే...

 

‘ఈ ఏడాది(2015)లో మరో ఒక శాతం రెపో రేటు కోత ఉండొచ్చు. వచ్చే నెల 7న తదుపరి కోతకు అవకాశం ఉంది’.

 - మోర్గాన్ స్టాన్లీ

 

‘ఆర్‌బీఐ నేడు తీసుకున్న రేట్ల కోత నిర్ణయం ఊహించిందే. ఈ ఏడాది మొత్తంమీద ఒక శాతం వరకూ పాలసీ రేట్ల తగ్గింపు ఉంటుందనేది మా అంచనా. దీనిలో అర శాతం ఇప్పటికే పూర్తయింది. అయితే, మిగతా అర శాతం ఎప్పుడుంటుందనే నిర్ధిష్టంగా చెప్పలేం’.

 - కేకీ మిస్త్రీ, హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌చైర్మన్, సీఈఓ

 

‘రేట్ల కోతకు ఆర్‌బీఐ ఎంచుకున్న సమయం ఆశ్చర్యపరిచింది. ఏప్రిల్, జూలై మధ్య మరో అర శాతం తగ్గింపు ఉండొచ్చని భావిస్తున్నా’.

 - ఏఎం నాయక్, ఎల్‌అండ్‌టీ చీఫ్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top