అధికారాలు తగ్గించే యోచనేదీ లేదు..

అధికారాలు తగ్గించే యోచనేదీ లేదు.. - Sakshi


- ఆర్‌బీఐ గవర్నర్ అధికారాల కోత ప్రతిపాదనలపై వెనక్కి తగ్గిన కేంద్రం

- ఐఎఫ్‌సీ ముసాయిదాపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని వివరణ

న్యూఢిల్లీ:
వడ్డీ రేట్ల విషయంలో ఆర్‌బీఐ గవర్నర్ అధికారాలకు కత్తెర వేసే ప్రతిపాదనలపై దుమారం రేగడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటోందని భావించడం సరికాదంటూ  సోమవారం హడావుడిగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరణనిచ్చే ప్రయత్నం చేశారు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి. సవరించిన ఇండియన్ ఫైనాన్షియల్ కోడ్ (ఐఎఫ్‌సీ) ముసాయిదాపై ప్రభుత్వం ఇప్పటిదాకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని, దీనిపై ఇంకా అభిప్రాయాలే సేకరిస్తోందని ఆయన చెప్పారు.



ఈ ముసాయిదాను చర్చాపత్రంగా కేంద్రం ఇంకా పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ అధికారాలకు కత్తెర వేసేశారనో, లేదా ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదో తీసుకుందనో భావించడం సరికాదని మహర్షి చెప్పారు. ఐఎఫ్‌సీ ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వం తన అభిప్రాయాలు వెల్లడిస్తుందని స్పష్టం చేశారు.



ద్రవ్యపరపతి విధాన కమిటీ ఏర్పాటు విషయంలో సంబంధిత వర్గాల అభిప్రాయాలు, అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు మొదలైనవి పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. చాలా మటుకు దేశాల్లో ఆర్‌బీఐ గవర్నరే ద్రవ్యపరపతి విధానాలను నిర్ణయించరంటూ మహర్షి పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే లక్ష్యంతో ఉన్న 26 దేశాల్లో దాదాపు 18 దేశాలు ఏకాభిప్రాయానికన్నా మెజారిటీ అభిప్రాయం విధానాన్నే పాటిస్తున్నాయని వివరించారు.



ఆ దేశాల్లో గవర్నర్‌కు కేవలం ఓటింగ్ అధికారాలు మాత్రమే ఉంటాయన్నారు. ద్రవ్యపరపతి విధానాలకు సంబంధించి ఏడుగురు సభ్యుల కమిటీలో మెజారిటీదే తుది నిర్ణయంగా ఉండాలని, ఆర్‌బీఐ గవర్నర్‌కి వీటో అధికారం తొలగించాలని సవరించిన ఐఎఫ్‌సీ ముసాయిదాలో ప్రతిపాదనలు ఉన్నాయి.  ఆర్‌బీఐ గవర్నర్ అధికారాలకు కోత పెట్టే అంశంపై ప్రభుత్వ వర్గాలు పరస్పర భిన్న ప్రకటనలతో గందరగోళానికి తెరతీశాయి. దీంతో, ఇందుకు సంబంధించిన సవరణ ప్రతిపాదనలు చేసినదెవరన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top