చౌక గృహాలొస్తున్నాయ్‌

చౌక గృహాలొస్తున్నాయ్‌


అందుబాటు గృహాల విభాగంలోకి బడా నిర్మాణ సంస్థలు

మౌలిక పరిశ్రమ హోదా, పన్ను రాయితీలే రాకకు కారణం

జాబితాలో ఒబెరాయ్, లోధా, బ్రిగేడ్, ఈఎంజీఈఈ సంస్థలు

భాగ్యనగరంలో ప్రజయ్, జనప్రియ సంస్థల ప్రాజెక్ట్‌లు




స్థిరాస్తి రంగానికి ఆర్ధిక మాంద్యంతో మొదలైన కష్టాలు స్థానిక రాజకీయాంశం, ఎన్నికలు, పెద్ద నోట్ల రద్దు, హెచ్‌1బీ వీసా నిబంధనల వరకూ అన్నీ సుడిగుండాలే. అమ్మకాల్లేక కొన్ని సంస్థలు బిచానా ఎత్తేస్తే.. మరికొన్ని కొత్త ప్రాజెక్ట్‌ల ఊసే మరిచిపోయాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తాజా కేంద్ర బడ్జెట్‌ ఊత కర్రలా నిలిచింది. దీంతో ఇన్నాళ్లూ లగ్జరీ గృహాలే లక్ష్యంగా సాగిన బడా నిర్మాణ సంస్థలు ఇప్పుడు అందుబాటు గృహాల వైపు దృష్టిసారించాయి. – సాక్షి, హైదరాబాద్‌



ఫిబ్రవరి 1, 2017... దేశీయ స్థిరాస్తి రంగం మరిచిపోలేని రోజు. ఎందుకంటే అందుబాటు గృహాల విభాగానికి మౌలిక పరిశ్రమ హోదా అందింది ఆ రోజే మరి. అలాగే బడ్జెట్‌లో అందుబాటు గృహాలకు రుణాలు, పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలనూ అందించిందీ అప్పుడే! ఇవన్నీ పొందాలంటే నిర్మాణ సంస్థలు అందుబాటు గృహాలను నిర్మించక తప్పని పరిస్థితి నెలకొనేలా చేసింది బడ్జెట్‌!! దీంతో ఇన్నాళ్లు లగ్జరీ గృహాల నిర్మాణంలో ఉన్న నిర్మాణ సంస్థలిప్పుడు అఫడబుల్‌ విభాగంలోకి వచ్చేశాయి.


ఈ జాబితాలో ఒబెరాయ్, లోధా, బ్రిగేడ్, ఈఎంజీఈఈ సంస్థలు ముందు వరుసలో నిలిచాయి. తొలి దశలో ఒబెరాయ్‌ సంస్థ ఎన్‌సీఆర్, బెంగళూరు, పుణెలో, బ్రిగేడ్‌ గ్రూప్‌ చెన్నై, హైదరాబాద్‌లో, లోధా గ్రూప్‌ పుణెలో అందుబాటు గృహాలను నిర్మించాలని నిర్ణయించాయి. ముంబైకి చెందిన ఈఎంజీఈఈ గ్రూప్‌ వచ్చే ఐదేళ్లలో రూ.1,600 కోట్ల పెట్టుబడులతో 25 వేల గృహాలను నిర్మించాలని లక్ష్యించింది. ఇప్పటికే ముంబైలోని నెరల్, షాపూర్‌ ప్రాంతాల్లో 100 ఎకరాల స్థలాన్ని కూడా కొనుగోలు చేసింది.



గడువులోగా గృహప్రవేశాలు..: చిన్న విస్తీర్ణంలో నిర్మాణం ఉండటం కారణంగా అందుబాటు గృహాల నిర్మాణ వ్యయం 25 శాతం అధికమవుతుందని ఏవీ కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ వెంకట్‌ రెడ్డి తెలిపారు. నాణ్యతలో ఏమాత్రం సందేహమక్కర్లేదన్నారు. ఎందుకంటే నాణ్యత తగ్గితే కొనుగోలుదారులు ముందుకు రారు. అందుకే నిర్మాణ వ్యయాన్ని పెంచి నాణ్యమైన గృహాలనే నిర్మిస్తారని వివరించారాయన. స్థానిక డెవలపర్లే కాకుండా పేరుమోసిన నిర్మాణ సంస్థలూ ఈ విభాగంలోకి అడుగుపెడితే కస్టమర్లకూ లాభమే. బడా సంస్థలు ప్రాజెక్ట్‌ లొకేషన్, వసతులు, విస్తీర్ణాలు, నిర్మాణంలో నాణ్యత, ధర.. ఇలా ప్రతి ఒక్కదాని మీద పరిశోధన చేసి ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు. పైగా అమ్మకాలతో సంబంధం లేకుండా గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి కొనుగోలుదారులకు అప్పగిస్తారు.



30 శాతం విస్తీర్ణం అధికం..: అందుబాటు గృహాల విస్తీర్ణాలు ముంబై, బెంగళూరు, ఎన్‌సీఆర్, కోల్‌కత్తా నగరాల్లో 30 చ.మీ., ఇతర ప్రాంతాల్లో 60 చ.మీ. కార్పెట్‌ ఏరియా ఉండాలని బడ్జెట్‌లో ప్రస్తావించారు. అంటే హైదరాబాద్‌లో 60 చ.మీ.లో ఉంటాయన్నమాట. ఇది భాగ్యనగరివాసులకు కలిసొచ్చే అంశం. ఎలాగంటే 60 చ.మీ. అంటే 645 చ.అ. అని అర్థం. (1 చ.మీ. = 10.76 చ.అ.) అయితే ఇది కార్పెట్‌ ఏరియా... అంటే గోడలు కాకుండా మనం ఉపయోగించే స్థలమన్నమాట. ఈ లెక్కన గతంతో పోల్చితే ఇప్పుడు ఇంటి విస్తీర్ణం 30 శాతం పెరుగుతుంది మరి.



చార్జీలను తగ్గిస్తేనే డిమాండ్‌

తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ వెంకట్‌ రెడ్డి

అందుబాటు గృహాలను నిర్మించాలంటే ముందుగా శివారుల్లో రహదారులు, మంచినీరు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి. అప్పుడే డెవలపర్లు, కొనుగోలుదారులు ఇద్దరూ ముందుకొస్తారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు గ్రిడ్‌ రోడ్లు, మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లను అభివృద్ది చేయాలి. అప్పుడే ఓఆర్‌ఆర్‌ పరిధిలో అందుబాటు గృహాల నిర్మాణాలు ఊపందుకుంటాయి. దీంతో ప్రభుత్వ 2 బీహెచ్‌కే పథకం సంకల్పమూ సిద్ధిస్తుంది. ఈ తరహా నిర్మాణాలకు రిజిస్ట్రేషన్‌ చార్జీలను నామమాత్రంగా వసూలు చేయాలి. స్థానిక సంస్థల ఫీజులను తగ్గించాలి. సర్వీస్‌ ట్యాక్స్, వ్యాట్, స్టాంప్‌ డ్యూటీ వీటన్నింటినీ కలిపి 2 శాతానికి పరిమితి చేయాలి.



ఫ్లాట్‌ విస్తీర్ణాలిలా..

హాల్‌: 10514= 140 చ.అ.

మాస్టర్‌ బెడ్‌: 11.5512= 138 చ.అ.

చిల్డ్రన్‌ బెడ్‌: 10510= 100 చ.అ.

డైనింగ్‌: 11.559= 103.50 చ.అ.

కిచెన్‌: 756= 42 చ.అ.

వాషింగ్‌: 3.556= 21 చ.అ.

టాయిలెట్స్‌ (2): 555= 50 చ.అ.

నోట్‌: ఈ విస్తీర్ణాలు ఒక అంచనాకే..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top