పేటీఎం బ్యాంక్‌ కార్యకలాపాలు షురూ

పేటీఎం బ్యాంక్‌ కార్యకలాపాలు షురూ


4 శాతం వడ్డీ రేటు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు

2020 నాటికి 50 కోట్ల మంది ఖాతాదారుల టార్గెట్‌




న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం మంగళవారం పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు ప్రారంభించింది. డిపాజిట్లపై 4 శాతం వడ్డీ రేటు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు ఉంటాయని ప్రకటించింది. అలాగే కనీస బ్యాలెన్స్‌ నిబంధనలు ఉండబోవని, ఆన్‌లైన్‌ లావాదేవీలకు (నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్‌ మొదలైనవి) ఫీజులు ఉండవని పేర్కొంది. ఎయిర్‌టెల్, ఇండియా పోస్ట్‌ తర్వాత పేమెంట్స్‌ బ్యాంక్‌ ప్రారంభించిన సంస్థల్లో పేటీఎం మూడోది.



చైనా దిగ్గజం ఆలీబాబా, జపాన్‌ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్‌ పెట్టుబడులున్న పేటీఎం.. రెండేళ్లలో తమ బ్యాంకింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ కోసం ప్రాథమికంగా రూ. 400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తొలి ఏడాదిలో సంస్థ31 శాఖలు, 3,000 పైచిలుకు కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్స్‌ను ప్రారంభించనుంది. కస్టమరు ఖాతాలో రూ. 25,000 డిపాజిట్లు దాటితే రూ. 250 క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించిన పేటీఎం.. డిపాజిట్లపై ఈ తరహా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఇవ్వడం ఇదే ప్రథమమని పేర్కొంది. వ్యాపార వర్గాల కోసం కరెంటు అకౌంట్లు కూడా ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిపింది.



‘ఒక కొత్త తరహా బ్యాంకింగ్‌ మోడల్‌ను రూపొందించేందుకు ఆర్‌బీఐ మాకు అవకాశం కల్పిం చింది. మా ఖాతాదారుల డిపాజిట్లు.. సురక్షితమైన ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా జాతి నిర్మాణంలో పాలుపంచుకోనుండటం గర్వకారణం. డిపాజిట్లేవీ రిస్కులున్న సాధనాల్లోకి మళ్లించడం జరగదు‘ అని పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ చైర్మన్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. టెక్నాలజీ తోడ్పాటుతో 2020 నాటికల్లా 50 కోట్ల మంది ఖాతాదారులకు విశ్వసనీయ బ్యాంకుగా ఎదగాలని నిర్దేశించుకున్నట్లు బ్యాంక్‌ సీఈవో రేణు తెలిపారు.



22 కోట్ల మంది వాలెట్‌ యూజర్లు...

ప్రస్తుతం పేటీఎం డిజిటల్‌ వాలెట్‌ వినియోగిస్తున్న వారి సంఖ్య 22 కోట్లుగా ఉంది. ఈ వాలెట్స్‌ను సంస్థ పేమెంట్‌ బ్యాంకుకు మళ్లించనుంది. యూజర్లు అకౌంటు ప్రారంభించేందుకు ఖాతాదారుల వివరాల వెల్లడి నిబంధనల (కేవైసీ) ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా కేవైసీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. తొలి దశలో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాలు ఆహ్వాన ప్రాతిపదికన ఉండనున్నాయి.  బ్యాంకింగ్‌ బీటా యాప్‌ ఉద్యోగులు, అనుబంధ సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పేటీఎం కస్టమర్లు బ్యాంక్‌ వెబ్‌సైట్‌ లేదా యాపిల్‌ ఐవోఎస్‌ ప్లాట్‌ఫాంలోని పేటీఎం యాప్‌ ద్వారా ఇన్విటేషన్‌ పొందవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top