ద్రవ్యోల్బణానికి ఈక్విటీలే విరుగుడు!

ద్రవ్యోల్బణానికి ఈక్విటీలే విరుగుడు!


ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మెరుగైన రాబడులకు అవకాశం 

సంప్రదాయ పథకాల్లో వచ్చే రాబడులు స్వల్పమే  

ద్రవ్యోల్బణంతో ముడిపెట్టి చూస్తే మిగిలేదేమీ ఉండదు




‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’ అన్నది వెనుకటి నుంచీ పెద్దలు చెప్పే మాట. ‘పిల్లలకు చదువులు చెప్పించి చూడు’ అన్నది నేటి తరం చెప్పుకోవాల్సిన మాట. ఎల్‌కేజీ, యూకేజీలకే వేలాది రూపాయల ఫీజులు... ఇంజనీరింగ్‌కు రూ.లక్షలు, వైద్య విద్యకు రూ.కోట్లు కుమ్మరించాల్సి వస్తోంది. ఇప్పుడే ఇంత కాస్ట్‌లీగా ఉంటే భవిష్యత్తులో విద్య చెప్పించడం సామాన్యులకు ఎంత శక్తికి మించిన వ్యవహారమో ఊహించొచ్చు. ఇక సొంతిల్లు సమకూర్చుకోవడం, పిల్లలకు వివాహాలు చేయడం కూడా బడ్జెట్‌తో ముడిపడినవే.  జీవన వ్యయమూ ఏటేటా పెరిగిపోతూనే ఉంది. పరిస్థితి ఇలా ఉంటే... లక్ష్యాలు ఘనంగా ఉంటే... అనాదిగా వస్తున్న సంప్రదాయ పొదుపు, మదుపు సాధనాలైన బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బంగారం, పీపీఎఫ్‌లను నమ్ముకుంటే ఒడ్డెక్కడం కష్టమే!



మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే వాటిలో ద్రవ్యోల్బణం కీలకమైనది. ఇది నిత్యావసరాల ధరలను పెంచేస్తూ రాబడులను మింగేసే మహమ్మారి. ఉదాహరణకు మీరు ఓ వస్తువును ఈ రోజు రూ.100 పెట్టి కొన్నారనుకోండి. 5 శాతం ద్రవ్యోల్బణం రేటు ఉంటే ఏడాది తర్వాత అదే వస్తువును రూ.105 పెట్టి కొనాల్సి వస్తుంది. అలాగే, సేవింగ్స్‌ ఖాతాలో రూ.100ను ఓ ఏడాది పాటు ఉంచేశారనుకోండి. దీనిపై వచ్చే వడ్డీ 4 శాతమే. ఏడాది పాటు సేవింగ్స్‌ ఖాతాలో ఉంచిన రూ.100 కాస్తా రూ.104 అవుతాయి. మరి ఏడాది క్రితం రూ.100కు కొన్న వస్తువు ద్రవ్యోల్బణం కారణంగా నేడు రూ.105 కాగా, బ్యాంకు ఖాతాలో రూ.100 రూ.104 దగ్గరే ఆగిపోయింది. అంటే మరో రూపాయి అదనంగా సమకూర్చుకుంటే గానీ సదరు వస్తువును సొంతం చేసుకోలేరు.



ఈ ఉదాహరణను బట్టి చూస్తే బ్యాంకు సేవింగ్స్‌ ఖాతా వడ్డీ రేటు ద్రవ్యోల్బణం రేటు కంటే తక్కువగా ఉందని అర్థమవుతోంది. వాస్తవంగా బ్యాంకు ఖాతాలో ఉంచిన రూ.100పై నికరంగా ఒక రూపాయి సంపదను మీరు ఓ ఏడాదిలో కోల్పోయినట్టు. ఇక సేవింగ్స్‌ ఖాతాలో ఉన్న నగదుపై వచ్చే వడ్డీ ఓ ఏడాదిలో రూ.10,000 దాటితే దానిపై పన్ను కట్టాల్సి ఉంటుంది. ఈ పన్నును, ద్రవ్యోల్బణాన్ని తీసేసి చూస్తే రూ.100 ఏడాది తర్వాత రూ.103.60గానే మిగిలిపోతుంది.



ఇక్కడ మనం చెప్పుకున్నది నిత్యావసర వస్తువుల ద్రవ్యోల్బణమే. అదే విద్యా ద్రవ్యోల్బణం చూసుకుంటే అది ఇంకా ఎక్కువే ఉంది. ఫీజుల పెరుగుదల ఏటేటా 10 శాతంకంటే ఎక్కువే ఉంటోంది. సగటున 10 శాతంగా చూసుకున్నా ఓ ఇంజనీరింగ్‌ కోర్స్‌ వ్యయం ఈ రోజు రూ.8 లక్షలు ఉంటే, ఎనిమిదేళ్ల తర్వాత రూ.17 లక్షలు అవుతుంది. 2030లో అయితే రూ.30 లక్షలు వ్యయం చేయాల్సిందే. ఇక వైద్య చికిత్సా వ్యయాల్లోనూ భారీ పెరుగుదల చూస్తూనే ఉన్నాం. ఈ స్థాయి వ్యయాలను తట్టుకోవాలంటే ఆ మేర ఆదాయార్జన పెరగాలి. పెట్టుబడులపై రాబడులు సైతం ద్రవ్యోల్బణాన్ని మించి ఉండాలి.



సిప్‌తో మరింత ప్రయోజనం

ప్రతి నెలా రూ.10,000 చొప్పున ఓ మంచి ఈక్విటీ పథకంలో 25 ఏళ్ల పాటు పెట్టుబడులు పెడుతూ వెళితే రూ.1.9 కోట్లు సమకూరుతుంది. అదే ఆర్డీలో రూ.10,000 చొప్పున పెడుతూ వెళితే 6 శాతం రేటు ఆధారంగా సమకూరే మొత్తం రూ.70 లక్షలే. ఉదాహరణకు పిల్లల విద్య కోసం ప్రతి నెలా రూ.5,000 చొప్పున మంచి ఈక్విటీ పథకాల్లో పెట్టుబడి పెడుతూ వెళితే నాలుగేళ్ల పాప లేదా బాబు కళాశాల విద్యకు వచ్చే సరికి 12 శాతం వార్షిక రాబడులు వస్తాయనుకుంటే రూ.20 లక్షల నిధి సమకూరుతుంది. ఇది చూడ్డానికి భారీ నిధిగానే కనిపిం చొచ్చు. కానీ ఓ పదేళ్ల తర్వాత దీని వాస్తవిక విలువ సగమే ఉంటుందని భావించొచ్చు.



నికర లాభాలు..!

పెట్టుబడులకు సంబంధించి ప్రాథమిక సూత్రం... పన్ను అనంతరం రాబడులు ద్రవ్యోల్బణ రేటును మించి ఉండాలి. అప్పుడే సంపద సృష్టి సాధ్యమవుతుందని ఆర్థిక పండితులు చెబుతుంటారు. చాలా వరకు సంప్రదాయ పొదుపు పథకాలు ఈ విధమైన సంపద సృష్టికి అక్కరకు రాలేదని గణాంకాలు చెబుతున్నాయి. పీపీఎఫ్‌ పథకంలో కాస్త మెరుగైన రాబడులు ఉన్నప్పటికీ ఈక్విటీలతో పోలిస్తే దూరంలోనే ఉన్నాయి. చారిత్రక గణాంకాలను చూసినా ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులను ఇచ్చాయని తెలుస్తోంది.



రెండు, మూడు, ఐదేళ్లలో భారీ సంపదను సృష్టించడం అంటే చాలా కష్టం. అదే ఓ 15, 20, అంతకంటే ఎక్కువ కాలానికి ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల ద్వారా సంపదను సృష్టించుకోవడం కష్టమైన పనేమీ కాదు. గత 25 ఏళ్లలో బంగారం 8.9 శాతం రాబడులను ఇస్తే, బ్యాంకు ఎఫ్‌డీలు 8.7 శాతమే ఇచ్చాయి. కానీ, మంచి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మాత్రం 12.2 శాతం రాబడులను అందించాయి. ఇక్కడ చూడాల్సిన మరో అంశం పన్ను. బ్యాంకు ఎఫ్‌డీలు, బంగారంపై రాబడులకు పన్ను భారం ఉండగా... ఈక్విటీలు, ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులపై రాబడులకు దీర్ఘకాలంలో ఎటువంటి పన్నూ లేదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top