ఓఆర్‌ఆర్ బయటకూ విస్తరించిన రియల్ బూమ్

ఓఆర్‌ఆర్ బయటకూ విస్తరించిన రియల్ బూమ్


ప్రస్తుతం హైదరాబాద్ జనాభా 80 లక్షలకు పైమాటే. 2041 నాటికి ఈ సంఖ్య 2.50 కోట్లు దాటుతుందని అంచనా. ఈ నేపథ్యంలో నగరంపై పడే ఒత్తిడిని తట్టుకోవాలంటే శివార్లలో చిన్న నగరాల నిర్మాణం అవసరమంటున్నారు నిపుణులు. త్వరలోనే దాదాపు 160 కి.మీ. పొడవునా నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.



ఈ ఓఆర్‌ఆర్ చుట్టూ ఒక్కో నగరం 3,813 చ.కి.మీ. విస్తీర్ణంలో మొత్తం 13 మినీ నగరాలను నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. శంషాబాద్ లో మెడికల్ సిటీ, కీసరలో నాలెడ్జ్ సిటీ, ఘట్‌కేసర్‌లో ఐటీ సాఫ్ట్‌వేర్ సిటీ, గుండ్లపోచంపల్లిలో బయో, ఫార్మా సిటీ, బొంగ్లూరులో ఐటీ హార్డ్‌వేర్ , ఎలక్ట్రానిక్స్ సిటీ, శామీర్‌పేటలో రిక్రియేషన్ సిటీ, కోకాపేట్‌లో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సిటీ, పటాన్‌చెరులో మీడియా సిటీ/ మార్కెట్ సెంటర్, ఆదిభట్ల, తక్కుగూడలో ఎయిరోస్పేస్ సిటీ, మేడ్చల్, తెల్లాపూర్-నాగులపల్లిలో ఇన్‌ల్యాండ్ కాంటినెంటల్ డిపోలు రానున్నాయి. దీంతో ఇప్పటివరకు ఓఆర్‌ఆర్ లోపల ఉన్న రియల్ బూమ్ కాస్త ఓఆర్‌ఆర్ వెలుపలి ప్రాంతాలకూ విస్తరించిందని కాడోల్ ప్రాపర్టీస్ పార్టనర్ విక్రమ్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఐటీ హబ్‌కు నేరుగా రవాణా వ్యవస్థ ఉన్న తెల్లాపూర్, కొల్లూరుల్లో అభివృద్ధి మరింత శరవేగంగా సాగుతోందన్నారు.



 డెరైక్ట్ కనెక్టివిటీ: ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే మెరుగైన రవాణా వ్యవస్థ, ధరలు అందుబాటులో ఉంటేనే సాధ్యం. ఈ విషయంలో కొల్లూర్ మాత్రం ముందు వరుసలోనే ఉంది.  ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు 15 నిమిషాల్లో, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు, మెహదీపట్నానికి 25 నిమిషాల్లో, ఓఆర్‌ఆర్ (ఎగ్జిట్ నం:2) 5 నిమిషాల ప్రయాణ వ్యవధిలోనే ఉందీ ప్రాంతం. గచ్చిబౌలి, కోకాపేట్ పరిసరాల్లో స్థిరాస్తి ధరలు ఎక్కువగా ఉండటంతో ఉద్యోగులు సుదూర ప్రాంతాల నుంచి గంటల కొద్దీ ప్రయాణం చేస్తూ గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ల్లోని కార్యాలయాలకు చేరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొనుగోలుదారులకు, పెట్టుబడిదారులకు స్థిరాస్తి రంగంలో కొత్త పెట్టుబడి ప్రాంతంగా అవతరించింది కొల్లూరు.



 కొల్లూరే బెటర్ చాయిస్: బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, హైటెక్ సిటీల్లో సొంతిల్లున్న వాళ్లు రెండో ఆస్తిగా బెంగళూరు, చెన్నై వంటి ఇతర నగరాలకు వెళ్లే వాళ్లు. కానీ, ప్రస్తుతం వారి రెండో ఆస్తిని కూడా తెల్లాపూర్, కొల్లూర్ ప్రాంతాల్లో ఉండేందుకే ఇష్టపడుతున్నారు. దీంతో ఇవి ఉన్నత శ్రేణి వర్గాలుండే ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో లక్షకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరికీ ప్రీమియం ఇళ్లను, షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్ వంటి వసతులను కల్పించేందుకు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. ధరలూ అందుబాటులో ఉండటం, మెరుగైన రవాణా వ్యవస్థ ఉండటంతో పెట్టుబడిదారుల దృష్టంతా ఇప్పుడు కొల్లూర్ పైనే. ఇప్పటికే కడోల్ ప్రాపర్టీస్, 9ఎం డెవలపర్స్, గోల్డెన్ గేట్ ప్రాపర్టీస్ వంటి నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top