వెబ్‌ సేవలకు ‘వన్‌స్టాప్‌’

వెబ్‌ సేవలకు ‘వన్‌స్టాప్‌’


డిజైన్, మార్కెటింగ్, టెక్నికల్‌ రైటింగ్, కన్సల్టెన్సీ సేవలన్నీ

రూ.10 వేలతో మొదలై 5 కోట్ల టర్నోవర్‌కు చేరిన ఇనోవీస్‌

దేశ, విదేశాల్లోని 365 కంపెనీలకు సేవలు

3 నెలల్లో వర్సిటీల్లో ఇంక్యుబేషన్‌ సెంటర్ల ఏర్పాటు

‘స్టార్టప్‌ డైరీ’తో సంస్థ ఫౌండర్‌ నాగేంద్ర బొమ్మసాని  




హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అమీర్‌పేట్‌లోని ఓ చిన్న గదిలో రూ.10 వేల పెట్టుబడితో మొదలైన కంపెనీ.. ఇప్పుడు దేశ, విదేశాల్లోని బడా సంస్థలకు సేవలందిస్తోంది. విద్య, వైద్యం, వ్యాపారం, స్థిరాస్తి రంగాల్లో... ప్రతి మూడు కంపెనీల్లో ఒకదానికైనా టెక్నాలజీ లేదా అప్లికేషన్‌ అభివృద్ధి చేసిన కంపెనీల్లో ‘ఇనోవీస్‌’ ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో!! చదువుకునే వయసులోనే తాను పనిచేసిన కంపెనీని కొని... ఆ అనుభవాన్నే ఇనోవీస్‌కు పునాది చేసిన సంస్థ వ్యవస్థాపకుడు నాగేంద్ర బొమ్మసాని...కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ రతన్‌ అవార్డునూ అందుకోవటమే కాదు, తన సంస్థను గూగుల్‌కు సంబంధించి అత్యుత్తమ సర్వీస్‌ ప్రొవైడర్లలో ఒకటిగా మార్చారు. సంస్థ ప్రారంభం, సేవలు, విస్తరణ ప్రణాళికలు ఆయన మాటల్లోనే...



మాది ఖమ్మం జిల్లా పాల్వంచ. డిగ్రీ చదువుతూ సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేవాణ్ణి. కొన్నాళ్లకు ఆ ఇనిస్టిట్యూట్‌ అమ్మకానికొస్తే కొనేశా. అదే నా కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌. ఎందుకంటే చదువుతూ పార్ట్‌ టైం జాబ్‌ చేయటం, అలా ఉద్యోగం చేసిన కంపెనీనే కొని స్థానికంగా నంబర్‌–1గా తీర్చిదిద్దటం... ఇవి నాపై నాకు నమ్మకాన్ని పెంచాయి. ఆరేళ్ల కిందట ఇనోవీస్‌.కామ్‌ను ప్రారంభించా. వెబ్‌ డిజైన్‌ నుంచి డెవలప్‌మెంట్, డిజిటల్‌ మార్కెటింగ్, టెక్నికల్‌ రైటింగ్, స్టార్టప్‌ కన్సల్టింగ్, మొబైల్‌ అప్లికేషన్స్‌... అన్ని రకాల టెక్నాలజీ సేవలందించడం మా ప్రత్యేకత. టెక్నాలజీ మేగజైన్‌ ‘సీఐఓ’... ఇనోవీస్‌ను 20 ఉత్తమ గూగుల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లలో ఒకటిగా పేర్కొంది.



దేశ, విదేశీ కంపెనీలకు సేవలు..

దేశ, విదేశాల్లోని విద్య, వైద్యం, వ్యాపారం, మీడియా, స్థిరాస్తి సంస్థలకు వెబ్‌సైట్లు, అప్లికేషన్స్, యాప్స్‌ అభివృద్ధి చేశాం. ఐటీ కంపెనీలకు కంటెంట్‌ విశ్లేషణ, ఆసుపత్రులకు ఆన్‌లైన్‌ కన్సల్టేషన్, విద్యా సంస్థలకు ఇంటర్నెట్, స్టూడెంట్‌ ఎవల్యూషన్‌ సిస్టమ్స్‌ సేవలందించాం. మీడియా సంస్థలకు బిజినెస్‌ పోర్టల్స్‌ను అభివృద్ధి చేసిచ్చాం. ప్రస్తుతం 365కు పైగా సంస్థలు మా క్లయింట్లుగా ఉన్నాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచే 300 కంపెనీలుంటాయి. అమెరికా, దుబాయ్, శ్రీలంకల్లోనూ మాకు క్లయింట్లున్నారు. వైట్‌ లేబులింగ్‌ సర్వీసెస్‌ కింద హైదరాబాద్‌లోని దాదాపు అన్ని కంపెనీలకూ టెక్నాలజీ సేవలందించింది ఇనోవీసే. అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ ప్రారంభ ధర రూ.2.5 లక్షలుగా ఉంది.



3 నెలల్లో ఇంక్యుబేషన్‌ సెంటర్ల ఏర్పాటు..

బడా కంపెనీలతో పాటు స్టార్టప్‌లకూ సేవలందించాలని నిర్ణయించాం. అందుకే స్టార్టప్‌ కన్సల్టెన్సీని ప్రారంభించాం. స్టార్టప్స్‌కు వెబ్‌సైట్‌ అభివృద్ధి నుంచి మార్కెటింగ్, విస్తరణ, బ్రేక్‌ ఈవెన్‌ వంటి అన్ని విభాగాల్లోనూ సేవలందిస్తున్నాం. తెలంగాణ, ఏపీల్లోని విశ్వ విద్యాలయాల్లో ఇంక్యుబేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని నాగార్జున యూనివర్సిటీతో ప్రారంభిస్తున్నాం. వచ్చే 3 నెలల్లో మరో 3 వర్సిటీల్లో సెంటర్లను ఏర్పాటు చేస్తాం.



రూ.5 కోట్ల టర్నోవర్‌ లక్ష్యం..

ప్రస్తుతం సంస్థలో ప్రత్యక్షంగా 36 మంది ఉద్యోగులున్నారు. వెబ్‌ అప్లికేషన్‌ సర్వీసు విభాగాన్ని హైదరాబాద్‌కు పరిమితి చేసి.. సపోర్ట్‌ ఎండింగ్‌ సర్వీసెస్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించాం. బెంగళూరుతో ప్రారంభించి 3 నెలల్లో ఇతర రాష్ట్రాల్లో ప్రారంభిస్తాం. గతేడాది రూ.3.8 కోట్ల టర్నోవర్‌ సాధించాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యించాం.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్‌ చేయండి...

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top