ఇండియన్ 'యాపిల్' !

ఇండియన్ 'యాపిల్' ! - Sakshi


అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థ విజయంలో భారతీయులదే ప్రధాన పాత్ర. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. యాపిల్ తయారు చేస్తున్న అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాల రూపకల్పనలో భారత ఇంజనీఇర్లే కీలక పోషిస్తున్నారు. అంతేకాదు ఈ సంస్థలో పనిచేస్తున్న నిపుణుల్లో మూడొంతులు మంది భారతీయులే కావడం విశేషం. 171 బిలియన్ డాలర్ల విలువ కలిగిన యాపిల్ వ్యాపారం వేగంగా విస్తరించడానికి భారత ఐటీ వ్యాపారులు తమ వంతు కృషి చేస్తున్నారు.



యూపిల్ కంపెనీ భారత ఇంజినీర్లపై బాగా ఆధారపడుతుందని అమెరికాకు చెందిన హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ తెలిపింది. యూపిల్ నుంచి హెచ్-1బీ వీసా దరఖాస్తులు పెరగడమే ఇందుకు నిదర్శమని పేర్కొంది. 2001-2010 మధ్యలో ఈ కంపెనీ 1,750 హెచ్-1బీ వీసాల దరఖాస్తులు చేసింది. 2011-13 కాలంలో ఈ సంఖ్య వేగంగా పెరిగి 2,800కు చేరింది. వీటిలో ఎక్కువ వీసాలు భారతీయుల కోసమేనని వెల్లడించింది. ఈ సమాచారాన్ని బట్టి చూస్తే ఐఫోన్, ఐపాడ్ రూపకర్తలు భారత ఇంజినీర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నారని అర్థమవుతోందని విశ్లేషించింది.

 

యూపిల్ లో పనిచేస్తున్న ఇంజినీర్లలో మూడొంతుల మంది భారతీయులేనని హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ ప్రధాన విశ్లేషకుడు పరీఖ్ జైన్ తెలిపారు. ప్రతి ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరు భారతీయ ఇంజినీరే అని చెప్పారు. వీరంతా హెచ్1బీ వీసా లేదా గ్రీన్ కార్డు కలిగినవారని వెల్లడించారు. 47 వేల మంది అమెరికాలో నేరుగా పనిచేస్తున్నారని 2012లో యూపిల్ వెల్లడించింది. వీరిలో 7,700 మంది కస్టమర్ సపోర్ట్ ఆపరేటర్లు, 27,350 మంది రిటైల్ స్టోర్స్ లో పనిచేస్తున్నారు. మిగతా 12 వేల మంది ఇంజినీర్లు, డిజైనర్లు, మార్కెటర్లు, ఇతర వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఉన్నారు.



భారత్ లో తమ మార్కెట్ ను మరింత పెంచుకునేందుకు అవుట్ సోర్సింగ్ వ్యూహాన్ని యాపిల్ అమలు చేస్తోంది. భారత్ కు చెందిన మూడు అగ్రశేణి సంస్థలతో సహా నాలుగు ఐటీ కంపెనీలకు తమ పనులు అప్పగించింది. భారతీయ ఉద్యోగులపైనే కాదు ఇండియన్ కంపెనీల మీద ఆధారపడుతున్న అమెరికా టెక్నాలజీ దిగ్గజాన్ని 'ఇండియన్ యాపిల్' అని సంబోధించినా అతిశయోక్తి కాబోదేమో!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top