రేపటి నుంచే ‘సేవల’ బాదుడు!

రేపటి నుంచే ‘సేవల’ బాదుడు!


14 శాతానికి చేరనున్న సేవా పన్ను

* మరిన్ని సేవలు దీని పరిధిలోకి

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటిదాకా చెల్లిస్తున్న సర్వీసు ట్యాక్స్(సేవా పన్ను) సోమవారం నుంచి మరింత పెరుగుతోంది. 12 శాతంగా ఉన్న ఈ ట్యాక్స్‌ను ఇక నుంచి 14 శాతానికి పెంచుతున్నారు. పెపైచ్చు వినోద రంగానికి సంబంధించిన కొన్ని సేవలతో పాటు ఇప్పటిదాకా సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రాని పలు సేవల్ని సోమవారం నుంచి దీని పరిధిలోకి తెస్తున్నారు.



హోటల్లో, రెస్టారెంట్లో భోజనం మాత్రమే కాదు. మొబైల్, ఇంటర్నెట్, విమాన ప్రయాణాలు, ఇంటర్నెట్‌లో తీసుకునే రైలు టికెట్లు, కేబుల్ సర్వీసులు, బ్యూటీ పార్లర్స్, హెల్త్ క్లబ్స్, వినోదం... ఇలా దాదాపు అన్ని సేవలకూ జూన్ 1 నుంచీ అదనపు భారం పడబోతోంది. సేవల పన్ను 12.36 శాతం (విద్యా సెస్సు కూడా కలిపి) నుంచి 14 శాతానికి పెరుగుతుండటమే దీనికి కారణం. దేశీయ పరోక్ష పన్నుల వ్యవస్థ 2016 ఏప్రిల్ 1 నుంచి  ‘వస్తువులు, సేవల పన్ను’గా (జీఎస్‌టీ) మారుతోంది. ఈ కొత్త వ్యవస్థకు అనుగుణంగా సేవల పన్ను రేట్లను మారుస్తున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇటీవలి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా చెప్పారు.

 

ప్రతి ఒక్కరికీ భారమే: పర్యాటకం, ఆతిథ్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, రవాణా, రియల్టీ, ఆటో రంగాలపై ప్రధానంగా ఈ భారం పడే అవకాశాలున్నాయి. అసలే మందగమనంలో ఉన్న రియల్టీ రంగం తాజా పరిస్థితి పట్ల ఆందోళన చెందుతోంది. సేవల పన్ను పెంపు వల్ల నిర్మాణ సామగ్రి వ్యయం పెరిగి అసలే ఇబ్బందుల్లో ఉన్న నిర్మాణరంగం కుదేలవుతుందని రియల్టీ సంస్థలు అంటున్నాయి. ప్రతి ఒక్కరిపై ఏదో  రకంగా సేవల పన్ను పెంపు భారం పడుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. సామాన్యునికిది పెను భారమనడంలో సందేహం లేదు.

 

ప్రభుత్వానికి లాభమెంత?.. సేవల పన్ను ద్వారా కేంద్రానికి వచ్చిన మొత్తం గత ఆర్థిక సంవత్సరం రూ.1.68 లక్షల కోట్లు. తాజా పెంపుతో ఈ మొత్తం 25 శాతం వృద్ధితో రూ. 2.09 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అంటే... దాదాపు రూ. 40వేల కోట్లు జనం జేబుల్లోంచి ప్రభుత్వ ఖజానాలోకి చేరుతాయన్న మాట.

 

ఏసీ, ఫస్ట్ క్లాస్ రైలు చార్జీలు అరశాతం పెంపు

కొత్త సేవా పన్ను అమల్లోకి రానుండడంతో జూన్ 1 నుంచి  ఏసీ క్లాస్, ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణ చార్జీలు 0.5 శాతం పెరగనున్నాయి. సరుకు రవాణా చార్జీలూ 0.5 శాతం పెరగనున్నాయి. ఏసీ క్లాస్ టికెట్ రూ.వెయ్యి దాటితే రూ. 10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top