గ్రీస్ రిఫరెండం..షరతులకు ప్రజలు నో!

గ్రీస్ రిఫరెండం..షరతులకు ప్రజలు నో! - Sakshi


 ప్రాథమిక ఫలితాల ప్రకారం బెయిలవుట్ షరతులకు అధిక శాతం వ్యతిరేకత



♦ యూరోజోన్‌లో గ్రీస్ భవితవ్యంపై నేడు జర్మనీ, ఫ్రాన్స్ అధిపతుల చర్చలు..

 

 ఏథెన్స్ : తమ దేశానికి ఇచ్చే తాజా రుణాల కోసం విధించిన ప్రస్తుత షరతుల్ని తాము అంగీకరించబోమని అధికశాతం మంది గ్రీసు ప్రజలు తేల్చిచెప్పారు. మరోసారి బెయిలవుట్ ప్యాకేజీకి  యూరోపియన్ యూనియన్(ఈయూ), అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)లు నిర్ధేశించిన షరతులకు ఒప్పుకోవాలా, వద్దా అన్నది తేల్చడానికి ఆదివారం నిర్వహిం చిన రిఫరెండంలో అధిక శాతం మంది ‘నో’ అంటూ నినదించినట్లు ప్రాధమిక ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కఠినమైన సంస్కరణలతో పాటు పెన్షన్లలో కోత, పన్నుల పెంపు ఇతరత్రా వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాలనేది రుణదాతలు విధించిన షరతుల్లో ప్రధానాంశం.  భారత్ కాలమానం ప్రకారం ఆదివారం 11.30 తర్వాత రిఫరెండం తొలి ఫలితం వెలువడింది. ఈ ఫలితం ప్రకారం 61% మంది ‘నో’కు, 39% మంది ‘యస్’కు ఓటేశారు.  కడపటి సమాచారం అందేసరికి 35% ఓట్ల లెక్కింపు జరిగింది.



 ప్రజలు తీర్పు ఇచ్చినంతమాత్రాన....

 గ్రీసు ప్రజలు రిఫరెండంలో ‘నో’ అన్నంతమాత్రాన గ్రీసు సమస్య తక్షణమే పరిష్కారమయ్యే అవకాశం లేదని విశ్లేషకులు చెప్పారు. షరతుల్ని సరళం చేసేందుకు యూరోజోన్ దేశాలు, ముఖ్యంగా జర్మనీ అంగీకరించాల్సివుంది. రిఫరెండం ఫలితం ప్రభుత్వానికి అనుకూలంగా వున్నందున, షరతుల్ని సడలించేందుకు గ్రీసు ప్రధాని, ఆర్థిక మంత్రి రుణదాతలపై ఒత్తిడి పెంచే అవకాశం మాత్రమే ఈ రిఫరెండం ఫలితం ఇస్తుంది తప్ప, బెయిల్‌అవుట్ ప్యాకేజీని తప్పనిసరిగా వచ్చేందుకు ఇది దోహదపడదు. రిఫరెండం ఫలితం నేపథ్యంలో జర్మనీ, ఫ్రాన్స్ దేశాల అధినేతలు సోమవారం సమావేశం కానున్నట్లు సమాచారం. యూరోజోన్ దేశాల్లో గ్రీసుకు ఎక్కువశాతం రుణాలిచ్చినవి ఈ రెండు దేశాలే.



 డీల్ కుదుర్చుకుంటాం... గ్రీసు ప్రభుత్వం

 ఒపినీయన్ పోల్స్ ప్రకారం రిఫరెండం ఓటింగ్‌లో ’నో’కు అధికశాతం మంది మొగ్గుచూపినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో త్వరలోనే రుణదాతలతో డీల్ కుదుర్చుకుంటామన్న విశ్వాసాన్ని గ్రీసు అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అలాగే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) ప్రస్తుతం అందిస్తున్న అత్యవసర నిధుల మొత్తాన్ని పెంచమంటూ ఆ బ్యాంక్‌ను సోమవారం కోరతామని ఆయన అన్నారు. బెయిల్ అవుట్ నిలిచిపోయిన తర్వాత రోజూవారీగా పరిమిత యూరోలను గ్రీసు బ్యాంకులకు సరఫరా చేస్తున్నది. ఈ నిధులు తక్కువగా వున్నందున, ప్రజలు ఏటీఎంల్లో నుంచి తీసుకునే మొత్తంపై గ్రీసు ప్రభుత్వం పరిమితులు విధించింది.



 బెయిలవుట్ షరతులకు నో చెప్పినట్లు ఫలితాల సరళి వెల్లడించిన నేపథ్యంలో యూరోజోన్‌లో గ్రీస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతోపాటు ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయి.  కాగా, షరతులకు అంగీకరించవద్దంటూ పిలుపునిచ్చిన గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రస్ ఓటు వేశాక మాట్లాడుతూ.. యూరోజోన్‌లో గ్రీస్ భవిష్యత్తును  రిఫరెండం నిర్దేశించనుందన్నారు. ‘స్వేచ్ఛగా, నిశ్చిం తగా జీవించాలనేది ప్రజల హక్కు. దీన్ని ఎవరూ కాదనలేరు. గ్రీస్ వాసులు తమ తలరాతను తామే నిర్ణయించుకుంటారు’ అన్నారు. ఐఎంఎఫ్‌కు గత నెల 30లోగా 1.7 బిలియన్ డాలర్ల రుణ బకాయిని చెల్లించకపోవడంతో అధికారికంగా గ్రీస్ దివాలా తీసినట్లు  ఈయూ  ఇప్పటికే ప్రకటించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top