న్యూ ఫండ్ ఆఫర్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా?

న్యూ ఫండ్ ఆఫర్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా? - Sakshi


నేను పదేళ్ల నుంచి మ్యూచువల్ ఫండ్స్(ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్ ఫండ్స్)లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా ఇన్వెస్ట్‌మెంట్స్ బాగా వృద్ధి చెందాయి.  ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నింటినీ ఉపసంహరించుకొని, పన్ను లేని, లేదా పన్ను తక్కువగా ఉండే సాధనాల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. తగిన సలహా ఇవ్వగలరు.

- మాణిక్యం, తిరుపతి



ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఏడాదికి మించిన ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే రాబడులపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈక్విటీల్లో స్వల్పకాలం ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.  దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ ఉండదు.  మీరు మ్యూచువల్ ఫండ్స్‌ల్లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేశారు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా బాగా వృద్ధి చెందాయి. ఇలాంటప్పుడు వీటిని విక్రయించి వేరే సాధనాల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకోవడం సరైనది కాదు. మీకు వేరే అవసరాలకు డబ్బులు అవసరమైనప్పుడు మాత్రమే ఈ మ్యూచువల్ ఫండ్స్‌ను విక్రయించుకోవడం సబబు. కాదూ, కూడదు వీటిని విక్రయించి వేరే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సిందేనని మీరు భావించిన పక్షంలో వీటిని విక్రయించి ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో ఇన్వెస్ట్ చేయండి.



నేనొక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నా వేతనం నుంచి నెలకు రూ.5,000 చొప్పున ఈపీఎఫ్‌కు కట్ అవుతోంది. దీంట్లో కంపెనీ వాటా రూ.2,500గా ఉంది. కంపెనీ ఇచ్చే ఈ రూ.2,500పై నేను సెక్షన్ 80సీ కింద ఆదాయపు పన్ను తగ్గింపును క్లెయిమ్ చేసుకోవచ్చా? నా వాటా రూ.2,500కు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందని, కంపెనీ వాటాకు వర్తించదని మిత్రులంటున్నారు. ఇది నిజమేనా?

 - రాజేశ్, విశాఖపట్టణం



మీ మిత్రులు చెప్పిందే కరెక్టు. మీ వాటా ఈపీఎఫ్ సొమ్ముపై మాత్రమే మీరు ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80సీ కింద పన్ను తగ్గింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కంపెనీ వాటా పన్నునుంచి మినహాయించబడుతుంది. కంపెనీ వాటాపై మీరు ఆదాయపు పన్ను తగ్గింపును క్లెయిమ్ చేసుకోలేరు.



మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సురక్షితమా? లేక పోస్ట్ ఆఫీస్/బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడం సురక్షితమా? ఇక వేటిల్లో రాబడులు ఎక్కువగా వస్తాయి ?

 - నవనీత, వరంగల్

 

మ్యూచువల్ ఫండ్స్‌లో కంటే  పోస్టాఫీస్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలోనే ఇన్వెస్ట్‌మెంట్స్‌కు భద్రత ఎక్కువ. మీరు ఎంచుకునే కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్‌ను బట్టి రాబడులు ఆధారపడి ఉంటాయి. మీరు లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారనుకుంటే మీకు నష్టాలు వచ్చే అవకాశాలు తక్కువ. నేషనల్ సేవింగ్స్ ఆర్గనైజేషన్ పోస్ట్ ఆఫీసుల ద్వారా టెర్మ్ డిపాజిట్లను వికయిస్తోంది. ఇది అత్యంత సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనం. దీంతో పోలిస్తే మ్యూచువల్ ఫం డ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ అంత సురక్షితమైనవి కావని చెప్పవచ్చు. అయితే బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ల తో పోల్చితే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై రాబడులు అధికంగా వచ్చే అవకాశాలుఉన్నాయి.

 న్యూ ఫండ్ ఆఫర్(ఎన్‌ఎఫ్‌ఓ)లో రూ. 5,000-10,000 రేంజ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా? దీర్ఘకాలిక లాభాల కోసం ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పదేళ్లపాటు కొనసాగించాలనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా?

 - కిరణ్, ఈ-మొయిల్



న్యూ ఫండ్ ఆఫర్(ఎన్‌ఎఫ్‌ఓ)లకు దూరంగా ఉండమని మేము ఎప్పుడు ఇన్వెస్టర్లకూ సలహా ఇస్తూ ఉంటాము. దీని కంటే కూడా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. మీరు దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకొని, చిన్న మొత్తాల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. ఒక్కసారి ఇన్వెస్ట్‌మెంట్ కోసం చిన్న మొత్తమైనా సరే ఎన్‌ఎఫ్‌ఓలో ఇన్వెస్ట్ చేయకపోవడమే ఉత్తమం. ఫండ్ పనితీరును తెలిపే ట్రాక్ రికార్డ్ ఎన్‌ఎఫ్‌ఓలకు ఉండనందున వాటి భవిష్యత్ పనితీరును అంచనా వేయలేం. మీ ఇన్వెస్ట్‌మెంట్స్ పెరగవచ్చు, లేదా తరగవచ్చు. ఎన్‌ఎఫ్‌ఓలో కాకుండా ఇప్పటికే ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి పనితీరు ఉన్న ఫండ్స్‌ను ఎంచుకోండి. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే చాలా ప్రయోజనాలు పొందవచ్చు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్ చక్రగతిన వృద్ధి సాధిస్తాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఐపి)ను అనుసరిస్తే, మార్కెట్లు తక్కువగా ఉన్నప్పుడు మీకు ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. ఎక్కువ లాభం కళ్లజూడవచ్చు కూడా. మంచి ఫండ్‌లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే మీరు మంచి రాబడులు పొందవచ్చు. దీని కోసం మీరు ఎన్‌ఎఫ్‌ఓ కోసం చూడాల్సిన పని లేదు. అయితే ఫండ్స్ కేటాయింపు, మేనేజ్‌మెంట్, తదితర అంశాలపై మీకు బలమైన విశ్వాసం ఉంటేనే ఎన్‌ఎఫ్‌ఓలో ఇన్వెస్ట్ చేయండి.

 

 ధీరేంద్ర కుమార్

 సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top