ఫండ్స్‌కు స్వల్ప ఊరట

ఫండ్స్‌కు స్వల్ప ఊరట


లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లు-2014కు ఆమోదం

డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై 20% పన్ను జూలై 10 నుంచి అమల్లోకి

ఐటీ పన్ను రిటర్నుల జాప్యాలకు జరిమానాపై సీబీడీటీకి విచక్షణాధికారం


న్యూఢిల్లీ: బడ్జెట్‌లో మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పరిశ్రమపై విధించిన అధిక పన్ను నుంచి స్వల్ప ఊరటను కల్పిస్తూ ప్రతిపాదనల్లో కేంద్రం కొద్దిగా సవరణలు చేసింది. అదేవిధంగా ఆదాయపు పన్ను(ఐటీ) చెల్లింపుదారులకు కూడా కొంత వెసులుబాటు కల్పించే చర్యలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ స్వల్ప మార్పులు మినహా ఫైనాన్స్ బిల్లు-2014లోని మిగతా ప్రతిపాదనలన్నింటికీ లోక్‌సభలో శుక్రవారం ఆమోదముద్ర పడింది. దీంతో దిగువసభలో బడ్జెట్ ప్రక్రియ పూర్తయింది. ఈ ఏడాది బడ్జెట్‌లో డెట్ మ్యూచువల్ ఫండ్ యూనిట్ల విక్రయాలపై దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్నును 10 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్లు జైట్లీ ప్రతిపాదించారు.



ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. అయితే, ఇప్పుడు ఈ 20 శాతం పన్ను విధింపు అనేది బడ్జెట్ సమర్పించిన రోజు(జూలై 10) నుంచి అమల్లోకి వస్తుందని, ఈ మేరకు మూడు నెలలపాటు వాయిదావేస్తూ ఫైనాన్స్ బిల్లులో సవరణలు చేస్తున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 1 నుంచి జూలై 10 వరకూ విక్రయించిన డెట్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై గతంలో ఉన్న 10 శాతం పన్ను రేటే అమలవుతుందని ప్రకటించారు. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువగా కార్పొరేట్ కంపెనీలే ఆర్బిట్రేజ్ కోసం పెట్టుబడులు పెడుతున్నాయని.. అందుకే ఈ 10 శాతం రాయితీ పన్ను రేటును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఫైనాన్స్ బిల్లుపై చర్చకు సమాధానమిస్తూ జైట్లీ వ్యాఖ్యానించారు.



ఇప్పటివరకూ డెట్ ఫండ్స్ యూనిట్లపై దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధింపునకు వ్యవధిని ఏడాది కాలంగా పరిగణిస్తుండగా.. బడ్జెట్‌లో మూడేళ్ల తర్వాత విక్రయించే యూనిట్లకు మాత్రమే ఈ పన్ను వర్తింపజేసేలా వ్యవధిని పెంచిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం పెంచిన పన్ను రేట్లను మూడు నెలలపాటు వాయిదా వేయడం కేవలం అతిస్వల్ప ఊరటమాత్రమేనని.. దీనివల్ల తమ రంగానికి పెద్దగా ఉపయోగం లేదని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ వర్గాలు పెదవివిరిచాయి.

 

ఐటీ రిటర్నుల జరిమానాలకు సంబంధించి...

ఐటీ రిటర్నుల దాఖలులో జాప్యానికిగాను ప్రస్తుతం ఉన్న రోజువారీ పద్దతిలో జరిమానా విధింపు నుంచి ఊరటనిచ్చే అధికారాన్ని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)కే ఇవ్వనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. ఎవరైనా ఏడాది లేటుగా రిటర్నులు దాఖలు చేస్తే జరిమానా చాలా భారీగా ఉంటోందని... పెనాల్టీ తగ్గింపు లేదా మాఫీ అధికారం ప్రస్తుతం సీబీడీటీకి లేదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే జరిమానా విధింపుపై విచక్షణాధికారాన్ని సీబీడీటీకి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే చర్యలు తీసుకున్న ఐటీ కేసులపై పన్ను చెల్లింపుదారులు తిరిగి సెటిల్‌మెంట్ కమిషన్‌కు వెళ్లే వెసులుబాటును కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

 

త్వరలో గార్‌పై నిర్ణయం...

పన్ను ఎగవేతల నిరోధానికి సంబంధించి గత యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జనరల్ యాంటీ అవాయ్‌డెన్స్ రూల్స్(గార్) చట్టం అమలు, దీనిలో మార్పుచేర్పులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని జైట్లీ చెప్పారు. ఈ చట్టం అమలును వచ్చే ఏడాది ఏప్రిల్ 1 వరకూ గత సర్కారే వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గార్‌పై దేశీ ఇన్వెస్టర్లతోపాటు విదేశీ పెట్టుబడిదారుల నుంచి కూడా తీవ్ర వ్యతికేకత వ్యక్తం కావడంతో దీన్ని సమీక్షించనున్నట్లు ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రకటన చేసింది. కాగా, మార్చిలోగా సెయిల్(5% వాటా విక్రయం), ఆర్‌ఐఎన్‌ఎల్(వైజాగ్ స్టీల్-10%), హిందుస్తాన్ ఏరోనాటిక్స్(హెచ్‌ఏఎల్10%)లలో డిజిన్వెస్ట్‌మెంట్‌ను చేపట్టనున్నట్లు  ఆరుణ్ జైట్లీ వెల్లడించారు.

 

తక్కువ పన్ను రేట్లే లక్ష్యం...


సామాజిక కార్యకలాపాలకు మరిన్ని నిధులను సమకూర్చుకోవడం, దేశంలో ఉద్యోగకల్పన పెంపొందించేందుకుగాను పారిశ్రామిక రంగాన్ని పోత్సహిస్తామని.. పన్ను రేట్లను తక్కువస్థాయిలోనే ఉంచుతామని ఆయన హామీనిచ్చారు. ఇన్వెస్టర్లలో దెబ్బతిన్న విశ్వాసాన్ని  పునరుత్తేజపరచడం, దేశీ ఉత్పత్తులకు విదేశాల్లో పోటీపడే వాతావరణం కల్పించేందుకు తక్కువ పన్ను రేట్లు ఆవశ్యకమని చెప్పారు. పొదుపు, పెట్టుబడుల పెంపు, తయారీ రంగం గాడిలోపడటంతోపాటు వృద్ధి తిరిగి పుంజుకునేందుకు దోహదం చేస్తుందన్నారు. తమ ప్రభుత్వానికి అధిక పన్నులు, సుంకాల జమానా కాదని చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top