చేతకాకే మూర్తిపై నిందలు

చేతకాకే మూర్తిపై నిందలు


 సిక్కా రాజీనామాపై ఇన్ఫీ మాజీ సీఎఫ్‌ఓ పాయ్‌ మండిపాటు

 చెత్త పనితీరును కప్పిపుచ్చుకోవడానికే డ్రామాలని వ్యాఖ్య  




బెంగళూరు: ఇన్ఫోసిస్‌ సీఈఓ పదవికి అర్ధంతరంగా గుడ్‌బై చెప్పిన విశాల్‌ సిక్కాపై కంపెనీ మాజీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిక్కా తన చెత్త పనితీరును కప్పిపుచ్చుకోవడానికే మూర్తిపై ఆరోపణలు గుప్పించారని.. చేతకాక పదవినుంచి తప్పుకున్నారని ఇన్ఫీ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్‌ పాయ్‌ మండిపడ్డారు. తనపై పదేపదే నిరాధార ఆరోపణలు, వ్యక్తిగతంగా కూడా దూషణలను భరించలేకపోవడంవల్లే తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్ఫీని వీడుతున్నానంటూ రాజీనామా లేఖలో సిక్కా పేర్కొన్న సంగతి తెలిసిందే. నేరుగా మూర్తిపేరును ఆయన ప్రస్తావించకపోయినప్పటికీ... ఇన్ఫీ బోర్డు మాత్రం సిక్కా రాజీనామాకు మూర్తే కారణమని కుండబద్దలుకొట్టింది.



దీంతో దాదాపు ఏడాదికాలంగా బోర్డుతో మూర్తి సాగిస్తున్న పోరు తారస్థాయికి చేరింది. ‘ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సిక్కా తనంతటతానుగా వైదొలగారనుకున్నారు. తన వైఫల్యాలను బయటపడకుండా చేసుకోవడం కోసం మూర్తిని టార్గెట్‌ చేసుకొని సిక్కా ఆరోపణలు చేశారు’ అని పాయ్‌ వ్యాఖ్యానించారు. ఒకపక్క, కొత్త సీఈఓ ఎంపిక కత్తిమీదసాముగా మారగా.. కంపెనీలో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాలపై అమెరికాలోని కొన్ని న్యాయ సంస్థలు క్లాస్‌యాక్షన్‌ దావాలు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో అటు ఇన్వెస్టర్లతోపాటు కంపెనీ క్లయింట్లలో కూడా తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయి. షేర్ల బైబ్యాక్‌ ప్రకటనను చేసినప్పటికీ(షేరుకు రూ.1,150 చొప్పున ధరతో) స్టాక్‌ మార్కెట్లో ఇన్ఫీ స్టాక్‌ కుప్పకూలుతూనే ఉంది. వరుసగా రెండురోజుల్లో 14 శాతంపైగా దిగజారి... రూ.873 స్థాయికి పడిపోయింది.



మళ్లీ కొత్త పోస్టు ఎందుకు...: పూర్తిస్థాయి కొత్త సీఈఓ నియామకం జరిగేవరకూ సిక్కాను ఎగ్జిక్యూటివ్‌ వైస్‌–చైర్మన్‌గా కొనసాగించాలని బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని కూడా పాయ్‌ తప్పుబట్టారు. ‘కంపెనీకి ఇప్పటికే చైర్మన్‌(ఆర్‌.శేషసాయి), సహ–చైర్మన్‌(రవి వెంకటేశన్‌)లు ఉన్నారు. తాత్కాలిక సీఈఓను(యూబీ ప్రవీణ్‌ రావు) కూడా నియమించారు మళ్లీ కొత్తగా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ ఎందుకు? ఇదంతా తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది’ అని పేర్కొన్నారు. కాగా, కాబోయే సీఈఓగా కంపెనీకి చెందినవారు ఉండలా, బయటివ్యక్తి అయితే మంచిదా అన్న ప్రశ్నకు... పొగరుబోతుగా, సొంత నిర్ణయాలతో వ్యవహరించే వ్యక్తులు కాకుండా... ఇన్ఫోసిస్‌ సంస్కృతి, విలువను గౌరవించే వ్యక్తి అయి ఉండాలని బదులిచ్చారు.  



ఇన్ఫీ చైర్మన్, కో–చైర్మన్‌లు వైదొలగాలి

మాజీ సీఎఫ్‌ఓ వి.బాలకృష్ణన్‌   

న్యూఢిల్లీ: ఇన్ఫీలో సిక్కా రాజీనామా ప్రకంపనలు ఇప్పట్లో ఆగేలాలేవు. కొత్త సీఈఓ కోసం అన్వేషణ మొదలుపెట్టడానికిముందే కంపెనీ డైరెక్టర్ల బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని కంపెనీ మాజీ సీఎఫ్‌ఓ వి.బాలకృష్ణన్‌ డిమాండ్‌ చేశారు. చైర్మన్‌ ఆర్‌.శేషసాయి, సహ–చైర్మన్‌ రవి వెంకటేశన్‌లు కూడా బోర్డు నుంచి తప్పుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇన్ఫోసిస్‌లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాలకు ఆడిట్‌ విభాగం హెడ్‌ రూపా కుద్వా, రెమ్యూనరేషన్‌ విభాగం హెడ్‌ జెఫ్రీ ఎస్‌. లేమాన్‌లే బాధ్యత వహించాల్సి ఉంటుందని కంపెనీ ప్రమోటర్‌ నారాయణమూర్తి ఆరోపించిన  నేపథ్యంలో బాలకృష్ణన్‌ వ్యాఖ్యలు కూడా ఇదే తరహాలో ఉండటం గమనార్హం.



ముందుగా బోర్డును ప్రక్షాళన చేయకుండా కొత్త సీఈఓను తీసుకురావడం కంపెనీకి ఆత్మహత్యాసదృశంగా మారుతుందని బాలకృష్ణన్‌ అన్నారు. ‘పెద్ద ఇన్వెస్టర్లు, వ్యవస్థాపకులతో తగినవిధంగా చర్చించి బోర్డులోకి మంచి వ్యక్తులకు చోటుకల్పించాలి. ఇప్పుడున్న బోర్డును చూస్తే... ఇన్ఫీకి సారథ్యం వహించేందుకు మంచి సీఈఓలు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి కనబడటం లేదు’ అని బాలకృష్ణన్‌ వ్యాఖ్యానించారు. కొత్త సీఈఓ నియామకానికి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ గడువును ఇన్ఫీ బోర్డు నిర్దేశించిన సంగతి తెలిసిందే. కాగా, ఇజ్రాయిల్‌ కంపెనీ పనయా కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ డీల్‌పై దర్యాప్తు నివేదికను ఇన్ఫోసిస్‌ బయటపెట్టాల్సిందేనని కూడా బాలకృష్ణన్‌ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top