ఎయిర్‌టెల్ లాభాల రింగింగ్

ఎయిర్‌టెల్ లాభాల రింగింగ్


క్యూ1లో 61% అప్



రూ. 1,108 కోట్లకు నికర లాభం

74% ఎగసిన డేటా ఆదాయం

21 కోట్లకు కస్టమర్ల సంఖ్య


 

న్యూఢిల్లీ: మొబైల్ టెలికం సేవల దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ఈ ఏడాది(2014-15) క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 61% జంప్‌చేసి రూ. 1,108 కోట్లను తాకింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో రూ. 689 కోట్లను మాత్రమే ఆర్జించింది. ఇందుకు ప్రధానంగా మొబైల్ డేటా బిజినెస్‌లో వృద్ధి దోహదపడింది. ఇదే కాలానికి మొత్తం ఆదాయం 13%పైగా పుంజుకుని రూ. 22,962 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ మొబైల్ డేటా ఆదాయం 74% ఎగసి రూ. 2,204 కోట్లయ్యింది.

 

దీనిలో దేశీయ వాటా రూ. 1,559 కోట్లుకాగా, ఇది 68% వృద్ధిని సాధించింది. ఇక ఆఫ్రికా నుంచి దాదాపు 9% అధికంగా 10.2 కోట్ల డాలర్ల డేటా ఆదాయం లభించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, దక్షిణాసియాలో ఉన్న మొత్తం కార్యకలాపాల ద్వారా 3జీ సర్వీసులను అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం ఆదాయంలో మొబైల్ డేటా వాటా 6% నుంచి 10%కు పుంజుకున్నట్లు వెల్లడించింది.

 

రూ. 58,000 కోట్ల రుణాలు

జూన్ చివరికల్లా కంపెనీ రుణాలు రూ. 57,774 కోట్లుగా నమోదయ్యాయి. కాగా, దేశీయ ఆదాయంలో దాదాపు 12% వృద్ధి నమోదైందని కంపెనీ ఎండీ గోపాల్ విఠల్ చెప్పారు. మొబైల్ డేటా విభాగం 68% జంప్‌చేయగా, డీటీహెచ్  ఆదాయం 21% పుంజుకుందని కంపెనీ తెలిపారు. జూన్ చివరికి దేశీయంగా 21 కోట్లమంది కస్టమర్లను కలిగి ఉన్నట్లు వెల్లడించారు.

 

ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 200 నుంచి రూ. 202కు పెరిగినట్లు తెలిపారు.  డేటా కస్టమర్ల సంఖ్య 3.93 కోట్లకు చేరగా, వీరిలో 1.25 కోట్లమంది 3జీ వినియోగదారులని చెప్పారు. డేటా ఏఆర్‌పీయూ రూ. 139గా నమోదైనట్లు తెలిపారు. ఆఫ్రికా నుంచి 10% అధికంగా 116.4 కోట్ల డాలర్ల ఆదాయం లభించినట్లు చెప్పారు. సోమవారం బీఎస్‌ఈలో షేరు యథాతథంగా రూ. 354 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top