భారత్‌లో క్లౌడ్ మార్కెట్ @ 2 లక్షల కోట్ల డాలర్లు


న్యూఢిల్లీ: భారత్‌లో క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీకి అపార అవకాశాలున్నాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. దేశంలో ఈ మార్కెట్ విలువ సుమారు 2 లక్షల కోట్ల డాలర్లు(రూ.120 లక్షల కోట్లు)గా ఆయన అంచనా వేశారు. ఊరిస్తున్న ఇంత భారీ మార్కెట్ అవకాశాలను చేజ్కించుకోవడం కోసం భారత్‌పై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నట్లు చెప్పారు.



2015 కల్లా మూడు నగరాల్లో క్లౌడ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నామని.. వాణిజ్యపరమైన క్లౌడ్ సేవలను(అజూర్, ఆఫీస్ 365 ఇతరత్రా) వీటిద్వారా అందిస్తామని సత్య వెల్లడించారు. మంగళవారమిక్కడ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను తెలిపారు. సీఈఓగా భారత్‌కు తొలిసారి వచ్చిన సత్య... హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఉద్యోగులకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. భవిష్యత్తు అంతా క్లౌడ్ టెక్నాలజీదేనని.. దీనికి అప్‌గ్రేడ్ కావాలని కూడా ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.



 గతేడాది 100 శాతం వ్యాపార వృద్ధి...

 గతేడాది భారత్‌లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ బిజినెస్ 100 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నట్లు చెప్పారు. ఈ విజయ ప్రస్థానంతో స్థానిక డేటా సెంటర్లనుంచే క్లౌడ్ సేవలను అందించాలని నిర్ణయించినట్లు సత్య వివరించారు. స్థానిక డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రపంచస్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నెలకొల్పడంతోపాటు ఉత్పాదకతను పెంచేందుకు... దేశీయంగా సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడుతుందన్నారు.



‘25 కోట్ల మందికిపైగా భారతీయులు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న మొబైల్స్ ఇతరత్రా డివెజైస్‌ను ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ క్లౌడ్ టెక్నాలజీతో ముడిపడినవే. భవిష్యత్తులో క్లౌడ్ లేని మొబైల్స్‌ను ఊహించలేం. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలకు ఇంత భారీ డిమాండ్, అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాదు దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ఎంట్రప్రెన్యూర్స్ కూడా క్లౌడ్ మార్కెట్‌కు వరంగా మారుతున్నారు. ఇప్పటికే 10,000 మందికిపైగా పార్ట్‌నర్స్ మైక్రోసాఫ్ట్‌కు ఉన్నారు. ఈ సంఖ్యను మరింత పెంచుకుంటాం’ అని సత్య పేర్కొన్నారు. ఎంతమేర పెట్టుబడులను పెట్టనున్నారనేది నిర్దిష్టంగా వెల్లచడించలేదు. అయితే, తొలి అడుగులే అయినప్పటికీ అత్యున్నతస్థాయిలో ఉంటాయని సత్య చెప్పడం గమనార్హం.



 మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రతిష్టాత్మక డిజిటల్ ఇండియా కార్యక్రమం విజయవంతానికి తాము నెలకొల్పబోయే స్థానిక క్లౌడ్ డేటా సెంటర్లు దోహదపడతాయని మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ చెప్పారు. ఈ-గవర్నెన్స్, అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్), విద్య, ఆరోగ్యసంరక్షణ వంటి రంగాల్లో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top