టెక్నాలజీలో భారత్ జిగేల్

టెక్నాలజీలో భారత్ జిగేల్ - Sakshi


ప్రపంచవ్యాప్తంగా నవకల్పనల్లో మన ఎంట్రప్రెన్యూర్స్, డెవలపర్లదే కీలక పాత్ర

వాళ్లకు సరైన వేదికను మైక్రోసాఫ్ట్ కల్పిస్తుంది..  

కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల


న్యూఢిల్లీ: భారతీయ డెవలపర్లు, ఎంట్రప్రెన్యూర్స్ అద్భుతాలను సృష్టిస్తున్నారని... నవకల్పనల్లో ప్రపంచవ్యాప్తంగా కీలకపాత్ర పోషిస్తున్నారంటూ మైక్రోసాఫ్ట్ ఇండియా సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. వీళ్లందరికీ సరైన వేదికను కల్పించడంలో మైక్రోసాఫ్ట్ ముందుంటుందని చెప్పారు. ఒక్కరోజు భారత్ పర్యటనలో భాగంగా సోమవారమిక్కడ మైక్రోసాఫ్ట్ ‘టెక్ ఫర్ గుడ్, ఐడియాస్ ఫర్ ఇండియా’ పేరుతో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. అదేవిధంగా ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిశారు. ‘ఇంతమంది విభిన్నమైన అభ్యాస డెవలపర్లు, ఎంట్రప్రెన్యూర్లు, కళాకారులనే కాకుండా భారత్‌తోపాటు మొత్తం ప్రపంచ టెక్నాలజీ రూపురేఖలనే మార్చేస్తున్న ఈ-కామర్స్ రంగ దిగ్గజాలను కలుసుకోవడం నాలో కొత్త స్ఫూర్తిని నింపుతోంది.


ఈ విజయాల్లో మా (మైక్రోసాఫ్ట్) ప్లాట్‌ఫామ్ కూడా భాగస్వామ్యం కావడాన్ని గర్వకారణంగా భావిస్తున్నా. ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి, సంస్థను మరింత ఉన్నతంగా, శక్తిమంతంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. మరీ ముఖ్యంగా టెక్నాలజీతో భారత్‌లోని ప్రతిఒక్కరి శక్తిసామర్థ్యాలను తేజోవంతం చేయడంపై దృష్టిపెట్టాం. తద్వారా ప్రజలు తమ జీవనగమనంలో ఉన్నతస్థానాలను అందుకోవడంతోపాటు దేశాభివృద్ధికి కూడా తోడ్పడతారు. మేం అభివృద్ధిచేసిన టెక్నాలజీ కంటే... ఇప్పుడు భారత్‌లో మీరంతా సృష్టిస్తున్న అద్భుతాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. రానున్నకాలంలో ఈ జోరును మరింత పెంచేందుకు మైక్రోసాఫ్ట్ తగిన వేదికను కల్పిస్తుంది’ అని నాదెళ్ల వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా కూడా పాల్గొన్నారు. భారత్ వృద్ధి పథానికి టెక్నాలజీ వెన్నుదన్నుగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.


 గాలిబ్ కవితలు కూడా...

సత్య తన ప్రసంగంలో విఖ్యాత మీర్జా గాలిబ్ కవితలను కూడా ప్రస్తావించడం గమనార్హం. కలలు, ఆకాంక్షలను సాకారం చేసుకోవడం గురించి ఉద్దేశిస్తూ గాలిబ్ కవితల్లోని కొన్ని వాక్యాలను ఉటంకించారు. ‘కలలను సాకారం చేసుకోవడమే కాదు... అద్భుతాలను ఆవిష్కరించగలిగే కలలకోసం పరితపించడం కూడా చాలా ముఖ్యం. మనలో అనునిత్యం స్ఫూర్తిని నింపేది కూడా ఇదే’ అంటూ సత్య యువత, సభికులను ఉత్తేజపరిచారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులపై వ్యాఖ్యానిస్తూ... ప్రపంచాన్ని మనం చూసే దృక్కోణంలో మార్పుగనుక వస్తే.. ఇప్పుడున్న ప్రపంచాన్ని మార్చగలిగే సత్తా కచ్చితంగా ఉన్నట్టేనని సత్య పేర్కొన్నారు.


 భారత్‌కు మూడోసారి...

మైక్రోసాఫ్ట్ సీఈఓగా 2014 ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత సత్య నాదెళ్ల భారత్‌కు రావడం ఇది మూడోసారి. గతేడాది డిసెంబర్‌లో ముంబైతోపాటు హైదరాబాద్‌లోని టీ-హబ్‌ను కూడా సత్య సందర్శించారు.  కాగా, సోమవారం భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహించిన కార్యక్రమానికి నాదెళ్ల  హాజరయ్యారు. ఇంటెల్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్-దక్షిణాసియా) దేవ్‌జానీ ఘోష్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ చైర్మన్ రవి పార్థసారథి, విప్రో ప్రెసిడెంట్-సీఓఓ భానుమూర్తి బీఎం, ఎన్‌ఐఐటీ సీఈఓ రాహుల్ పత్వార్ధాన్ తదితరులు దీనిలో పాల్గొన్నారు.



ప్రధాని మోదీతో భేటీ...

భారత్ పర్యటనలో భాగంగా సత్య నాదెళ్ల సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం, ఐటీ రంగానికి సంబంధించి మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడం గురించి ఆయన ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం. అంతకుముందు నాదెళ్ల టెలికం, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాతో కూడా సమావేశం అయ్యారు. ‘ఐటీ రంగానికి సంబంధించిన పలు అంశాలపై మేం మాట్లాడుకున్నాం’ అని భేటీ అనంతరం మోదీ ట్వీట్ చేశారు.


అయితే, ప్రభుత్వ రంగంలో క్లౌడ్ సేవల ఉపయోగం, స్కైప్‌తో ఆధార్ అనుసంధానం వంటివి మోదీతో సమావేశంలో నాదెళ్ల చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటేవలే భారత్‌కు తొలిసారి రావడం, మోదీతో సమావేశం కావడం తెలిసిందే. కాగా, ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా తదితర కార్యక్రమాలకు చేయూతనందిస్తాంటూ మైక్రోసాఫ్ట్, యాపిల్‌లు ఇప్పటికే ముందుకొచ్చాయి కూడా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top