3 కంపెనీలుగా మ్యాక్స్ ఇండియా

3 కంపెనీలుగా మ్యాక్స్ ఇండియా


న్యూఢిల్లీ: పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా వ్యాపార దిగ్గజం మ్యాక్స్ ఇండియాను మూడు వేర్వేరు కంపెనీలుగా విభజించేందుకు సంస్థ బోర్డు మంగళవారం ఆమోదముద్ర వేసింది.  విభజన తర్వాత మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (జీవిత బీమా వ్యాపారం కోసం), మ్యాక్స్ ఇండియా (హెల్త్‌కేర్ సంబంధ వ్యాపారాలకు), మ్యాక్స్ వెంచర్స్ అండ్ ఇండస్ట్రీస్-ఎంవీఐఎల్ (తయారీ కార్యకలాపాలకు) సంస్థలు ఏర్పడతాయి.



ఇక, క్లినికల్ రీసెర్చ్ వ్యాపారంలో వాటాలను కెనడా కంపెనీకి 1.5 మిలియన్ డాలర్లకు మ్యాక్స్ విక్రయించనుంది. కొత్తగా ఏర్పడే సంస్థలు కూడా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి. జీవిత బీమా, ఆరోగ్య బీమా జాయింట్ వెంచర్ సంస్థల్లో వాటాలు పెంచుకోవాలని విదేశీ భాగస్వామ్య కంపెనీలు మిత్సుయి, బూపా ఆసక్తిగా ఉన్నట్లు మ్యాక్స్ ఇండియా ప్రమోటరు అనల్జిత్ సింగ్ తెలిపారు. డీమెర్జర్ తర్వాత మ్యాక్స్ బూపా, మ్యాక్స్ హెల్త్‌కేర్ ఆస్పత్రులు .. మ్యాక్స్ ఇండియా కింద ఉంటాయి.



బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని ప్రభుత్వం ఇటీవలే పెంచిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. డీమెర్జర్‌కి సంబంధించి అధికారిక తేదీని ఏప్రిల్ 1గా నిర్ణయించారు. ప్రక్రియ మొత్తం ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పూర్తి కావొచ్చని అంచనా. రూ. 605 కోట్ల నగదు నిల్వలు: గతేడాది ఆఖరు నాటికి మ్యాక్స్ ఇండియా దగ్గర రూ. 605 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి.



ఇందులో మ్యాక్స్ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు రూ. 150 కోట్లు, ఎంవీఐఎల్‌కు రూ. 10 కోట్లు బదలాయించనుండగా మిగతా రూ. 400 కోట్లు కొత్తగా ఏర్పడే మ్యాక్స్ ఇండియా వద్ద ఉంటాయి. బీఎస్‌ఈలో కంపెనీ షేరు 8.40% పెరిగి రూ. 492.75 వద్ద ముగిశాయి. కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ. 1,017 కోట్లు ఎగిసి రూ. 13,131 కోట్లకు చేరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top