టాప్ గేర్‌లో మారుతీ..

టాప్ గేర్‌లో మారుతీ.. - Sakshi


- ఆగస్టులో జోరుగా కార్ల కంపెనీల దేశీయ అమ్మకాలు

- పండుగల సీజన్‌పై ఆశలు

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో వాహన అమ్మకాలు పుంజుకుంటున్నాయి. సెంటిమెంట్ మెరుగుపడడంతో మారుతీ సుజుకి, హోండా కార్స్, హ్యుందాయ్, నిస్సాన్, ఫోర్డ్ ఇండియా కార్ల కంపెనీల దేశీయ అమ్మకాలు ఈ ఏడాది ఆగస్టులో  మంచి వృద్ధిని సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, ఫోర్డ్ ఇండియా, జనరల్ మోటార్స్, తదితర కంపెనీల దేశీయ అమ్మకాలు మాత్రం క్షీణించాయి. మారుతీ సుజుకి కాంపాక్ట్ కార్లు(స్విఫ్ట్, ఎస్టిలో, సెలెరియో, రిట్జ్, డిజైర్ కార్ల) అమ్మకాలు 53 శాతం పెరగడం విశేషం. మొత్తం మీద మారుతీ దేశీయ అమ్మకాలు 27 శాతం పెరిగాయి.



గత నెలలో కూడా మారుతీ అమ్మకాలు మెరుగుపడ్డాయి.  హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు మాత్రం 19 శాతం పెరిగాయి. అయితే మొత్తం అమ్మకాల(దేశీయ విక్రయాలు, ఎగుమతులు కలిపి)  విషయంలో ఆగస్టు నెల వివిధ కంపెనీలకు మిశ్రమ ఫలితాలనిచ్చింది. ఇక టూవీలర్ల అమ్మకాలు  జోరుగానే ఉన్నాయి. హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్, హోండా, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలన్నీ విక్రయాల్లో 20 శాతానికి మించి వృద్ధి సాధించాయి.

 

పండుగ సీజన్‌లో మరింత జోరుగా

ఆర్థిక పరిస్థితులు క్రమక్రమంగా పుంజుకుంటున్నాయని, ఈ ప్రభావం వాహనాల కొనుగోళ్లపై ఉంటోందని నిపుణులంటున్నారు. మొత్తం వార్షిక అమ్మకాల్లో 30-35 శాతం వాటా ఉండే పండుగల సీజన్‌లో (దసరా, దీపావళి) డిమాండ్ పెరిగి వాహన విక్రయాలు జోరుగా ఉంటాయని కంపెనీలు ఆశిస్తున్నాయి. పెట్రోల్ కార్లకు డిమాండ్ పెరుగుతుండడం, కొత్త మోడళ్లు, మెరుగుపడుతున్న వినియోగదారుల సెంటిమెంట్ తదితర అంశాల కారణంగా  పండుగల సీజన్ సందర్భంగా అమ్మకాలు బాగుంటాయనే ఆశాభావాన్ని వివిధ కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి.  



తయారీ రంగం కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని దీంతో వాహన మార్కెట్లో వ్యాపార విశ్వాసం మెరుగైందని మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా వ్యాఖ్యానించారు. పండుగల సీజన్‌లో అమ్మకాలు పుంజుకోగలవని పేర్కొన్నారు.  పండుగల  సీజన్ సందర్భంగా కొత్త మోడళ్లను, అప్‌గ్రేడ్ వేరియంట్‌లను మొత్తం 10 కొత్త ఉత్పత్తులను అందించనున్నామని  హీరో మోటోకార్ప్ పేర్కొంది.

 

ఇతర ముఖ్యాంశాలు...

ఐషర్ మోటార్స్ దేశీయ అమ్మకాలు 66% పెరి గాయి. ఎగుమతులు 47% వృద్ధి చెందాయి.

•  మారుతీ సుజుకి దేశీయ అమ్మకాలు 27 శాతం, ఎగుమతులు 10 శాతం చొప్పున పెరిగాయి.

•  హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు 19% పెరగ్గా, ఎగుమతులు 40% తగ్గాయి. ఎలైట్ ఐ20, ఎక్సెంట్, గ్రాండ్ వంటి కొత్త కార్లకు మంచి స్పందన లభిస్తోందని కంపెనీ పేర్కొంది.

•  మహీంద్రా దేశీయ అమ్మకాలు 7% తగ్గాయి.

•  టయోటా    దేశీయ అమ్మకాలు 7 శాతం తగ్గాయి.

•  నెలా నెలా తమ అమ్మకాలు పెరుగుతున్నాయని హోండా కార్స్ ఇండియా పేర్కొంది. రానున్న నెలల్లో అమ్మకాల్లో మరింత వృద్ధిని సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top