28,500పైన అప్‌ట్రెండ్ కొనసాగింపు


మార్కెట్ పంచాంగం

 

రెండు వారాల పాటు గరిష్టస్థాయిలో ఒక చిన్న శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్న భారత్ సూచీలు బ్యాంకింగ్ షేర్ల సహకారంతో గత శుక్రవారం రికార్డుస్థాయి వద్ద ముగిసాయి. ఎస్‌బీఐ ఫలితాలతో బుల్లిష్‌గా మారిన బ్యాంకింగ్ బుల్స్... కొటక్ మహీంద్రా బ్యాంక్-ఐఎన్‌జీ వైశ్యా విలీన ప్రకటనతో బ్యాంకు షేర్లను పరుగులు పెట్టించారు. డాలరుతో రూపాయి మారకపు విలువ 62 స్థాయికి పడిపోయినా, స్టాక్ సూచీలు పెద్ద ర్యాలీ జరపడం విశేషం. రూపాయి క్షీణత కూడా ఇన్వెస్టర్లకు షాక్‌నివ్వలేదంటే, మార్కెట్ అప్‌ట్రెండ్‌కు ఇప్పట్లో స్పీడ్‌బ్రేకర్ లేనట్లే.



సెన్సెక్స్ సాంకేతికాంశాలు...



నవంబర్ 21తో ముగిసిన వారంలో కొత్త రికార్డుస్థాయి 28,360 పాయింట్ల వరకూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్  చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 288  పాయింట్ల లాభంతో 28,335 వద్ద ముగిసింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్ల ర్యాలీ జరిపిన ప్రభావంతో ఈ సోమవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమైతే  28,500 స్థాయిని అందుకోవచ్చు. అటుపైన స్థిరపడితే 28,650 వద్దకు ర్యాలీ జరపవచ్చు. ఈ స్థాయిని నిలబెట్టుకుంటే క్రమేపీ 28,800-28,900 శ్రేణికి చేరవచ్చు. ఈ సోమవారం 28,500 స్థాయిని అధిగమించలేకపోతే 28,280 వద్ద సెన్సెక్స్‌కు తక్షణ మద్దతు లభించవచ్చు. ఆ లోపున 28,000 స్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున ముగిస్తే క్రమేపీ 27,700-27,800 శ్రేణి వద్దకు తగ్గవచ్చు. గత రెండు వారాల నుంచి ఈ మద్దతు సహకరాంతో పలుదఫాలు సూచీ బౌన్స్ అయినందున, ఈ మద్దతు శ్రేణి సెన్సెక్స్‌కు ముఖ్యమైనది.



నిఫ్టీ మద్దతు 8,400-నిరోధం 8,550



ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  8,490 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపి, చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 87 పాయింట్ల లాభంతో 8,477 పాయింట్ల వద్ద ముగిసింది.  ఈ వారం నిఫ్టీ గ్యాప్‌అప్‌తో 8,500పైన ప్రారంభమైతే 8,550 స్థాయివరకూ పెరగవచ్చు. గ్యాప్‌అప్‌స్థాయిపైన స్థిరపడలేకపోతే 8,400 వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును ముగింపులో కోల్పోతే  8,360 స్థాయి వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని బ్రేక్‌చేయడం ద్వారా కొత్త గరిష్టస్థాయికి చేరినందున, సమీప భవిష్యత్తులో 8,360 మద్దతు కీలకం. ఆ లోపున ముగిస్తే  రెండు వారాల నుంచి మద్దతు కల్పిస్తున్న 8,290-8,320 పాయింట్ల శ్రేణి వద్దకు క్షీణించవచ్చు. ఈ వారం 8,500-8,550 శ్రేణిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో బ్రేక్‌చేస్తే 8,650-8,700 శ్రేణి వద్దకు పెరగవచ్చు. డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా 8,400 స్ట్రయిక్ వద్ద 66 లక్షల షేర్లతో అత్యధిక పుట్ ఆప్షన్ బిల్డప్, 8,500 స్ట్రయిక్ వద్ద 54 లక్షల షేర్లతో గరిష్టమైన కాల్ ఆప్షన్ బిల్డప్ జరిగింది. ఈ వారం 8,400-8,500 శ్రేణిని నిఫ్టీ ఎటువైపు ఛేదిస్తే, ఆవైపుగా సూచీ వేగంగా ప్రయాణించవచ్చని ఆప్షన్ బిల్డప్ సూచిస్తున్నది.

 

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top