రూ.200 కోట్లతో ఓక్‌వుడ్ హోటల్!

రూ.200 కోట్లతో ఓక్‌వుడ్ హోటల్! - Sakshi


శంషాబాద్‌లో ఏర్పాటు; వచ్చే ఏడాది పనులు షురూ...

- రెండేళ్లలో దేశంలో మరో 4 ప్రాజెక్ట్‌లు

- ఓక్‌వుడ్  డెరైక్టర్ మిచెల్ ప్రైజ్

- లగ్జరీ సర్వీస్ అపార్ట్‌మెంట్ ప్రారంభం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
సర్వీస్ అపార్ట్‌మెంట్లు, కార్పొరేట్ హౌసింగ్ రంగంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఓక్‌వుడ్.. హైదరాబాద్‌లో తన తొలి ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. లాస్ ఏంజిల్స్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఓక్‌వుడ్... రాష్ట్రానికి చెందిన కపిల్ గ్రూప్‌తో కలిసి ఐటీ హబ్‌గా పేరొందిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ‘ఓక్‌వుడ్ రెసిడెన్సీ కపిల్ హైదరాబాద్’ పేరిట సర్వీస్ అపార్ట్‌మెంట్‌ను మంగళవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఓక్‌వుడ్ దక్షిణ, ఆగ్నేయాసియా డెరైక్టర్ మిచెల్ ప్రైజ్ విలేకరులతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే...



- హైదరాబాద్‌కొచ్చే అంతర్జాతీయ విమానాలు చాలా వరకు రాత్రిళ్లే ఇక్కడికి చేరుకుంటాయి. ఆ సమయంలో లగ్జరీ సదుపాయాలతో పాటు భద్రత కలిగిన అపార్ట్‌మెంట్ దొరకడం కష్టం. ఒకవేళ ఉన్నా బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, హిమాయత్‌నగర్ వంటి ప్రాంతాల్లోకి వెళ్లాలి. అంటే సిటీలోకి వెళ్లాలి. మళ్లీ ఉదయం మీటింగ్‌లకు వెళ్లాలంటే ట్రాఫిక్ సమస్య. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపించేదే ‘ఓక్‌వుడ్ రెసిడెన్సీ కపిల్ హైదరాబాద్’. వెస్ట్రన్ స్టయిల్ కిచెన్స్, టీవీ, ఏసీ, స్విమ్మింగ్ పూల్, జిమ్, లాంజ్, బార్ అండ్ రెస్టారెంట్ వంటి 7 స్టార్ హోటల్స్‌లో ఉండే ప్రతి ఒక్క ఆధునిక వసతులూ ఇందులో పొందవచ్చు.



- ఇందులో మొత్తం 158 లగ్జరీ రెసిడెన్సీ యూనిట్లుంటాయి.  యూనిట్ల విస్తీర్ణాలు 380 చదరపు అడుగుల నుంచి 1,069 చదరపు అడుగుల వరకూ ఉన్నాయి. ఇక ఒక రాత్రి బస చేయడానికి రూ.5వేల నుంచి 18 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. గ్రేడ్-ఏ కస్టమర్లకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రాజెక్ట్ ఇది. ఇప్పటివరకు ఓక్‌వుడ్ సంస్థ దేశంలో బెంగళూరు, ముంబై, పుణె నగరాల్లో 5 ప్రాజెక్ట్‌లను నిర్మించింది. హైదరాబాద్‌లోని ప్రాజెక్ట్ 6వది. ఆసియాలో 28వ ప్రాజెక్ట్.



- రూ.200 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో శంషాబాద్‌లో ఓక్‌వుడ్ కపిల్ అంతర్జాతీయ హోటల్‌ను నిర్మించనున్నాం. ఇప్పటికే స్థల సేకరణ పూర్తయింది. వచ్చే ఏడాది నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. రెండేళ్లలో దేశంలో మరో 4 ప్రాజెక్ట్‌లు నిర్మిస్తాం. అయితే వీటిని ఇప్పటికే ఉన్న నగరాల్లో కాకుండా.. ఢిల్లీ, గుర్గావ్, చెన్నై నగరాల్లో నిర్మిస్తాం. 2017లో ముంబైలో మరో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తాం.



- ఇప్పటివరకు ప్రీమియర్, రెసిడెన్సీ, అపార్ట్‌మెంట్ అనే మూడు రకాల బ్రాండ్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాం. కానీ, 2016లో కొత్తగా మరో బ్రాండ్‌తో కొనుగోలుదారుల ముందుకురానున్నాం. ఈ తొలి ప్రాజెక్ట్‌ను సింగపూర్‌లో నిర్మించనున్నాం. త్వరలో ఇండియాలో కూడా కొత్త బ్రాండ్‌తో ప్రాజెక్ట్‌లను నిర్మిస్తాం.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top