టీసీఎస్‌ను కాపాడండి, ఉద్యోగుల ఆందోళన






లక్నోలోని టీసీఎస్‌ ఆఫీసు మూసివేతపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. లక్నో ఆఫీసు మూతను వ్యతిరేకిస్తూ ఆ కంపెనీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా లక్నో ప్రాంత ప్రజలు, టీసీఎస్‌ ఉద్యోగుల కుటుంబసభ్యులు రివర్‌ఫోర్ట్‌ వద్ద మార్చ్‌ నిర్వహించారు. 'సేవ్‌ టీసీఎస్‌' అనే ఫ్లకార్డులతో చిన్నపిల్లలు, పెద్దలు, యువత అందరూ ఈ మార్చ్‌లో పాలుపంచుకున్నారు. 2000 మందికి పైగా ఉన్న ఉద్యోగులను ఇతర సెంటర్లకు తరలించడంతో, ఐటీ సెక్టార్‌లో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుందని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తుందని వారు పేర్కొన్నారు.



గత 33 ఏళ్లుగా కంపెనీకి లక్నో ఎంతో ప్రేమను అందిస్తుందని, కానీ హఠాత్తుగా ఈ ఆఫీసును మూసివేసి, వేరే ప్రాంతాలకు ఉద్యోగులను తరలిస్తామనడం తమకు ఆశ్చర్యానికి గురిచేసిందని స్థానికులు చెబుతున్నారు. లక్నో ఐటీ హబ్‌గా మారిన క్రమంలో కంపెనీ ఈ నగరాన్ని విడిచిపెట్టి వెళ్తుందని తెలిపారు. ఒక్కసారి టీసీఎస్‌ లక్నో నుంచి వెళ్లిపోతే, మిగతా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కూడా ఇక్కడ తమ ఆఫీసులు ప్రారంభించడానికి వెనుకంజ వేస్తాయని ఓ స్థానికుడు చెప్పాడు. అప్పుడు స్థానిక ఐటీ ప్రతిభకు ఎలాంటి ఆప్షన్‌ ఉండదని ఆవేదన వ్యక్తంచేశాడు.

 

నగరానికి చెందిన ఎన్‌జీవో గోమతి కనెక్ట్ కూడా టీసీఎస్‌ ఉద్యోగులకు మద్దతుగా నిలిచింది. ఇటు టీసీఎస్‌ సమస్య ఒక్క ఐటీ రంగానికే కాక, ఇటు రాజకీయంగా తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. రాష్ట్రప్రభుత్వానికి ముఖ్యంగా స్థానిక ఎంపీ రాజ్‌నాథ్‌ సింగ్‌కు  ఇది అతిపెద్ద సమస్య అని తెలుస్తోంది. రాజ్‌నాథ్‌ సింగ్‌ లక్నో నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రిపోర్టుల ప్రకారం, మంత్రి ఈ విషయంపై ఇప్పటికే రిపోర్టును కోరినట్టు తెలిసింది. రాష్ట్రప్రభుత్వం కూడా టీసీఎస్‌ను వెళ్లనివ్వమని చెబుతోంది. ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగిఆదిత్యానాథ్‌  కొత్త పారిశ్రామిక పాలసీ ప్రకటించిన తర్వాతే టీసీఎస్‌ను లక్నో నుంచి తరలిస్తున్నట్టు రిపోర్టులు వచ్చాయి. కాగ, లక్నో ఆఫీసును మూసివేస్తున్నామని ప్రకటించిన టీసీఎస్‌, ఆ సెంటర్‌ ఉద్యోగులను దేశంలోని ఇతర సెంటర్లకు, నోయిడాకు తరలించనున్నట్టు చెప్పింది. నోయిడాలోని తమ కార్యకలాపాలను సంఘటితం చేయడానికే లక్నో ఆఫీసును మూసివేస్తున్నామని టీసీఎస్‌ పేర్కొంది.
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top