అత్యవసర నిధి కోసం లిక్విడ్ ఫండ్స్..?

అత్యవసర నిధి కోసం లిక్విడ్ ఫండ్స్..?


మిరా అసెట్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్‌లో డెరైక్ట్ ప్లాన్‌లో డివిడెండ్ పేఅవుట్ ఆప్షన్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఈ ప్లాన్‌కు సంబంధించి డెరైక్ట్, రెగ్యులర్ ప్లాన్‌ల ఎన్‌ఏవీల మధ్య రూ. 4 తేడా ఉంది. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎన్‌ఏవీ అధికంగా ఉండటంతో నాకు యూనిట్లు తక్కువగా వచ్చాయి. డెరైక్ట్ ప్లాన్, రెగ్యులర్ ప్లాన్‌లలో ఏది ఇన్వెస్టర్లకు మంచిదో వివరించండి?

- కుమార్, మంగళగిరి



ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎన్‌ఏవీ అధికంగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ ప్లాన్‌తో పోల్చితే డెరైక్ట్ ప్లాన్ రాబడులు అధికంగా ఉన్నాయా లేదా అన్నది అసలు విషయం. ఏ ఇతర ప్లాన్‌లతో పోల్చినా కూడా డెరైక్ట్ ప్లాన్ ద్వారా వచ్చే రాబడి అధికంగా ఉంటాయి. వ్యయాలు తక్కువగా ఉండటమే దీనికి కారణం.



మ్యూచువల్ ఫండ్స్‌ను విక్రయించే దళారీలకు చెల్లించే కమిషన్, ఇతర ఖర్చులు డెరైక్ట్ ప్లాన్‌లలో ఉండవు. ఇలా ఆదా అయిన వ్యయాలను సదరు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇన్వెస్టర్లకే అందిస్తాయి. అందుకే ఈ డెరైక్ట్ ప్లాన్‌ల ఎన్‌ఏవీ, రాబడులు అధికంగా ఉంటాయి.  ఏ ఫండ్‌ను కొనుగోలు చేయాలో అన్న విషయంపై మీకు పూర్తి స్థాయిలో స్పష్టత ఉన్నప్పుడే మీరు డెరైక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌చేయడం మంచిది. ఇలా కాని పక్షంలో రెగ్యులర్ ప్లాన్‌లో ఇన్వెస్ట్  చేయడం ఉత్తమం. డెరైక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రాబడులు అధికంగా వస్తాయనేది కాదనలేని సత్యం. అయితే ఈ డెరైక్ట్ ప్లాన్‌ను ఎంచుకునేందుకు బాగా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది.



ఏడాది క్రితం నేనొక ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఇప్పడు ఈ ఫండ్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్)లో సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ)లోకి మళ్లిద్దామనుకుంటున్నాను.  సెక్షన్ 80సీ కింద నాకు ఏమైనా పన్ను రాయితీలు లభిస్తాయా?            

- మల్లిక, హైదరాబాద్

 

ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మళ్లించడాన్ని -ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని మరో ఫండ్‌లో కొత్తగా ఇన్వెస్ట్‌చేయడంగా పరిగణిస్తారు. ఈక్విటీ ఫండ్ నుంచి ఏడాది కాలంలోపు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మళ్లిస్తే మీరు షార్ట్‌టెర్మ్‌క్యాపిటల్ గెయిన్స్ పన్ను, ఏడాది దాటిన తర్వాత అయితే లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈక్విటీ ఫండ్స్‌పై ఏడాది దాటితే ఎలాంటి లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌చెల్లించాల్సిన అవసరం లేదు.



ఇక మీ విషయానికొస్తే, మీ ఈక్విటీ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఏడాది పూర్తయినందున మీరు ఎలాంటి లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ చెల్లించాల్సిన పని లేదు. ఇక ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు సెక్షన్ 80 సీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌చేసిన తేదీ నుంచి  లాకిన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. మీరు ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఎస్‌టీపీ విధానంలో మళ్లించిన ప్రతీ ఇన్‌స్టాల్‌మెంట్‌కు అప్పటి నుంచి మూడేళ్ల లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది.



నా నెలజీతానికి ఆరురెట్లు మొత్తాన్ని అత్యవసర నిధి కింద ఏర్పాటు చేయాలని భావిస్తున్నాను. నేను 30 శాతం పన్ను పరిధిలోకి వస్తాను. మిత్రులు లిక్విడ్  మ్యూచువల్  ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమని చెబుతున్నారు. ఈ అత్యవసర నిధి ఇన్వెస్ట్‌మెంట్స్ సురక్షితంగా ఉండాలి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకునేలా ఉండాలి. మరోవైపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే అదనపు వడ్డీని అందించగలగాలి. తగిన సలహా ఇవ్వండి.  

- అబ్రహాం, గుంటూరు

 

అత్యవసర నిధి కోసం ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. తక్కువ రిస్క్, ఎక్కువ లిక్విడిటీ...వాటిల్లో కొన్ని. అత్యవసర నిధి కోసం ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది లిక్విడ్ ఫండ్స్‌ను ఎంచుకుంటారు. 91 రోజుల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూరిటీ అయ్యే సెక్యూరిటీల్లో ఈ లిక్విడ్‌మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. మనీ మార్కెట్ ఇన్ స్ట్రుమెంట్స్, స్వల్ప కాలిక కార్పొరేట్‌డిపాజిట్లు, ట్రెజరీ సాధనాల్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. 



ఈ ఫండ్స్‌ల్లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే ఆ మొత్తం ఇతర మ్యూచువల్ ఫండ్‌ల్లా కాకుండా ఒక బిజినెస్ డేలోనే మీ చేతికి అందుతాయి. తక్కువ రిస్క్, అధిక లిక్విడిటీ కారణంగా అత్యవసర నిధి కోసం వీటికి ప్రాధాన్యత ఇస్తారు. వీటిపై వడ్డీ 6-8 శాతం వరకూ వస్తుంది. అయితే మీరు మీ అత్యవసర నిధి ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తాన్ని కొంత నగదుగా మీ దగ్గర, కొంత సేవింగ్స్‌బ్యాంక్ అకౌంట్‌లోనూ, మిగిలినది లిక్విడ్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేయడం సమంజసంగా ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top