ఎక్కువ ఆస్తులు ఉన్న ఫండ్స్‌ను ఎంచుకోవాలా?

ఎక్కువ ఆస్తులు ఉన్న ఫండ్స్‌ను ఎంచుకోవాలా?


నా వయసు 52 సంవత్సరాలు. ఎల్‌ఐసీ జీవన్‌  అక్షయ్‌ పాలసీలో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. వడ్డీరేట్లు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సరైన నిర్ణయమేనా ? వివరించండి.

–చంద్ర శేఖర్, విజయవాడ



ఎల్‌ఐసీ జీవన్‌ అక్షయ్‌ సిక్స్‌ ప్లాన్‌.. ఇమ్మీడియేట్‌ యాన్యుటీ ప్లాన్‌. ఈ ప్లాన్‌లో మీరు ఒక్కసారే ప్రీమియమ్‌ చెల్లిస్తే, మీరు జీవించి ఉన్నంత కాలం మీకు నెలవారీ లేదా మూడు నెలలకొకసారి లేదా ఆరు నెలలకొకసారి లేదా ఏడాదికొకసారి నిర్దేశిత మొత్తం అందుతుంది. చివర్లో మీరు చెల్లించిన ప్రీమియమ్‌ కూడా అందుకునే ఆప్షన్‌ కూడా ఉంది. అయితే ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే మీరు పొందే నెలవారీ/మూడు నెలలకొకసారి/ఆరు నెలలకొకసారి/ఏడాదికొకసారి పొందే నిర్దేశిత మొత్తం తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో ఎంత మొత్తం ఇన్వెస్ట్‌ చేయాలనే దానిపై గరిష్ట పరిమితి ఏమీ లేదు. ఈ యాన్యుటీ ప్లాన్‌ మీకు క్రమం తప్పని గ్యారంటీ ఆదాయాన్నిస్తుంది కానీ, ఇవి ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను ఇవ్వలేవు.  ఇలాంటి సాంప్రదాయ యాన్యుటీ ప్లాన్‌లను వదిలివేయడమే మంచిది. ఈ ప్లాన్‌ కంటే కూడా సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్, పోస్ట్‌ ఆఫీస్‌  మంత్లీ స్కీమ్‌లు కొంత మెరుగైన రాబడులనిస్తాయి.



నేను టర్మ్‌ బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. ఎల్‌ఐసీ నుంచి రూ.50 లక్షలకు, మరో సంస్థ నుంచి రూ. కోటికి టర్మ్‌ బీమా పాలసీలు తీసుకోవాలనేది నా ప్లాన్‌. ఈ రెండింటిలో ఒకదానిని యాక్సిడెంటల్‌ డిజెబిలిటీ ఆప్షన్‌ ఉన్న టర్మ్‌ పాలసీని ఎంచుకోవాలనుకుంటున్నాను. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని నాకు తగిన సూచనలివ్వండి.

–పరమేశ్, విశాఖపట్టణం



భారీ మొత్తంలో టర్మ్‌ బీమా పాలసీ తీసుకోవాలనుకుంటే, ఈ పాలసీని ఒక్క సంస్థ నుంచి కాకుండా రెండు బీమా సంస్థల నుంచి తీసుకోవడం మంచి పని. పర్మనెంట్, పార్షియల్‌ డిజెబిలిటీ రైడర్లు ఉన్న టర్మ్‌ పాలసీ తీసుకుంటే, దురదృష్టవశాత్తూ ఏదైనా యాక్సిడెంట్‌ కారణంగా మీరు సంపాదించలేని స్థితికి చేరుకున్నారనుకోండి.  5–10 ఏళ్ల పాటు మీరు బీమా చేసిన మొత్తంలో  కొంత శాతం మీకు అందుతుంది. యాక్సిడెంట్‌ కారణంగానే మీరు సంపాదించలేని స్థితిని చేరుకుంటేనే ఈ రైడర్‌ పనిచేస్తుందని గుర్తుంచుకోండి. ఈ రైడర్స్‌ను ఎంచుకునేటప్పుడు పాలసీ డాక్యుమెంట్‌ను క్షుణ్నంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. మీ వ్యక్తిగత అవసరాలను బట్టి పాలసీలను, రైడర్లను ఎంచుకోవాలి. ఇక ఏ సంస్థ నుంచి పాలసీ తీసుకోవాలి అనే విషయానికొస్తే, క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ నిష్పత్తి, చెల్లించాల్సిన ప్రీమియమ్‌లను పరిగణనలోకి తీసుకోవాలి. ఇతర ప్రైవేట్‌ బీమా సంస్థల ప్రీమియమ్‌లతో పోల్చితే ఎల్‌ఐసీ టర్మ్‌ ప్లాన్‌ ప్రీమియమ్‌ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ రేషియోను, చెల్లించాల్సిన ప్రీమియమ్‌లను పరిగణనలోకి తీసుకుంటే, దిగువ పేర్కొన్న సంస్థల టర్మ్‌ బీమా పాలసీలను పరిశీలించవచ్చు. ఏగాన్‌ రెలిగేర్‌ ఐటర్మ్‌ ప్లాన్, మ్యాక్స్‌ లైఫ్‌ ఆన్‌లైన్‌ టర్మ్‌ ప్లాన్,, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌క్లిక్‌2 ప్రొటెక్ట్‌ ప్లాన్‌... ఈ ప్లాన్‌లను ఆన్‌లైన్‌ ద్వారా తీసుకోవచ్చు. ఈ ప్లాన్‌లన్నింటిని ప్రీమియమ్‌లను పరిశీలించి, మీ బడ్జెట్‌కు సరిపోయే ప్లాన్‌ను ఎంచుకోండి. ఈ ప్లాన్‌ల దరఖాస్తులను నింపేటప్పుడు అన్ని వివరాలు సమగ్రంగా ఇవ్వండి. క్లెయిమ్‌ చేసుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు.



నేను మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. రూ.10,000 కోట్ల నిర్వహణ ఆస్తులు(అసెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌–ఏయూఎమ్‌)ఉన్న  మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిదని మిత్రులు సలహా ఇస్తున్నారు. మీరేమంటారు ?

–జాన్సన్, హైదరాబాద్‌



మీ మిత్రులు ఇచ్చిన సలహా సరైనదే. అధిక మొత్తం నిర్వహణ ఆస్తులు ఉన్న మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల చాలా సందర్భాల్లో మంచి ప్రయోజనాలే లభిస్తాయి. మీరు లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నారనుకోండి, లిక్విడిటీ కూడా బాగా ఉన్న ఫండ్స్‌ను ఎంచుకోవాలి. అదే లిక్విడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నారనుకోండి. నిర్వహణ ఆస్తులు అధికంగా ఉన్న పెద్ద ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేయాలి. ఈ లార్జ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మీకు చార్జీల భారం తక్కువగా ఉంటుంది. మరోవైపు ఏదైనా అవాంతరాలు వచ్చినప్పుడు ఈ లార్జ్‌ ఫండ్స్‌కు తట్టుకునే సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఒక్కోసారి ఫండ్స్‌ ఆస్తుల విలువ పెరుగుతున్న కొద్దీ అది నిష్ప్రయోజనమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. స్మాల్, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ ఆస్తులు పెరిగితే అది ఆయా ఫండ్స్‌కు ఎలాంటి ప్రయోజనం కలిగించదు. అయితే మల్టీ, లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌ ఆస్తులు రూ.10,000–20,000 కోట్ల సైజ్‌కు చేరినా, ఆ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎలాంటి ఆందోళన లేకుండా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. కొన్ని ఫండ్స్‌ సైజ్‌తో సంబంధం లేకుండా మంచి పనితీరు కనబరచవచ్చు. మరోవైపు ఏదైనా ఫండ్‌ నుంచి పెద్ద ఇన్వెస్టర్‌ వైదొలిగితే.. అది చిన్న సైజు ఫండ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.అదే ఆస్తులు అధికంగా ఉన్న ఫండ్‌ అనుకోండి. ఈ ప్రభావం పెద్దగా ఉండదు. మీరు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఫండ్స్‌ ఆస్తులతో పాటు  ఆ ఫండ్‌ ట్రాక్‌ రికార్డ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోండి. మంచి ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకొని, ఆ ఫండ్స్‌లో సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి. ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాలం ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top