ఎల్‌ఐసీ పెట్టుబడుల ఆదాయం రూ.1.8 లక్షల కోట్లు

ఎల్‌ఐసీ పెట్టుబడుల ఆదాయం రూ.1.8 లక్షల కోట్లు


ముంబై: బీమా దిగ్గజం ఎల్‌ఐసీ పెట్టుబడులపై గణనీయమైన రాబడులను అందుకుంటోంది. 2016–17లో ఈ సంస్థకు పెట్టుబడులపై వచ్చిన ఆదాయం రూ.1,80,117 కోట్లు. సాధారణంగా పాలసీల ప్రీమియం రూపంలో వచ్చే ఆదాయాన్ని ఎల్‌ఐసీ దేశీయ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటుంది. ఫలితంగా ప్రభుత్వ బాండ్లు, రాష్ట్రాభివృద్ధికి ఇచ్చిన రుణాలపై వడ్డీ, కార్పొరేట్‌ బాండ్లపై వడ్డీ, డివిడెండ్, వాటాల విక్రయం రూపంలో గతేడాది ఈ స్థాయిలో భారీ ఆదాయాన్ని గడించింది.



ఎల్‌ఐసీ పెట్టుబడుల మార్కెట్‌ విలువ గత ఆర్థిక సంవత్సరంలో 17 శాతం వృద్ధితో రూ.24,69,589 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.21,09,253 కోట్లుగా ఉండడం గమనార్హం. ఇక 2016–17లో ఎల్‌ఐసీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీల్లో రూ.2.6 లక్షల కోట్లను ఇన్వెస్ట్‌ చేసింది. ఇదే ఏడాదిలో ఈక్విటీల్లో పెట్టుబడులు రూ.41,751 కోట్లుగా ఉన్నాయి. అదే సమయంలో ఈక్విటీల్లో వాటాల విక్రయంతో ఎల్‌ఐసీకి లభించిన లాభం రూ.19,302 కోట్లు. ఇక కార్పొరేట్‌ బాండ్లపై రూ.27,350 కోట్లను పెట్టుబడులుగా పెట్టింది. ‘‘భారీ స్థాయిలో పెట్టుబడులన్నవి నేర్పుగా చేయాల్సి ఉంటుంది.



ఆటుపోట్లతో కూడిన ఈక్విటీ, డెట్‌ మార్కెట్లో పెట్టుబడులకు రక్షణ కల్పిస్తూనే పాలసీదారులకు రాబడులను అందించడమన్నది అతిపెద్ద టాస్క్‌. దీన్ని ఎల్‌ఐసీ నిలకడగా నిర్వహిస్తూనే ఉంది’’ అని కంపెనీ వర్గాలు తెలిపాయి. కాగా, వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చని,  పెరిగే అవకాశం ఉందని ఎల్‌ఐసీ భావిస్తోంది. ఎన్‌పీఏల పరిష్కారానికి తీసుకున్న చర్యలు, సంస్కరణలు, మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి భారీగా తరలివస్తున్న నిధుల వల్ల ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లు మంచి పనితీరు కనబరుస్తాయన్న అంచనాతో ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top