‘ఫిక్స్‌డ్‌’ మైండ్‌ వదిలేయండి!

‘ఫిక్స్‌డ్‌’ మైండ్‌ వదిలేయండి!


ప్రస్తుత పరిస్థితుల్లో ఎఫ్‌డీలు పనికిరావు

పన్ను, ద్రవ్యోల్బణం పోగా మిగిలేది సున్నానే ఎఫ్‌డీ, ఆర్డీ, పొదుపు కోసమే తప్ప పెట్టుబడికి కాదు

దీర్ఘకాలిక లక్ష్యాలకు డెట్, ఈక్విటీ ఫండ్స్‌ ఉత్తమం  




సంప్రదాయంగా, కొన్ని దశాబ్దాలుగా ఎక్కువ మందికి పొదుపు, మదుపు సాధనంగా ఉంటూ వస్తున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ప్రస్తుతం కళతప్పాయ్‌! దీర్ఘకాల లక్ష్యాలకు, సంపద వృద్ధికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఇకపై ఎంత మాత్రం ఉత్తమ సాధనాలు కావన్నది ఆర్థిక పండితుల మాట. ఆర్థిక విధానాలు, మార్కెట్‌ తీరుతెన్నులు మారుతున్న తరుణంలో, ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ప్రస్తుతం పక్కన పెట్టేసి వాటికి మించి రాబడులనిచ్చే వాటిని ఎంచుకోవడం అవసరం అంటున్నారు ఆర్థిక సలహాదారులు...



మన తాత, తల్లిదండ్రుల కాలం నుంచి చాలా మందికి తెలిసింది ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ) గురించే. లేదంటే పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు పథకాలు. కొంత మొత్తం పొదుపు కనిపించిన వెంటనే బ్యాంకుకు వెళ్లి డిపాజిట్‌ చేయడం అలవాటుగా ఉండేది. కానీ, అదే సమయంలో అత్యవసరాలు ఏర్పడితే కనిపించేదీ అదే డిపాజిట్‌. దాంతో ఆ డిపాజిట్‌ను మధ్యలోనే రద్దు చేసి వెనక్కి తీసుకునేవారు. చివరి వరకూ కొనసాగించేది కొందరే.  ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉత్తమ పెట్టుబడి సాధనం కాదు అనేందుకు పలు కారణాలున్నాయి.



ఒకప్పుడు 8–9% వడ్డీ రేటు డిపాజిట్లపై వచ్చేది. కానీ, ఇప్పుడది 7 శాతానికి పడిపోయింది. ఎఫ్‌డీపై పన్ను భారంతోపాటు ఎటువంటి పన్ను రాయితీలు లేవు. ఒకవేళ 30% ఆదాయపన్ను శ్లాబులో ఉన్న వారు తీసుకెళ్లి ఎఫ్‌డీలో పెడితే పొందే ప్రయోజనం ఏమీ ఉండదు. ఉదాహరణకు రూ.10 లక్షలను ఎఫ్‌డీ చేస్తే దానిపై వార్షికంగా రూ.72వేల ఆదాయం పొందారనుకోండి. 30% పన్ను కింద రూ.21,600 చెల్లించాల్సి వస్తుంది. పోనీ ఎంతోకొంత వచ్చిందని సర్ది చెప్పుకోకండి. ద్రవ్యోల్బణం ఉండనే ఉంది. ఏటేటా ద్రవ్యోల్బణం నగదు విలువను హరిస్తుంటుంది. ఈ ప్రభావాన్ని మినహాయిస్తే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే రాబడిలో చివరికి ఏమీ మిగలదు.


అధిక పన్ను రేటులో ఉన్నవారు ప్రతి కూల రాబడులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే రాబడి లేకపోగా తమ పెట్టుబడుల విలువ 1 నుంచి 2% వరకు కోల్పోవాల్సి ఉంటుంది. నిజానికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే మెరుగైన సాధనాలున్నాయి. అందులోనూ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల తరహా సాధనమే కావాలనుకుంటే డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సరైనవి. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌పైనా పన్ను ఉంటుంది. కానీ ఆ పన్ను ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తీసేసిన తర్వాత మిగిలిన రాబడులకే వర్తిస్తుంది. అందుకే ఎఫ్‌డీలతో పోలిస్తే డెట్‌ మ్యూ చువల్‌ ఫండ్స్‌ బెటర్‌.



డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌...?

నిజానికి మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో డెట్‌ ఫండ్స్‌ ఓ రకం. ఇది ఎఫ్‌డీలకు చక్కని ప్రత్యామ్నాయం. డెట్‌ ఫండ్స్‌ ద్వారా తమకు వచ్చిన నిధులను అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు అధిక భద్రత ఉండే ప్రభుత్వ బాండ్లు, సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్లు, ఇతర భద్రతతో కూడిన వాటిల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. సాధారణ ఇన్వెస్టర్‌కు ఈ విధమైన వైవిధ్య పెట్టుబడులు కష్ట సాధ్యం.



పన్నులో వెసులుబాటు

బ్యాంకు ఎఫ్‌డీలు, డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఈ రెండింటిపైనా వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ డెట్‌ ఫండ్స్‌పై పన్ను చాలా తక్కువ. ఎలా అంటే... డెట్‌ ఫండ్స్‌పై రాబడి 8 శాతం ఉందనుకోండి. దానిలోంచి ద్రవ్యోల్బణ సూచీ ప్రభావాన్ని తీసేయగా మిగిలిన నికర రాబడిపైనే 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది.



ఇదీ తేడా...

ఉదాహరణకు... ఎఫ్‌డీలో, డెట్‌ ఫండ్‌లో రూ.లక్ష చొప్పున పెట్టుబడి పెడితే... రెండింటిపైనా రాబడి 8 శాతం అనుకుంటే (కేవలం అవగాహన కోసమే) మూడేళ్ల తర్వాత ఒక్కోదానిలో రూ.1,25,971 చొప్పున అవుతాయి. ఎఫ్‌డీపై కొనుగోలు ఆధారిత ద్రవ్యోల్బణ ప్రభావం కలిపేందుకు అవకాశం లేదు. అదే డెట్‌ ఫండ్‌పై ఈ వెసులుబాటు ఉంది.


అప్పుడు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని నికర పెట్టుబడికి కలిపితే లక్ష కాస్తా రూ.1,19,102 అవుతుంది. అంటే పన్ను చెల్లించాల్సిన నికర రాబడి డెట్‌ ఫండ్‌లో రూ.6,869 కాగా, ఎఫ్‌డీలో రూ.1,25,971. ఇప్పుడు ఎఫ్‌డీపై 30 శాతం పన్ను రేటులో ఉన్న వారు చెల్లించాల్సిన పన్ను రూ.8,025. ఎఫ్‌డీపై రూ.1,371 మాత్రమే. పన్ను పోగా ఎఫ్‌డీలో మిగిలిన రాబడి రూ.17,946. డెట్‌ ఫండ్‌లో రూ.24,597. రాబడి శాతం ఎఫ్‌డీలో 5.65 శాతం కాగా, డెట్‌ ఫండ్‌లో 7.61 శాతంగా ఉంది.



ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఎప్పుడు?

దీర్ఘకాల పెట్టుబడులకు ఎఫ్‌డీలు సరైన సాధనాలు కావన్నది నిజమే. కానీ, ఆరు నెలల కాలానికి ఎఫ్‌డీల్లో మదుపు చేయడం తప్పేమీ కాదు. చాలా తక్కువ కాలంలోనే డబ్బుతో పని ఉంటే అప్పటి వరకు ఎఫ్‌డీల్లో ఉంచడమే నయం. రాబడి ఓ రెండు శాతం ఎక్కువ వస్తుంది కదా అని మ్యూచువల్‌ ఫండ్స్‌ వైపు వెళ్లక్కర్లేదు. ఎందుకంటే అంత తక్కువ వ్యవధికి రాబడుల్లో ఉండే వ్యత్యాసం స్వల్పమే.



సిప్‌ విధానంలో...

కొంత మందికి రికరింగ్‌ డిపాజిట్‌ కట్టడం అలవాటు. నెలనెలా కొంత పొదుపు చేసుకునేందుకు ఇలా ఆర్‌డీ, చిట్స్‌లో చేరడం చేస్తుంటారు. కానీ, ఇవి కేవలం పొదుపు సాధనాలుగానే ఉపయోగపడతాయి. పొదుపు వేరు, మదుపు వేరన్న విషయం తెలిసే ఉంటుంది. వీటి కంటే డెట్‌ ఫండ్స్‌లో సిప్‌ విధానంలో నెలనెలా కొంత మదుపు చేస్తూ వెళ్లడం వల్ల దీర్ఘకాలంలో ఎక్కువ రాబడులకు అవకాశం ఉంటుంది. చాలా స్వల్ప కాల వ్యవధికి ఎఫ్‌డీలను ఎంచుకుంటే తప్పులేదు గానీ, రిటైర్మెంట్, పిల్లల విద్య తరహా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఎంచుకోవడం ఎంత మాత్రం సరికాదు. మ్యూచువల్‌ ఫండ్స్, పీపీఎఫ్‌ వంటివే దీర్ఘకాల అవసరాలను తీర్చగలిగే సాధనాలు.



ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌

ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్‌మెంట్‌ చేయదలిస్తే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో మంచి రాబడులను పొందడానికి అవకాశం ఉంది. అదీ సిప్‌ విధానంలోనే. ఫండ్‌ పథకాల్లోనూ రిస్క్‌ సామర్థ్యం ఆధారంగా పూర్తి ఈక్విటీ, ఈక్విటీ + డెట్‌ కలసినవి, ఈక్విటీ పథకాల్లోనూ లార్జ్‌ క్యాప్, మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్, మల్టీ క్యాప్‌ ఉన్నాయి. వీటిలో నెలనెలా సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తూ వెళితే దీర్ఘకాలంలో వార్షికంగా 14 నుంచి 18 శాతం వరకు రాబడులను పొందడానికి అవకాశం ఉందని చరిత్ర చెబుతోంది. పన్ను రహిత రాబడులకు వీలు కల్పించే ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ పథకాల్లోనూ రాబడులు 14 శాతం కంటే ఎక్కువే ఉన్నాయి. అందుకే దీర్ఘకాల అవసరాలకు ఎఫ్‌డీలకు బదులు ప్రత్యామ్నాయాలవైపు చూడడం ద్వారానే సంపద సృష్టి సాధ్యమవుతుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top