గతవారం బిజినెస్

గతవారం బిజినెస్


ఆన్‌లైన్ రిటైల్ రంగంలోకి వి మార్ట్



 రిటైల్ చెయిన్ వి మార్ట్ ఆన్‌లైన్ రిటైల్ రంగంలోకి ప్రవేశిస్తోంది. వచ్చే ఏడాది దీపావళి కల్లా ఆన్‌లైన్ రిటైల్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని వి-మార్ట్ రిటైల్ సీఎండీ లలిత్ అగర్వాల్ చెప్పారు. మొబైల్ యాప్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ద్వారా ఆన్‌లైన్ రిటైల్ కార్యకలాపాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.



 తొలి ఈ-కామర్స్ ఐపీఓ...

 దేశంలో తొలిసారిగా పబ్లిక్ ఇష్యూకిరానున్న ఈ-కామర్స్ కంపెనీగా గుజరాత్‌కు చెందిన ఇన్ఫీబీమ్ ఇన్‌కార్పొరేషన్ లిమిటెడ్ రికార్డు సృష్టించనుంది. సెబీకి దాఖలు చేసిన ప్రాస్పెక్టస్ ప్రకారం ఈ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ దాదాపు రూ.450 కోట్ల నిధులను సమీకరించాలని భావిస్తోంది. ఐపీఓ ద్వారా వచ్చే నిధులను క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు, 75 లాజిస్టిక్స్ కేంద్రాలను నెలకొల్పడంతోపాటు, రిజిస్టర్డ్, కార్పొరేట్ కార్యాలయ ఏర్పాటుకు వినియోగించనుంది. అలాగే టీమ్‌లీజ్ రూ.500 కోట్లు, ఇండిగో ఎయిర్‌లైన్స్ రూ.2,500 కోట్ల మేరకు నిధులను సమీకరించాలని భావిస్తున్నాయి.



 భారత్ విదేశీ రుణ భారం 476 బిలియన్ డాలర్లు

 భారత విదేశీ రుణ భారం 2015 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం 476 బిలియన్ డాలర్లకు చేరింది. 2014 మార్చితో పోలిస్తే ఈ మొత్తం 29.5 బిలియన్ డాలర్లు (6.6%) ఎగశాయి. విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ), ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు భారీగా పెరగడం రుణ భారం పెరగడానికి కారణం. 2015 మార్చి నాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చిచూస్తే విదేశీ రుణ భారం 23.8 శాతంగా ఉంది.



 జీప్ మోడల్‌పై ఫియట్ భారీ పెట్టుబడులు

 ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్(ఎఫ్‌సీఏ) సంస్థ జీప్ మోడల్ ఉత్పత్తి కోసం భారత్‌లో రూ.1,780 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. టాటా మోటార్స్‌తో కలిసి జాయింట్ వెంచర్‌గా ఉత్పత్తి చేయనున్న ఈ జీప్ మోడల్ 2017 జూన్‌కల్లా మార్కెట్లోకి వస్తుందని అంచనా. మహారాష్ట్రలోని రంజన్‌గావ్ ప్లాంట్‌లో ఈ జీప్ మోడల్‌ను ఉత్పత్తి చేస్తారు.



 వైజాగ్‌లో ఉబర్ సేవలు

 ఉబర్ కంపెనీ తన ట్యాక్సీ సేవలను వైజాగ్‌లో గురువారం నుంచి ప్రారంభించనుంది. వైజాగ్‌తోపాటు ఉబర్ సేవలు భువనేశ్వర్, కోయంబత్తూరు, ఇండోర్, మైసూర్, నాగ్‌పూర్, సూరత్ వంటి ఆరు టైర్-2 పట్టణాల్లో కూడా ప్రారంభంకానున్నాయి. దీంతో ఉబర్ సేవలు దేశంలో 18 పట్టణాల్లో ఉన్నట్లు అవుతుంది. అలాగే ఉబర్‌కు అమెరికా తర్వాత భారత్ రెండో అతిపెద్ద మార్కెట్ ప్రాంతంగా మారుతుంది.



 రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు

 ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా వీక్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఇందులో ముకేశ్ అంబానీ, సునీల్ మిట్టల్, సైరస్ మిస్త్రీ, కుమార మంగళం బిర్లా, అజీం ప్రేమ్‌జీ, అనిల్ అంబానీ, బెర్న్‌హార్డ్ గెర్వర్ట్ తదితర దేశ విదేశ దిగ్గజాలు పాల్గొన్నారు. వీరందరూ దాదాపు 18 లక్షల ఉద్యోగాల కల్పన జరిగేలా డిజిటల్ రంగంపై సుమారు రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో బిర్లా 7 బిలియన్ డాలర్లు, మిట్టల్ రూ. 1 లక్ష కోట్లు, అనిల్ అంబానీ రూ. 10,000 కోట్లు, కుమార మంగళం బిర్లా 9 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామని వెల్లడించారు.



 భారత్‌లో హెచ్‌టీసీ అసెంబ్లింగ్ కేంద్రం

 హెచ్‌టీసీ భారత్‌లో మొబైళ్ల విక్రయాల్లో బలమైన వృద్ధిని సాధిస్తోంది. దీంతో భారత్‌లోనే స్థానికంగానే ఒక మొబైల్ అసెంబ్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. అయితే ఏ ప్రాంతంలో ఏర్పాటుచేసే అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ప్రస్తుతం హెచ్‌టీసీకి తైవాన్, చైనాల్లో అసెంబ్లింగ్ కేంద్రాలు ఉన్నాయి.



 దేశవ్యాప్తంగా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ

 దేశవ్యాప్తంగా పూర్తి స్థాయి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌తో పాటు ప్రైవేట్ కంపెనీలు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, ఆర్‌కామ్.. ఇందుకుఅన్ని సన్నాహాలు చేసినట్లు తెలిపాయి.  మొబైల్ వినియోగదారులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే .. వేరే టెలికం ఆపరేటరుకు మారినా పాత నంబరునే కొనసాగించుకునేందుకు ఎంఎన్‌పీ వల్ల వెసులుబాటు లభిస్తుంది.



 హైదరాబాద్‌లో గోల్డ్ డెలివరీ సెంటర్

 నేషనల్ కమోడిటీ డెరివేటివ్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌సీడెక్స్) హైదరాబాద్‌లో బంగారం డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎన్‌సీడీఎక్స్ కొత్తగా ప్రవేశపెట్టిన ‘గోల్డ్ నౌ’ ఫార్వర్డ్ కాంట్రాక్టులను శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకురావడంతో ఇక్కడ డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎన్‌సీడెక్స్ బిజినెస్ హెడ్ సురేష్ దేవ్‌నాని తెలిపారు. గోల్డ్ నౌ ఫార్వర్డ్ కాంట్రాక్టు ద్వారా పది శాతం మార్జిన్ చెల్లించి బంగారం కోనుగోలు చేస్తే రెండు రోజుల తర్వాత డెలివరీ (టి+2) ఇస్తామన్నారు.



 ఎగుమతుల్లో ఎంపెడా రికార్డ్ స్థాయి వృద్ధి

 సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) ఎగుమతుల్లో రికార్డు స్థాయి వృద్ధి సాధించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 5511.12 మిలియన్ అమెరికా డాలర్ల విలువైన మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేసి ఈ ఆల్‌టైమ్ హై రికార్డును సొంతం చేసుకుంది. రూ.33,441.61 కోట్ల విలువైన 10,51,243 మెట్రిక్ టన్నుల మత్స్య సంపదను ఎగుమతి చేసింది.

 

  డీల్స్..

► ప్రముఖ ఫార్మా దిగ్గజం లుపిన్ రష్యాకు చెందిన బయోకామ్ ఫార్మా కంపెనీని కొనుగోలు చేసింది. ఈ కంపెనీలో వంద శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేశామని లుపిన్ పేర్కొంది. అయితే ఆర్థిక వివరాలను వెల్లడించలేదు.

► భారత సాయుధ బలగాలకు అవసరమయ్యే హెలికాప్టర్ల తయారీ కోసం మహీంద్రా గ్రూప్, యూరోపియన్ దిగ్గజం ఎయిర్‌బస్ చేతులు కలిపాయి. ఎయిర్‌బస్ హెలికాప్టర్స్, మహీంద్రా డిఫెన్స్ కంపెనీలు కలిసి జాయింట్ వెంచర్ సంస్థను నెలకొల్పనున్నాయి.

► ఆన్‌లైన్ ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఓలాలో పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వ్యక్తిగత హోదాలో పెట్టుబడులు పెట్టారు. అయితే, ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేసింది, ఎంత వాటాలు తీసుకుంది వెల్లడి కాలేదు. ప్రస్తుతం ఓలా సంస్థకు దే శవ్యాప్తంగా 100 నగరాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. 1.5 లక్షల పైచిలుకు వాహనాలు ఇందులో నమోదయ్యాయి.



నియామకాలు



► మారుతీ సుజుకీ మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్  ప్రెసిడెంట్‌గా తొషిహిరో సుజుకీ ఎంపికయ్యారు.

► ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ సంస్థ ఐడీఎఫ్‌సీ స్వతంత్ర డెరైక్టర్‌గా కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) మాజీ డెరైక్టర్ వినోద్ రాయ్ నియమితులయ్యారు.ఆయన ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఎల్‌ఐసీలకు సంబంధించిన బోర్డులలో డెరైక్టర్‌గా ఉన్నారు.

► టాటా మోటార్స్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ)గా సి.రామకృష్ణన్ నియమితులయ్యారు.

► ఆయిల్ ఇండియా తాత్కాలిక చైర్మన్‌గా యు.పి. సింగ్‌ను ప్రభుత్వం నియమించింది. చమురు మంత్రిత్వ శాఖలో ఆయన సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

► ఐసీఐసీఐ బ్యాంకు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కె.వి.కామత్ స్థానంలో ఎం.కె.శర్మ నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం మూడేళ్లు.   

► సింగపూర్‌కు చెందిన జంగ్లీ వెంచర్స్‌కు ప్రత్యేక సలహాదారుగా రతన్ టాటా వ్యవహరించనున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వినూత్నమైన టెక్నాలజీ కంపెనీలకు తోడ్పాటునందించేందుకు అనురాగ శ్రీవాత్సవ, అమిత్ ఆనంద్‌లు జంగ్లీ వెంచర్స్‌ను ప్రారంభించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top