బీమా భద్రతలో... లేడీస్‌ స్పెషల్‌!

బీమా భద్రతలో... లేడీస్‌ స్పెషల్‌!


మహిళలకు ఈ ఆరూ తప్పనిసరి

ఆరోగ్యం నుంచి వాహనం దాకా అన్నీ అవసరమే  




మహిళలంటే... ఎన్నో బాధ్యతలు!. ఒకవైపు ఆఫీస్‌.. మరొకవైపు కుటుంబం. తన గురించి ఆలోచించుకోవటానికి కూడా కొన్ని సందర్భాల్లో సమయం దొరకదు. అయినా సరే... ఎలాగోలా వీలు కల్పించుకొని మహిళలు వారి ఆరోగ్యం, ఆర్థిక భద్రత గురించి ఆలోచించుకోవాలి. మరీ ముఖ్యంగా బీమాకు అధిక ప్రాధాన్యమివ్వాలి. సాధారణంగా కుటుంబంలో మగవారికే బీమా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో భార్యాభర్తలిద్దరూ సమానమైనప్పుడు మరి బీమా ఒక్కరికే ఉండటమెందుకు? ఇదెంతమాత్రం మంచిది కాదు. ఇప్పటికీ బీమా తీసుకోని మహిళలు కనీసం కొత్త ఏడాదిలోనైనా తీసుకోండి. గృహిణి, ఉద్యోగిని అనే అంశంతో నిమిత్తం లేకుండా ప్రతి మహిళా కొన్ని బీమా పాలసీలు తీసుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం...



ఆరోగ్య బీమా

ఏదైనా ఊహించని తీవ్రమైన ఆరోగ్య సమస్య ఎదురైతే ఆరోగ్య బీమా అండగా నిలుస్తుంది. ఆర్థికంగా చేయూతనందిస్తుంది. ఇటీవల వైద్య ఖర్చులు కూడా బాగా పెరిగిపోయాయి. కొత్త కొత్త రోగాలొస్తున్నాయి. కొన్ని వ్యాధుల చికిత్సకు ఒక్కోసారి మన దగ్గరున్న డబ్బు సరిపోదు. అందుకే ఆరోగ్య బీమా తప్పనిసరి. అది కూడా ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. చిన్న వయసులో బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. సమగ్రమైన ఆరోగ్య బీమా పాలసీని తీసుకోండి. హాస్పిటల్‌ ఖర్చులు, మందుల వ్యయాలు, డాక్టర్ల ఫీజులను మీరు తీసుకోబోయే పాలసీ కవర్‌ చేస్తోందో లేదో గమనించండి. అలాగే ప్రసూతి ప్రయోజనాలు మరువొద్దు. ప్రస్తుతం కొన్ని పాలసీలు పిల్లలు పుట్టాక వారి వ్యాక్సిన్లకయ్యే ఖర్చుల్ని కూడా కవర్‌ చేస్తున్నాయి.



క్రిటికల్‌ ఇన్సూరెన్స్‌

అండాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్‌... వంటి వ్యాధుల చికిత్సకు అధిక మొత్తంలో డబ్బులు కావాలని చాలా మంది మహిళలు ఈ వ్యాధులను నిర్లక్ష్యం చేస్తుంటారు. అందుకే ఇలాంటి వ్యాధుల చికిత్స కోసం క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ తీసుకోవాలి. దీనికింద తీసుకునే మొత్తాన్ని హాస్పిటల్‌ బిల్లులు కట్టడానికే కాకుండా రుణ

చెల్లింపులకూ వాడుకోవచ్చు.



ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌

ప్రస్తుతం మహిళలు.. మగవారితో సమానంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆఫీస్‌ పనిమీద వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. అందుకే మహిళలు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కూడా తీసుకోవాలి. కొత్త ప్రాంతాల్లో మెడికల్‌ ఎమర్జెన్సీ ఏర్పడినా, పాస్‌పోర్ట్‌ /వీసా పోయినా, బ్యాగేజ్‌ తస్కరణకు గురయినా, ట్రిప్‌ రద్దయినా ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఆదుకుంటుంది. సమగ్రమైన ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ అటు ఆర్థిక అవసరాలను, ఇటు ఆరోగ్య అవసరాలను రెండింటినీ కవర్‌ చేస్తుంది.



వ్యక్తిగత ప్రమాద బీమా

ప్రమాదాలు ఎప్పుడైనా ఎక్కడైనా జరగొచ్చు. అది మీరు ఇంట్లో ఉన్నపుడైనా... బయట ప్రయాణంలో ఉన్నపుడైనా. అందుకే వ్యక్తిగత ప్రమాద బీమా తప్పనిసరి. ప్రమాదంలో అనుకోకుండా మరణిస్తే వచ్చే బీమా మొత్తం.. కుటుంబానికి బాసటగా నిలుస్తుంది. అదే అంగవైకల్యం సంభవిస్తే ఆర్థికంగా చేయూత లభిస్తుంది. అప్పుడు కుటుంబ సభ్యులపై ఆర్థిక భారం తగ్గుతుంది.



ఇంటి బీమా

ఇల్లంటే మాటలు కాదు. నిర్మాణానికి అధిక మొత్తం కావాలి. మరి ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటికి ఏమైనా జరిగితే? అందుకే ఇంటికీ బీమా తీసుకోవాలి. భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇంటికి కలిగే నష్టాన్ని భరించేందుకు ఇంటి బీమా తీసుకోండి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top