సాగు పరికరాల అడ్డా ‘కిసాన్‌ క్రాఫ్ట్‌’

సాగు పరికరాల అడ్డా ‘కిసాన్‌ క్రాఫ్ట్‌’ - Sakshi


375 వ్యవసాయ పనిముట్లు; 2 పేటెంట్లు

మన దేశంతో పాటూ నేపాల్, శ్రీలంకలోనూ మార్కెట్‌

ఏపీలో 135, తెలంగాణలో 75 మంది డిస్ట్రిబ్యూటర్లు

గతేడాది రూ.102 కోట్ల టర్నోవర్‌;

ఈ ఏడాది రూ.130 కోట్ల లక్ష్యం

‘స్టార్టప్‌ డైరీ’తో సంస్థ ఎండీ రవీంద్ర అగర్వాల్‌  




హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మన దేశంలో వ్యవసాయంలో టెక్నాలజీ అంటే... ట్రాక్టర్లో, లేకపోతే చిన్నపాటి వ్యవసాయ పనిముట్ల వినియోగం వరకే పరిమితం. పాశ్చాత్య దేశాల్లో అలా కాదు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తుండటంతో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి సాధ్యమవుతోంది. అలాగని విదేశాల నుంచి వ్యవసాయ పరికరాలను దిగుమతి చేసుకొని స్థానికంగా విక్రయిస్తే సరిపోతుందా? కాదు. ఎందుకంటే అవి మన నేల సారం, పంటల తీరును బట్టి ఉండాలి. ఇదే కిసాన్‌క్రాఫ్ట్‌ సంస్థకు బీజం వేసింది. విదేశాల నుంచి విడిభాగాలను తెచ్చి, స్థానిక అవసరాలకు తగ్గట్టు వ్యవసాయ పరికరాలుగా అభివృద్ధి చేసి విక్రయించడమే కిసాన్‌క్రాఫ్ట్‌ ప్రత్యేకత. ఇక్కడి నుంచి నేపాల్, శ్రీలంకలకూ ఈ ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. మరిన్ని వివరాలను సంస్థ ఎండీ రవీంద్ర అగర్వాల్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.



మాది ఛత్తీస్‌ఘడ్‌లో మారుమూల ప్రాంతం. బిట్స్‌ పిలానీలో ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక.. ఐటీ కంపెనీలో జాబ్‌లో చేరా. తర్వాత ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్లు చేశాక.. అమెరికాలో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం రావడంతో రాజీనామా చేసి యూఎస్‌ వెళ్లా. 17 ఏళ్లు పనిచేశా. ఇండియాకు వచ్చినప్పుడల్లా ఆశ్చర్యమేసేది.. ‘‘టెక్నాలజీ వాడకంలో ప్రపంచ దేశాలు ముందుకెళుతుంటే మన గ్రామాలు పాతకాలంలోనే ఉండిపోయాయే అని!’’ రైతులకు టెక్నాలజీ ఉపయోగపడేలా ఏదైనా చేయాలనుకున్నా. అలా 2005లో కిసాన్‌క్రాఫ్ట్‌కు బీజం పడింది. అమెరికాలో నా సహోద్యోగి చార్లెస్‌ మోరేతో కలసి రూ.కోటి పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా కిసాన్‌క్రాఫ్ట్‌ను ప్రారంభించా.



బెంగళూరులో తయారీ కేంద్రం..

అమెరికా, జపాన్, చైనా, ఇటలీ నుంచి వ్యవసాయ పరికరాల విడిభాగాలను దిగుమతి చేసుకుని మన రైతులకు వీలుగా బెంగళూరులోని ప్లాంట్‌లో అసెంబుల్‌ చేస్తాం. ఇక్కడ 15 వేల చ.అ.ల్లో తయారీ కేంద్రం ఉంది. కొన్ని పరికరాలను ప్లాంట్‌లోనే అభివృద్ధి చేస్తాం కూడా. ప్రస్తుతమున్న ప్లాంట్‌ స్థలం లీజు విధానంలో ఉంది. ఇటీవలే శివారు ప్రాంతంలో 10 ఎకరాల స్థలాన్ని కొన్నాం. ప్లాంట్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. త్వరలో ప్రారంభిస్తాం. ప్లాంట్‌ సామర్థ్యం రోజుకు 200 పెట్రోల్‌ ఇంజిన్స్, 50 కల్టివేటర్లు. ఇప్పటివరకు గేర్‌ బాక్స్, ఆయిల్‌ పామ్‌ హార్వెస్టర్‌ పరికరాలకు పేటెంట్లు కూడా పొందాం. సింగిల్‌ రో కాటన్‌ పిక్కర్, ప్యాడీ వీడర్‌ పరికరాల పేటెంట్ల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నాం. ఈ ఏడాదిలో రావచ్చు.



375 వ్యవసాయ పరికరాలు..

ప్రస్తుతం కిసాన్‌క్రాఫ్ట్‌లో 375 వ్యవసాయ పరికరాలున్నాయి. వీటిల్లో ప్యాడీ వీడర్, ఆయిల్‌ పామ్‌ ఎఫ్‌ఎఫ్‌బీ హార్వెస్టర్, ఆర్చ్‌డ్‌ స్ప్రేయర్స్, ఇంటర్‌ కల్టివేటర్‌ వంటివి కొన్ని. ధరలు రూ.30 నుంచి లక్ష వరకుంటాయి. ఫామ్‌ మిషనరీ ట్రైనింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎఫ్‌ఎంటీటీఐ), సింథ్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ పరీక్ష, అనుమతి పొందినవే. వచ్చే రెండేళ్లలో మరో 10 ఉత్పత్తులను తయారు చేస్తాం. రుణాల ద్వారా పనిమట్లను కొనుగోలు చేసేందుకు వీలుగా సిండికేట్, ఐడీఎఫ్‌సీ బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నాం. పనిముట్ల బీమా కోసం పలు బీమా కంపెనీలతో చర్చిస్తున్నాం. త్వరలోనే బీమా సేవలనూ అందుబాటులోకి తీసుకొస్తాం.



రూ.130 కోట్ల టర్నోవర్‌ లక్ష్యం..

ప్రస్తుతం మా సంస్థలో 280 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 50 మంది ఇంజనీర్లు. వీరు వ్యవసాయ పనిముట్లపై రైతులకు అవగాహన కల్పిస్తుంటారు. దేశంలో 2 వేల మంది డిస్ట్రిబ్యూటర్లున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 135 మంది, తెలంగాణలో 75 మంది డిస్ట్రిబ్యూటర్లున్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.102 కోట్ల టర్నోవర్‌ను చేశాం. ఈ ఏడాది రూ.130 కోట్లు లకి‡్ష్యంచాం. మా టర్నోవర్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వాటా 15 శాతం. ప్రస్తుతం ఎగుమతుల వాటా 2 శాతంగా ఉంది. బంగ్లాదేశ్, భూటాన్‌ దేశాలకూ విస్తరించనున్నాం.



అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటేstartups@sakshi.comకు మెయిల్‌ చేయండి...

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top