కింగ్‌ఫిషర్ ఉదంతం ఓ నీటిబొట్టే

కింగ్‌ఫిషర్ ఉదంతం ఓ నీటిబొట్టే - Sakshi


 న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల (ఎన్‌పీఏ) సమస్య చాలా పెద్దదనీ, కింగ్‌ఫిషర్ వ్యవహారం ఓ నీటిబొట్టు వంటిదేననీ మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ వ్యాఖ్యానించారు. ‘సన్నిహిత మిత్రులు’ రుణాలు పొందడానికి తమ సంబంధాలను వినియోగిస్తుండడమే ఎన్‌పీఏల సమస్యలకు కారణమని ఆరోపించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకుల్లో ఎన్‌పీఏలు చాలా తక్కువగా ఉండడాన్ని గ్రహించాల్సి ఉందని తాజాగా వెలువరించిన పుస్తకంలో రాయ్ పేర్కొన్నారు.



‘ఇటీవల వెలుగులోకి వచ్చిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, భూషణ్ స్టీల్స్ కేవలం పైకి కన్పిస్తున్న బిందువులు మాత్రమే. కార్పొరేట్ రుణాల పునర్‌వ్యవస్థీకరణలోకి పోయిన సొమ్ము వ్యవహారం మరో కథ...’ అని ఆయన వ్యాఖ్యానించారు.



 కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ విజయ్ మాల్యాతో పాటు అదే కంపెనీకి చెందిన ముగ్గురు డెరైక్టర్లను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల 1న ప్రకటించింది. ఎస్‌బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల కన్సార్షియంకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.7 వేల కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. దాదాపు రూ.40 వేల కోట్లు బకాయిలున్న భూషన్ స్టీల్స్ ఖాతాలపై ఫోరెన్సిక్ ఆడిట్‌కు బ్యాంకుల బృందం ఆదేశించింది. కంపెనీ రుణ పరిమితి పెంచేందుకు సిండికేట్ బ్యాంక్ చైర్మన్ ఎస్.కె.జైన్ లంచం తీసుకున్న కేసులో భూషణ్ స్టీల్ వైస్‌చైర్మన్ నీరజ్ సింఘాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన కొద్ది రోజులకే ఫోరెన్సిక్ ఆడిట్ ఉత్తర్వులు వెలువడ్డాయి.



 రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్‌పీఏలు 2013లో 3.61 శాతం పెరిగాయని వినోద్ రాయ్ పేర్కొన్నారు. ఏ ప్రమాణాలతో చూసిన ఈ పెరుగుదల అసాధారణమని అన్నారు. ప్రైవేట్ బ్యాంకుల ఎన్‌పీఏలు ఇందులో సగం శాతమే ఎందుకు పెరిగాయో గ్రహించడానికి పెద్దగా విశ్లేషణ అవసరం లేదని చెప్పారు.

 

కేజీ-డీ6పైనా...

 2జీ, కోల్ గేట్ స్కామ్‌లలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రమేయం ఉందంటూ తన తాజా పుస్తకంలో పేర్కొని ప్రకంపనలు సృష్టించిన రాయ్.. కేజీ-డీ6 ఆడిట్ విషయంలోనూ ఆయనను ఇరికించారు. పైవేటు రంగాన్ని దెబ్బతీసే విధంగా ఆడిట్ ఉండకూడదని మన్మోహన్ తనకు చెప్పినట్లు రాయ్ పేర్కొన్నారు. అంతేకాదు రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాని చెబుతూ.. దానికి వత్తాసు పలికేలా మాట్లాడేవారని కూడా రాయ్ చెప్పారు. ప్రభుత్వం, కేజీ-డీ6 కాంట్రాక్టర్(ఆర్‌ఐఎల్)ల మధ్య పలు అంశాల్లో సయోధ్య కుదిరిన ప్రతిసారీ.. ఖజానాకు నష్టం కలిగిందన్నదే తమ వాదననని రాయ్ తన పుస్తకంలో అభిప్రాయపడ్డారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top