వామ్మో జియో ఫోన్‌: ఇక మరింత పతనమే

వామ్మో జియో ఫోన్‌: ఇక మరింత పతనమే

న్యూఢిల్లీ : జియో ఫోన్‌ ఇంకో 15 రోజుల్లో మార్కెట్‌లోకి వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్‌ టెస్టింగ్‌ కూడా ప్రారంభమైంది. జియో ఫోన్‌తో వచ్చే నష్టాలపై దేశీయ రెండో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ముందుగానే ఆందోళన వ్యక్తంచేస్తోంది. అపరిమిత కాలింగ్‌ సౌకర్యంతో ఉచితంగా జియో ఫోన్‌ను అందిస్తే, టెలికాం ఆపరేటర్ల రెవెన్యూలు మరింత పతనం కానున్నాయని పేర్కొంది. ఇప్పటికే జియో ఎంట్రీతో కుదేలైన తమ రెవెన్యూలు, భారీగానే కుంగిపోనున్నాయని పేర్కొంది. ఈ క్రమంలో ఇండస్ట్రీని కాపాడేందుకు ప్రభుత్వం విధిస్తున్న లెవీలను తగ్గించాలని వొడాఫోన్‌ కోరుతోంది. జీరోకే ఫీచర్‌ ఫోన్‌, దాంతో పాటు అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ వంటి వాటితో కొత్త ఆపరేటర్‌ ధరల దూకుడుతనాన్ని కొనసాగిస్తుందని వొడాఫోన్‌ ఆరోపించింది. 

 

దీంతో ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఆపరేటర్ల రెవెన్యూలు మరింత పతనం కానున్నాయని తెలుపుతూ టెలికాం కమిషన్‌ మెంబర్‌(ఫైనాన్స్‌) అనురాధ మిత్రాకి కంపెనీ ఓ లేఖ రాసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత, ఎండీ ముఖేష్‌ అంబానీ ఇటీవలే జియో 4జీ ఫీచర్‌ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఒక్కో యూనిట్‌కు రూ.1500 రీఫండబుల్‌ డిపాజిట్‌ చెల్లించి దీన్ని కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మూడేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయనున్నారు. ఆగస్టు 24 నుంచి ఈ ఫోన్‌ బుకింగ్స్‌ కూడా ప్రారంభం కాబోతున్నాయి. జియో దెబ్బకు వొడాఫోన్‌ రెవెన్యూలు భారీగా పడిపోతున్నాయి. 2017 జూన్‌ క్వార్టర్‌లో కంపెనీ మరో 3.41 శాతం ఢమాలమంది. స్పెక్ట్రమ్‌ చెల్లింపుల్లో ఆలస్యానికి విధిస్తున్న వడ్డీరేటు తగ్గించాల్సినవసరం ఉందని, ఇది టెలికాం ఆపరేటర్లపై భారాన్ని కూడా తగ్గిస్తుందని వొడాఫోన్‌ పేర్కొంది. ప్రస్తుతమున్న 10 శాతం రేటును 6.25-6.5 శాతం మధ్యలో ఉంచాలని వొడాఫోన్‌ కోరుతోంది. అంతేకాక యూఎస్‌ఓ లెవీని కూడా 5 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని కూడా డీఓటీని వొడాఫోన్‌ అభ్యర్థిస్తోంది. 

 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top