జ్యువెలర్స్ సమ్మె: స్తంభించిన వ్యాపారం

జ్యువెలర్స్ సమ్మె: స్తంభించిన వ్యాపారం


ముంబై: దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 300 జ్యువెలరీ ట్రేడర్ అసోసియేషన్స్.. రూ.2 లక్షలు, అంతకుమించి విలువైన బంగారు ఆభరణాల కొనుగోలు లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరన్న కేంద్ర ప్రభుత్వ చర్యకు నిరసనగా బుధవారం సమ్మె నిర్వహించాయి. దీంతో పలు ప్రాంతాల్లో బంగారు అభరణాల లావాదేవీలు నిలిచిపోయాయి. ప్రధాన నగరాల్లో బులియన్ మార్కెట్లు పనిచేయలేదు. పాన్  కార్డు తప్పనిసరి చర్య కారణంగా జ్యువెలర్స్ ముఖ్యంగా గ్రామీణ, చిన్న చిన్న పట్టణాల్లో కస్టమర్లను కోల్పోవలసి వస్తోందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ ఫెడరేషన్ (జీజేఎఫ్) డెరైక్టర్ అశోక్ మీనావాలా తెలిపారు.


గత నెల కాలంలో (జనవరి 1 నుంచి పాన్ నిబంధనలు అమల్లోకి వచ్చిన దగ్గరి నుంచి) జ్యువెలర్స్ నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని, పరిశ్రమ టర్నోవర్ 30%పైగా తగ్గిందని వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే పరిశ్రమపై ఆధారపడ్డ చాలా మంది ఉపాధి కోల్పోవలసి వస్తుందన్నారు. ఈ విషయాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తెలియజేశామని, అలాగే ఆర్థిక కార్యదర్శిని కూడా కలశామని చెప్పారు. పాన్ తప్పనిసరి నిబంధనలను రూ. 2 లక్షలు-10 లక్షల విలువైన బం గారు ఆభరణాల కొనుగోలు లావాదేవీలకు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం కోసం ప్రస్తుత బడ్జెట్ వరకు వేచిచూస్తామని, ఎలాంటి స్పందన లేకపోతే అటు తర్వాత నిరవధిక సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు. కాగా ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజేఏ) ఈ సమ్మెకు దూరంగా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top